ETV Bharat / crime

చీకోటి ప్రవీణ్​ కూడబెట్టిన ఆదాయాలపై ఈడీ నజర్​..

author img

By

Published : Jul 30, 2022, 12:52 PM IST

ED ON PRAVEEN
ED ON PRAVEEN

ED ON PRAVEEN: క్యాసినో నిర్వహణతో చీకోటి ప్రవీణ్‌ కూడబెట్టిన ఆదాయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూపీ లాగుతోంది. విదేశాల్లో రూ.కోట్ల దందా నిర్వహించినట్లు ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తోంది. అదంతా హవాలా మార్గంలోనే జరిగిందని ఈడీ విశ్వసిస్తోంది. లోగుట్టును బహిర్గతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

DON PRAVEEN: క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. చీకోటి ప్రవీణ్‌ గుట్టుగా సాగిస్తున్న దందాను నిగ్గు తేల్చడంపై అధికారులు దృష్టి సారించారు. శుక్రవారం జూబ్లీహిల్స్, బేగంబజార్, సికింద్రాబాద్‌లో నలుగురు హవాలా ఏజెంట్లను ప్రశ్నించారు. వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా.. ప్రవీణ్‌ హవాలా దందా సమాచారాన్ని రాబట్టే పనిలో పడ్డారు. కొన్నేళ్లుగా క్యాసినో ద్వారా ఎంత సొమ్మును హవాలా మార్గంలో తీసుకొచ్చాడు..? డబ్బుతో ఆస్తులెక్కడ కొనుగోలు చేశాడనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్‌తో సన్నిహితంగా మెలిగిన ఓ ఏజెంట్ నుంచి కీలక సమాచారం రాబట్టడంపై ఈడీ బృందాలు దృష్టిపెట్టాయి. హవాలా దందాలో అతడే కీలకమని.. రాజకీయ, సినీ ప్రముఖులతోనూ సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన చార్టర్డ్ ఫ్లైట్లను సమకూర్చడంలోనూ అతడికి అనుభవం ఉండటంతో మరింత సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు.

జూన్‌లో నేపాల్‌లో జరిగిన క్యాసినో కోసం ఓ ఏవియేషన్ సంస్థ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులను చార్టర్డ్ ఫ్లైట్లలో తరలించినట్లు ఈడీకి సమాచారం అందింది. రవాణా ఖర్చులను సంస్థకు ఎవరు చెల్లించారనే అంశంపై విచారిస్తున్నారు. ఇప్పటికే ఓ డీసీసీబీ అధికారి వెళ్లినట్లు నిర్ధరణ కావడంతో జాబితాలో మరికొందరు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీకి కీలకంగా వ్యవహరించి ఇటీవలే పార్టీ మారిన మరోనేత వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. వారి గురించిన వివరాలు తెలుసుకునేందుకు నేపాల్‌ జాపాలోని హోటల్ మేచీక్రౌన్‌లో నాలుగు రోజుల సీసీ ఫుటేజీలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటర్ల జాబితా తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆ విషయంపై స్పష్టత వస్తే రాజకీయ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి హవాలా సొమ్ముకు సంబంధించి విచారించే అవకాశం ఉంది.

భారీ స్థాయిలో బర్త్​డే వేడుకలు..: హైదరాబాద్‌లో గత నెల 23న ప్రవీణ్ తన జన్మదిన వేడుకలను భారీస్థాయిలో నిర్వహించాడు. నేపాల్‌లో క్యాసినో నిర్వహించి వచ్చిన 10 రోజులకే వేడుకలతో హంగామా చేయడంపై ఈడీ ఆరా తీస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున హాజరైన ఆ వేడుక.. కీలక ఏజెంట్ కనుసన్నల్లో సాగినట్లు చెబుతున్నారు. వేడుకకు రూ.కోట్లలోనే ఖర్చు చేసినట్లు దృశ్యాల ఆధారంగా అంచనా వేస్తున్నారు. అందుకు డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారనే కోణంలో ప్రవీణ్‌ను సోమవారం విచారణలో ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫాం​హౌస్​లో తనిఖీలు..: మరోవైపు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలోని ప్రవీణ్‌ ఫాం​హౌస్‌లో జంతు అక్రమ రవాణా ఆరోపణలతో అధికారులు తనిఖీ నిర్వహించారు. అక్కడ మాట్లాడే రామచిలుకలు, ఉడుములు, బల్లులు, ఊసరవెల్లులు, ఆస్ట్రిచ్‌, గుర్రాలు ఉన్నట్లు తెలిపారు. ప్రాథమిక పరిశీలనలో నిబంధనలకు విరుద్ధంగా ఏం లేవని యాంటీ పోచింగ్ స్క్వాడ్ రేంజర్ రమేశ్​ కుమార్ వెల్లడించారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.