ETV Bharat / crime

మద్యం తాగుతూ కుప్పకూలారు.. మృతిపై అనుమానాలు

author img

By

Published : May 3, 2022, 8:14 AM IST

LIQUOR DEATHS
మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు మృతి

LIQUOR DEATHS: ఇద్దరు వ్యక్తులు ఓ దుకాణం (బంకు) దగ్గర ఆరుబయట కూర్చొని మద్యం తాగుతూ ఒకేసారి కుప్పకూలారు... ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఉదంతం కలకలం రేపింది. వారిద్దరూ వడదెబ్బతో చనిపోయారంటూ కుటుంబీకులతో బలవంతంగా చెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

LIQUOR DEATHS: చిలకలూరిపేటలోని గుర్రాలచావిడి సౌదాఘర్‌ వీధికి చెందిన మస్తాన్‌ షరీఫ్‌ (52), అంకమ్మపార్కు ప్రాంతానికి చెందిన బషీర్‌ అహ్మద్‌ (35) స్నేహితులు. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కలిసి తరచూ మద్యం తాగుతుంటారు. కృష్ణమహల్‌ కూడలిలో సోమవారం ఉదయం 8.30 సమయంలో ఒక దుకాణం దగ్గర ఇద్దరూ మద్యం తాగుతూ కూర్చున్నారు. ఉన్నట్లుండి మస్తాన్‌ షరీఫ్‌కు ఫిట్స్‌లాగా వచ్చి పడిపోయాడు. అతడిని చూసి బషీర్‌ అహ్మద్‌ పడిపోయాడు. చుట్టుపక్కల వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరినీ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమంగా మారడంతో కాటూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమవారు వడదెబ్బతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఏ కారణంతో చనిపోయారో వైద్య నివేదిక వచ్చాక తెలుస్తుందని సీఐ జి.రాజేశ్వరరావు చెప్పారు.

అనుమానాలెన్నో: మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే వారు వడదెబ్బ వల్ల చనిపోయారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది తేలాలంటే పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఆ నివేదిక రాకుండా, కారణాలేమిటో వైద్యులు నిర్ధరించకుండానే.. తమ వారు వడదెబ్బ వల్ల చనిపోయారని కుటుంబీకులు ఎలా చెప్పారనేది మిస్టరీగా మారింది. వారు తాగింది మద్యమా, సారాయా? దానిని ఎక్కడ కొనుగోలు చేశారు? ఈ కోణాల్లో ఆరా తీయాల్సిన పోలీసు యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నించలేదు. హడావుడిగా పోస్టుమార్టం చేయించి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించడానికే ప్రాధాన్యమిచ్చారనే విమర్శలొచ్చాయి.

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు: చిలకలూరిపేటలో మద్యం తాగి మృతి చెందిన రెండు బాధిత కుటుంబాలను మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఇద్దరి మృతికి కారణమని భావిస్తున్న చీప్ లిక్కర్ శాంపిళ్లపై ఫోరెన్సిక్ నివేదికను నిజాయితీగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ కారణంగా చనిపోయినట్లు తేలితే ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి: 8న కర్నూలు జిల్లాలో.. జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: నాదెండ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.