ETV Bharat / crime

గోదావరిలో స్నానానికి వెళ్లి.. ముగ్గురు జల సమాధి

author img

By

Published : Apr 4, 2022, 3:30 PM IST

Updated : Apr 5, 2022, 9:44 AM IST

three members died
పోలవరం సమీపంలో గోదావరిలో దిగి ముగ్గురు మృతి

15:27 April 04

తమ పరిస్థితి ఏమిటంటూ కుటుంబ సభ్యుల రోదన

పోలవరం సమీపంలో గోదావరిలో దిగి ముగ్గురు మృతి

పొట్టకూటి కోసం పనులు చేయడానికి ఆరుగురు యువకులు వచ్చారు. పనులు ముగించుకుని గోదావరి ఒడ్డుకు బహిర్భూమికి వెళ్లి అనంతరం స్నానాలకు దిగారు. ఈ క్రమంలో నదిలో మునిగి ముగ్గురు మృత్యువాత పడిన హృదయ విదారక ఘటన ఏలూరు జిల్లా పోలవరంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన గెడ్డం మహేష్‌ (23), గెడ్డం సుబ్రహ్మణ్యం (19), జానపాటి రాజేష్‌ మరో ముగ్గురితో కలిసి పోలవరంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి ఇనుము ఊచలు కట్టే (రాడ్‌ బెండింగ్‌) పనుల కోసం వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయానికి పనులు ముగించుకున్నారు. మేస్త్రీ వచ్చి మంగళవారం బాబూజగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని తొందరగా ఇళ్లకు వెళ్లి అక్కడ పనులు చక్కబెడదామని చెప్పడంతో సరేనన్నారు. బహిర్భూమి కోసమని పోలవరంలోని మసీదు వీధి గోదావరి రేవుకు వెళ్లారు. ముందుగా నదిలోకి దిగిన కొందరు స్నానం ముగించుకుని ఒడ్డుకు వచ్చారు. తరువాత దిగిన గెడ్డం సుబ్రహ్మణ్యం, జానపాటి రాజేష్‌ నీటిలో మునిగిపోవడం చూసి వారిని రక్షించేందుకు చేయి అందించే ప్రయత్నంలో గెడ్డం మహేష్‌ మునిగిపోయారు. తోటి స్నేహితులు తమ కళ్లముందే గల్లంతవ్వడంతో మిగిలిన ముగ్గురు హతాశులయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ కె.లతాకుమారి, ఎస్సై ఆర్‌ శ్రీను, తహశీల్దార్‌ బి సుమతి ఘటన స్థలానికి చేరుకున్నారు. మత్స్యకారులు వలలతో గాలించి మృతదేహాలను వెలికి తీశారు.

రోదనలతో ఘొల్లుమన్న రేవు.. గెడ్డం మహేష్‌, సుబ్రహ్మణ్యం అన్నదమ్ములు. ఆ కుటుంబానికి వారే పెద్ద దిక్కు. చెల్లి పదో తరగతి చదువుతోంది. పనులకు వెళ్లి తల్లిదండ్రులను పోషిస్తూ, చెల్లిని చదివిస్తున్నారు. రేపటి నుంచి తమ పరిస్థితి ఏమిటంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. జానపాటి రాజేష్‌కు ముగ్గురు అక్కలు. తమ్ముడి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతులందరిదీ ఒకే వీధి కావడంతో కొవ్వూరుపాడు నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

స్థానికులే భయపడుతున్నారు: వరదల నుంచి గ్రామానికి రక్షణగా చేపట్టిన పనులు, వరదల ఉద్ధృతి, గతంలో ఇసుక ర్యాంపు పేరుతో జరిగిన తవ్వకాల కారణంగా పోలవరం వాసులు నదిలో స్నానం చేయాలంటేనే భయపడుతున్నారు. నది పొడవునా రేవులు అస్తవ్యస్తంగా మారాయి. గట్టు ఎక్కి దిగాలంటేనే స్థానికులు భయపడుతున్నారు. మిట్టమధ్యాహ్నం వేళ అందరూ ఇళ్లకే పరిమితమైన సమయంలో ఊరు కాని ఊరు నుంచి గోదావరిలో దిగి మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది. సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి నది వెంబడి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డీఎస్పీ లతాకుమారి ఎస్సైని ఆదేశించారు.

మహేష్‌, సుబ్రహ్మణ్యం, రాజేష్‌ (పాతచిత్రాలు)​​​​​​​

ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చాక.. జిల్లాలు సరిచేస్తాం : చంద్రబాబు

Last Updated :Apr 5, 2022, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.