ETV Bharat / crime

ఈ నంబర్​కి కాల్ చేస్తే.. సైబ‌ర్ బాధితుల డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి!

author img

By

Published : Jul 1, 2022, 8:25 AM IST

Cyber Crime
Cyber Crime

Cyber Crime: సైబ‌ర్ నేరాల‌పై పోలీసులు అవగాహన క‌ల్పిస్తున్నా.. ఎంతోమందిని అరెస్టు చేస్తున్నా.. బాధితులు సంఖ్య త‌గ్గడం లేదు. హైద‌రాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో.. నిత్యం పదుల సంఖ్యలో సైబర్ నేరాల కేసులు నమోదవుతున్నాయి. నేర‌స్తులపై నిఘా పెరిగే కొద్దీ.. కొత్త పంథాల్లో అమాయ‌కుల‌ను బురిడీ కొట్టిస్తున్నారు. బాధితుల కోసం ఇప్పటికే కేంద్రం నేష‌న‌ల్ సైబ‌ర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణ పోలీసులు ఏర్పాటుచేసిన సైబర్‌ క్రైం కో-ఆర్డినేషన్‌ సెంటర్ ద్వారా.. రూ.15 కోట్లకుపైగా సొమ్మును కాపాడగలిగారు.

Cyber Crime: సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ... ఆన్‌లైన్‌లో మోసాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లకు అమాయకులే బలవుతుండగా... ఇప్పుడు అన్నీ తెలిసినవారు కూడా బురిడీగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. హైదరాబాద్‌ పరిధిలో రోజుకు పదుల సంఖ్యలో సైబర్‌ నేరగాళ్ల బాధితులు... పోలీసులను ఆశ్రయిస్తున్నారు. హైద‌రాబాద్‌కి చెందిన ఓ యువ‌తి జూన్ 18న ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్‌లో పెట్టుబ‌డి పెట్టి మోసపోయాన‌ని సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆన్‌లైన్‌లో సమాచారం తెలుసుకున్న యువతి... బిట్‌కాయిన్ల కోసం సైబర్‌ నేరగాళ్లు తెలిపిన ఖాతాకు 11ల‌క్షలు బదిలీ చేసింది. అనంత‌రం మోసపోయాన‌ని గ్రహించి... నేష‌న‌ల్ సైబ‌ర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.

వెంట‌నే కేసు తెలంగాణ సైబ‌ర్ క్రైం కో-ఆర్డినేష‌న్ సెంట‌ర్‌కు బ‌దిలీచేయగా... స్పందించిన రాష్ట్ర పోలీసులు ఆమె ఖాతాలో లావాదేవీల‌పై బ్యాంకు అధికారుల‌కు స‌మాచారమిచ్చారు. ఆమె ఖాతా నుంచి వివిధ ఖాతాల‌కు వెళ్లిన 11 ల‌క్షల న‌గ‌దును బ్యాంకు అధికారులు నిలిపివేశారు. న్యాయ ప్రక్రియ పూర్తవ‌గానే... ఆ న‌గ‌దును పోలీసులు ఆమె ఖాతాకు బ‌దిలీ చేయ‌నున్నారు. ఈ కేసు ద్వారా ప్రజ‌లు సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని అధికారులు చెబుతున్నారు. వెంట‌నే ఫిర్యాదు చేయ‌డం ద్వారా... సైబ‌ర్ నేర‌గాళ్లు కాజేసిన సొమ్ము తిరిగి ర‌ప్పించే అవ‌కాశముంటుంద‌ని చెబుతున్నారు.

ఏదైనా సైబ‌ర్ నేరం జ‌రిగిన‌పుడు వెంటనే గుర్తించి నేష‌న‌ల్ సైబ‌ర్ క్రైం పోర్టల్‌ లేదా... 1930 అనే హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫిర్యాదుచేయాలని సైబర్‌క్రైం పోలీసులు సూచిస్తున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో సైబ‌ర్ నేరాల‌పై స‌త్వర ఫిర్యాదుల కోసం.... 24 గంట‌లు అందుబాటులో ఉండే సైబ‌ర్ క్రైం కో-ఆర్డినేష‌న్ సెల్‌కు రిపోర్ట్ చేయ‌వచ్చు. ఆర్థికప‌ర‌మైన సైబ‌ర్ నేరాలు జ‌రిగితే అవి వెంట‌నే సిటిజ‌న్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ విభాగంలోకి వెళ్తాయి. దీంతో కో-ఆర్డినేష‌న్ సెంట‌ర్‌తో అనుసంధానమై ఉన్న సుమారు 70కిపైగా బ్యాంకులు, ఆర్ధిక స‌ంస్థలు, వ్యాలెట్ల నోడల్‌ అధికారులు వెంటనే స్పందిస్తారు. వెంట‌నే ఫిర్యాదు చేయ‌డం ద్వారా... బాధితుడి ఖాతా నుంచి న‌గ‌దు ఎక్కడికి వెళ్లినా... నోడల్‌ అధికారులు వాటిని నిలిపివేస్తారు. సైబ‌ర్ క్రైం కో-ఆర్డినేష‌న్ సెల్ గతేడాది జూన్‌లో ప్రారంభం కాగా.... ఇప్పటివరకూ ఫిర్యాదు చేసిన బాధితులకు సంబంధించిన రూ.15కోట్ల 48 లక్షల నగదును నిందితుల ఖాతాల్లోకి వెళ్లకుండా నిలుపుదల చేశారు.

ఎక్కడుంటారో తెలియ‌దు కానీ... ఖాతాల్లోని ల‌క్షల రూపాయల నగదును సైబర్‌ నేరగాళ్లు ఖాళీ చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలు వినియోగం తప్పనిసరిగా మారగా... కొందరు అత్యాశకు పోయి ఖాతాను ఖాళీ చేసుకుంటున్నారు. మరికొందరు అవగాహన లేక మోసపోతున్నారు. అస‌లేం జరిగిందో తెలిసేలోపే... బాధితుల ఖాతాల్లోంచి కాజేసిన సొమ్మును విత్‌డ్రా చేసుకుంటున్నారు. అలా కాకుండా నేరం జ‌రిగిన వెంట‌నే ఫిర్యాదు చేస్తే... సైబర్‌ మోసగాళ్ల ఆగడాలను అరికట్టడంతోపాటు బాధితుల సొమ్మును కాపాడుతామని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.