ETV Bharat / crime

Cyber Crimes: కేవైసీ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే..!

author img

By

Published : Jun 6, 2021, 8:10 AM IST

Cyber criminals' new move with KYC
Cyber criminals' new move with KYC

కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) వివరాలు నవీకరించాలంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా.. అవి పచ్చి మోసమని గ్రహించండి. సైబర్‌ నేరస్థులు నెట్‌బ్యాంకింగ్‌ ఖాతాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) వివరాలు నవీకరించాలంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా.. అవి పచ్చి మోసమని గ్రహించండి. సైబర్‌ నేరస్థులు నెట్‌బ్యాంకింగ్‌ ఖాతాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. నాలుగురోజుల్లో 8 మంది నుంచి రూ.9.65 లక్షలు స్వాహా చేశారు. సైబర్‌ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారని, వారికి ఎలాంటి వివరాలు చెప్పకూడదని తెలిసినా ఒక విశ్రాంత డిప్యూటీ బ్యాంక్‌ మేనేజర్‌ మూడురోజుల క్రితం రూ.90 వేలు పోగొట్టుకున్నారు.

అప్​డేట్ పేరుతో...

హైదరాబాద్‌లో ఉంటున్న ఒక రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారికి కొద్దిరోజుల క్రితం సైబర్‌ నేరస్థుడు ఫోన్‌ చేశాడు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ వినియోగిస్తున్న మీ వివరాలు నవీకరించాలన్నాడు. 3 రోజుల క్రితమే రూ.645లతో రీ-ఛార్జీ చేయించానని, అప్పుడు చిరునామా, పేరు అప్‌డేట్‌ చేశామని విశ్రాంత అధికారి చెప్పారు. ‘మీరు స్థానికంగా చేసుంటారు.. టెలికాం సర్కిల్‌ కార్యాలయానికి వివరాలు కావాలి. సింపుల్‌గా అంతా మీరే చేసుకోండి’ అంటూ ఓ యాప్‌ను మాజీ అధికారితో డౌన్‌లోడ్‌ చేయించాడు.

పది రూపాయలు రుసుం చెల్లించండి అంటూ ఒక బ్యాంక్‌ ఖాతా నంబరు చెప్పాడు. విశ్రాంత ఐపీఎస్‌ పిన్‌ సహా వివరాలన్నీ ఆ యాప్‌లో నమోదు కావడంతో వాటి ద్వారా రూ.49వేల చొప్పున ఐదుసార్లు రూ.2.45 లక్షలు నగదు లాగేశాడు. బాధితుడు వెంటనే సైబర్‌ క్రైం వారిని సంప్రదించారు. వారు నెట్‌బ్యాంకింగ్‌ ప్రతినిధులను అప్రమత్తం చేసి రూ.1.95లక్షల నగదు సైబర్‌నేరస్థుడి ఖాతాలోకి వెళ్లకుండా నిలపగలిగారు.

* బంజారాహిల్స్‌లో ఉంటున్న లక్ష్మణ్‌ యాదవ్‌ నుంచి రెండు రోజుల క్రితం రూ.లక్ష తీసుకున్నారు. ఎయిర్‌టెల్‌ సిమ్‌కార్డు అప్‌డేట్‌ చేస్తే.. ఆరునెలలపాటు రూ.200 ఉచిత టాక్‌టైమ్‌ వస్తుందని చెప్పారు.

* బేగంపేటలో నివాసముంటున్న ఒక మహిళా ఐటీ కన్సల్టెంట్‌కు మూడు రోజుల క్రితం సైబర్‌ నేరస్థుడు ఫోన్‌ చేశాడు. జియో నెట్‌వర్క్‌ ప్రతినిధిని అని చెప్పాడు. మీ పేరు, వివరాలు తప్పుగా ఉన్నాయి. రూ.10 చెల్లించి నవీకరించాలని ఒక లింక్‌ పంపాడు. ఆమె లింక్‌ను క్లిక్‌ చేయగానే.. ఆమె ఖాతాలోంచి రూ1.52 లక్షలు కొట్టేశాడు.

పది రూపాయలు చాలు అంటూ..

కేవైసీ అంటే తగిన వివరాలు తీసుకొని ఈ ఖాతాదారు తనకు తెలుసు అని సంబంధిత సంస్థ నిర్ధారించడం. బ్యాంకులు సహా పలు సంస్థలు ఈ ప్రక్రియను తప్పనిసరి చేశాయి. ఇది పూర్తయితేనే పూర్తి సేవలు అందుతాయి. దీనిని అవకాశంగా మలచుకొని సైబర్‌ నేరస్థులు చెలరేగిపోతున్నారు. సెల్‌ఫోన్‌ వివరాలు నవీకరించాలంటూ ఫోన్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ పద్ధతుల్లో చేస్తామని చెప్పి పది రూపాయలు పంపించేందుకు ఒక లింక్‌ పంపుతున్నారు.

దాన్ని క్లిక్‌ చేయగానే.. అందులో మీ వివరాలను నమోదు చేయాలని చెబుతున్నారు. పదిరూపాయలు పంపించినట్టు క్లిక్‌ చేయగానే.. క్షణాల్లో బాధితుల ఖాతాల్లోంచి రూ.లక్షలు మాయమవుతున్నాయి.

జాంతారా మాయాజాలం..

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని జాంతారా కేంద్రంగా సైబర్‌ నేరస్థులు ఇలా కొత్త తరహా మోసాలకు తెరదీశారు. వేర్వేరు నెట్‌వర్క్‌ కంపెనీల వినియోగదారుల వివరాలను వారు గంపగుత్తగా కొంటున్నారు. బెంగళూరు, ముంబయి, దిల్లీ, నోయిడాల్లో పొరుగుసేవల్లో పనిచేస్తున్న వారి నుంచి వెయ్యి నంబర్లను రూ.100 ఇచ్చి తీసుకొంటున్నారు. తర్వాత పేర్లు, చిరునామాలను సేకరిస్తున్నారు.

రోజుకు వందమంది నుంచి 150 మందికి ఫోన్‌ చేసి బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో కంపెనీల ప్రతినిధులమంటూ మాట్లాడుతున్నారు. ఎవరన్నా వారి వలలో పడగానే క్షణాలలో వారి ఖాతా నుంచి నగదును లాగేస్తున్నారు. దాన్ని వేరే ఈ-వాలెట్లకు తరలిస్తున్నారు. నేరుగా వారి ఖాతాల్లో జమచేసుకుంటే పోలీసులకు అనుమానం వస్తుందని ఈ-వాలెట్లను వినియోగించుకుంటున్నారు.

వెంటనే స్పందించండి

కేవైసీ పేరుతో నగదు పోగుట్టుకున్న వారు వేగంగా స్పందించాలి. సైబర్‌ నేరస్థులను పట్టుకునేందుకు 94906 16555కు వాట్సప్‌ ద్వారా సమాచారం ఇవ్వండి. బాధితుల సొమ్ము నేరస్థుల ఖాతాల్లోకి వెళ్లినా వెంటనే పోలీసులను సంప్రదిస్తే నేరస్థులు తీసుకోకుండా అడ్డుకోవచ్చు.

-సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్‌

ఇదీ చదవండి:

TS corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.