ETV Bharat / entertainment

నిఖిల్​ కార్తికేయ 2కు వార్నింగ్​ ఇవ్వడంపై దిల్​రాజు వివరణ

author img

By

Published : Aug 16, 2022, 3:27 PM IST

Updated : Aug 16, 2022, 3:42 PM IST

కార్తికేయ-2 విడుదల విషయంలో తనపై జరిగిన ప్రచారంపై నిర్మాత దిల్​రాజు వివరణ ఇచ్చారు. సినిమాలను ఎవరు తొక్కాలని చూడరని అన్నారు. అవాస్తవాలు రాసే ముందు నిజాలు తెలుసుకుని రాయండి అని చెప్పుకొచ్చారు.

Dilraju About Karthikeya 2 warning
నిఖిల్​ కార్తికేయ 2కు దిల్​రాజు వార్నింగ్​

కార్తికేయ-2 విడుదల విషయంలో తనపై జరిగిన ప్రచారంపై దిల్ రాజు వివరణ ఇచ్చారు. సినిమాలను ఎవరు తొక్కాలని చూడరని చెప్పుకొచ్చారు. "జూన్‌, జులైలో విడుదలైన సినిమాలను చూసి టాలీవుడ్‌ పరిస్థితిపై భయమేసింది. ఆగస్టులో విడుదలైన 'బింబిసార', 'సీతారామం', ఇప్పుడు 'కార్తికేయ 2' ధైర్యాన్ని ఇచ్చాయి. ఇండస్ట్రీకి కొత్త ఊపిరిలూదిన కార్తికేయ 2 చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఎలాంటి కథల్ని ఎంపిక చేసుకోవాలి? అనే విషయంలో ఈ సినిమాలు మాకు ఓ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ సినిమా విడుదల గురించి నేనూ నిఖిల్‌ చాలా రోజులు చర్చించాం. జులై 8న మా చిత్రం 'థాంక్యూ'ని రిలీజ్‌ చేయాలనుకున్నా.. కుదర్లేదు. అప్పుడు కార్తికేయ 2 నిర్మాతల్లో ఒకరైన వివేక్‌కి ఫోన్‌ చేసి.. 'మీ సినిమాని జులై 22న విడుదల చేయాలనుకుంటున్నారు కదా. మాకు అవకాశం ఇస్తారా?' అని అడిగా. సినిమాల మధ్య క్లాష్‌ రాకుండా ఉండేందుకు మేం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో మాట్లాడుతుంటాం. కార్తికేయ 2 విషయంలోనూ అదే చేశాం. వివేక్‌ చెప్పటంతో నిఖిల్‌, దర్శకుడు చందు నన్ను కలిసేందుకు మా ఇంటికి వచ్చారు. 'మీరు ఫలానా తేదీ కావాలన్నారట కదా సర్‌. మేం మరో తేదీన మా సినిమాని విడుదల చేస్తాం' అని చెప్పి వారి సినిమాను వాయిదా వేసుకున్నారు. అక్కడితో సమస్య తీరింది. వారికి నేను సపోర్ట్‌ ఇస్తానని చెప్పా. అలా కార్తికేయ 2ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకున్నారు. ఈలోపే కొందరు 'సినిమాను తొక్కేస్తున్నారు' అంటూ తమకు తోచింది రాసేశారు. ఏ సినిమా ఆడినా నిర్మాతలమంతా ఆనందిస్తాం. మా మధ్య ఆరోగ్యకర వాతారణం ఉంది. సినిమా సక్సెస్‌ మీట్‌లో నేను ఇలా మాట్లాడటం చాలా బాధగా ఉంది. మాట్లాకపోతే ఇండస్ట్రీలో ఐక్యత లేదనుకుంటారు. నిర్మాతలమంతా సరిగ్గా ప్లాన్‌ చేసుకుని సినిమాలను విడుదల చేస్తుంటాం"

"నాపై గతంలోనూ చాలా వదంతులు వచ్చాయి. అలాంటి వాటిని నేనెప్పుడూ పట్టించుకోను. నిఖిల్‌ తన కెరీర్‌ ప్రారంభం నుంచీ నాకు బాగా పరిచయం. తాను నటించే సినిమా కథలను నాతో పంచుకుంటుంటాడు. ఆ చనువుతోనే తన మేనేజరుతో కలిసి మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. 'ఆగస్టు 12న వేరే సినిమాలు విడుదలవుతున్నాయి. ఏం చేయాలి' అని అడిగాడు. డిస్ట్రిబ్యూటర్లని సంప్రదించి, క్లాష్‌ లేకుండా ఒక రోజు ముందో వెనకో విడుదల చేయండి అని సలహా ఇచ్చా. అలా కార్తికేయ 2 ఆగస్టు 13న రిలీజ్‌ అయింది. ఒక రోజు తేడాతో విడుదలకావటంపైనా మళ్లీ రాద్దాంతం చేశారు" అని అన్నారు.

ఇక కార్తికేయ 2 విషయానికొస్తే.. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర సూపర్​హిట్​ టాక్​తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. డెరెక్టర్​ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. ఆదిత్యా మేనన్, తులసి, ప్రవీణ్, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాను విడుదల చేశారు మేకర్స్​. ఉత్తరాది ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.

ఇదీ చూడండి: తల్లికాబోతున్న స్టార్​ హీరోయిన్​, బేబీబంప్​తో సర్​ప్రైజ్​

Last Updated : Aug 16, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.