ETV Bharat / crime

చెరువులో గల్లంతైన మరో ముగ్గురి మృతదేహాలు వెలికితీత

author img

By

Published : Mar 25, 2022, 6:43 PM IST

ఈత సరదా ప్రాణాలను మింగేస్తోంది. వేసవి ఉపశమనానికి చెరువులు, కుంటల్లో దూకుతున్న పిల్లలు... ప్రమాదవశాత్తు మునిగిపోయి.... ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. మార్చి నెల ప్రారంభమైననాటి నుంచే పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది.

water
water

ఓ వైపు భానుడి భగభగలు, మరో వైపు ఒంటి పూట బడులు. నిండుకుండల్లా చెరువులు, బావులు. సరదా కోసం ఈతకు వెళ్తున్న పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదే తరహాలో సంగారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన ఘటన 3 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. నారాయణఖేడ్ జంట గ్రామం మంగళ్‌పేట్‌కు చెందిన కోట పండరి, రేణుకల ఇద్దరు కుమారులు సంపత్‌, సాయిచరణ్‌... శ్రీనివాస్‌ కుమారుడు మహేశ్‌, కల్హేర్‌ మండలం ఖానాపూర్‌కు చెందిన వినోద్‌లు స్నేహితులు. గురువారం నారాయణఖేడ్‌లోని ఓ పాఠశాలలో ఆపి ఉన్న సైకిళ్లను తీసుకెళ్లిన వీరంతా మనూరు మండలం కమలాపూర్‌ చెరువు వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు నీటిలోకి దిగిన పిల్లలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.

వారంతా పదేండ్ల వయసే! : కాసేపటి తర్వాత మహేశ్‌ మృతదేహం చెరువులో తేలటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టి.... మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు. గురువారం నుంచి గాలించిన గజ ఈతగాళ్లు ఉదయం సాయిచరణ్‌, సాయి సంపత్‌, వినోద్‌ మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన పిల్లలంతా పది, పన్నెండేళ్ల వయసున్నవారే ఉన్నారు. మృతిచెందిన వారిలో ఒకే ఇంటికి చెందిన ఇద్దరుండగా... వేరువేరు కుటుంబాలకు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. అభం శుభం తెలియని చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి.... వారి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు.వేసవిలో చెరువులు, బావుల వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు స్పందించి.... నీటి వనరుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి: "నాన్నా..పేదవాళ్లు చదువుకోకూడదా... డబ్బున్నవాళ్లే చదువుకోవాలా?"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.