ETV Bharat / crime

MURDER CASE UPDATE: ఆ ఫోన్​ కోసమే.. మహిళ హత్యా?

author img

By

Published : Jul 19, 2022, 1:36 PM IST

MURDER CASE UPDATE: ఎవరైనా బంగారం కోసమో లేక డబ్బులు కోసమో చోరీలు చేయడం.. ఇంట్లో వాళ్లు ఎదురుతిరిగితే హత్య చేయడం లాంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి.. అవి మనం చదువుతూనే ఉన్నాము. తాజాగా ఎన్టీఆర్​ జిల్లా సత్యనారాయణపురంలో కూడా ఇలానే జరిగింది. కాకాపోతే ఫోన్​ కోసం దొంగతనానికి వచ్చిన దుండగులు.. ఎదురుతిరిగిన మహిళను అతికిరాతకంగా హత్య చేశారు. అదేంటి ఫోన్​ కోసం దోపిడి చేయడం ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవండి..

MURDER CASE UPDATE
MURDER CASE UPDATE

MURDER CASE UPDATE: సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని రైల్వే ఉద్యోగి భార్య సీత (50) హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉన్న పాతకాలం నాటి ల్యాండ్‌ ఫోన్‌ కోసమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ కేసులో చాలా మంది ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రైల్వే ఉద్యోగుల పాత్రపైనా కీలక సమాచారం లభించినట్లు సమాచారం. పాత ల్యాండ్‌ఫోన్లు, టీవీలు ఉంటే లక్షల్లో డబ్బు ఇస్తామని కొన్ని ముఠాలు తిరుగుతున్నాయి. పాతకాలం నాటి ల్యాండ్‌ ఫోన్‌ రైల్వే ఎస్‌అండ్‌టీ శాఖకు చెందిన సీత భర్త సత్యనారాయణ వద్ద ఉన్నట్లు అతని స్నేహితులకు తెలిసింది. అప్పటి నుంచి దానిపై కన్నేసిన దుండగులు.. ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని పథకం వేశారు. ఫోన్‌ దక్కితే లక్షల్లో డబ్బులు వస్తాయని గ్రహించి, సత్యనారాయణ ఇంట్లో లేని సమయంలో పథకం ప్రకారమే అక్కడికి వెళ్లారు. ఫోన్‌ కోసం మృతురాలితో గొడవపడి, పెనుగులాటలో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఫోన్‌తో పాటు మహిళ మెడలో డబ్బు, బంగారం వస్తువులు ఎత్తుకెళ్లారు.

పట్టించిన కాల్‌ డేటా..: హత్య జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోని సెల్‌ టవర్లన్నీ జల్లెడపట్టిన పోలీసులు.. కీలక సమచాచారాన్ని రాబట్టారు. దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఓ రైల్వే ఉద్యోగి.. తనకు ఏమీ తెలియదనట్లు హత్య జరిగినప్పటి నుంచి అక్కడే తచ్చాడుతున్నాడు. డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది ఆధారాలు సేకరిస్తుండగా.. జాగిలాలు ఆ ఉద్యోగిని పట్టించాయి.

పోలీసులకు సవాలుగా మారిన కేసు..

హత్య జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నగర సీసీఎస్‌ పోలీసులకు కేసును అప్పగించారు. నార్త్‌ ఏసీపీ రమణమూర్తి, సీసీఎస్‌ సీఐ రామ్‌కుమార్‌, సత్యనారాయణపురం సీఐ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందం విచారణ చేపట్టి హత్య కేసును ఛేదించారు. మంగళవారం పోలీసు అధికారులు నిందితులను అరెస్టు చూపించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇదీ జరిగింది: సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని 75/బి క్వార్టర్‌లో నివసించే కె.సత్యనారాయణ రైల్వే ఎస్‌ అండ్‌ టీ విభాగంలో పని చేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో యథావిధిగా ఉద్యోగానికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి వచ్చారు. భార్య సీత(50) ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికుల సహాయంతో వెనుక నుంచి లోపలికి వెళ్లి చూడగా.. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోటిలో వస్త్రాలు కుక్కి స్పృహ లేనిస్థితిలో పడి ఉంది. వెంటనే రైల్వే ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం, అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌ బృందాలతో ఇంటి పరిసరాల్లో క్షుణ్ణంగా గాలించారు. ఇంట్లో బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ముగ్గురు యువకులు ఉదయం నుంచి ఆ ప్రాంతంలో తచ్చాడినట్లు సమీపంలో నివసించే రైల్వే సిబ్బంది చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.