ETV Bharat / city

స్వచ్ఛ దీపావళికి సాగరవాసుల ప్రచారం

author img

By

Published : Nov 12, 2020, 5:14 PM IST

Updated : Nov 12, 2020, 5:45 PM IST

దీపావళి అంటే భారీ శబ్దాలు చేసే టపాసుల పండగ కాదని.. దీపాల వెలుగులతో ఆనందించే పండగ అంటున్నారు విశాఖలోని పర్యావరణ ప్రేమికులు. కరోనా సమయంలో రసాయనాలు వెదజల్లే బాణసంచా కాల్చడం వల్ల మరింత ప్రమాదమని అంటున్నారు. దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

crackers-to-diwali
crackers-to-diwali

విశాఖ ఆఫీషల్ కాలనీలో మూడేళ్ల క్రితం ఏర్పాటుచేసిన నేచర్స్ క్లబ్ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు పెంచాలని మొదలైన ఈ సంస్థ.. ఈ ఏడాది దీపావళి పండగ వల్ల వచ్చే ధ్వని, వాయు కాలుష్య నివారణకు నడుం కట్టింది. కరోనా సమయంలో పీల్చే గాలి రసాయనాలు నిండితే శ్వాస కోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కొవిడ్ వచ్చి తగ్గిన వారు ఈ గాలి పీలిస్తే ప్రాణాలకు ప్రమాదమని అంటున్నారు. అందుకే విశాఖ కలెక్టర్ కార్యాలయ సమీప ప్రాంతాలు ఎంపిక చేసుకుని రోజు సాయంత్రం సమయంలో నగర వాసులను బాణాసంచా వద్దని చైతన్య పరుస్తుంది నేచర్స్ క్లబ్.

దీపావళికి టపాసులు కాల్చవద్దని నేచర్స్ క్లబ్ సభ్యులు అవగాహన
దీపావళికి టపాసులు కాల్చవద్దని నేచర్స్ క్లబ్ సభ్యులు అవగాహన

బాణసంచాలో వాడే సల్ఫర్, బేరియం నైట్రేట్ రసాయనాలు చాలా ప్రమాదకరమని నేచర్స్ క్లబ్ సభ్యులు అంటున్నారు. గాలిలో నిలిచిపోయే ఈ రసాయనాలు ప్రజల శ్వాసవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు.

నేచర్స్ క్లబ్ చేస్తున్న కార్యక్రమానికి గాజువాకకు చెందిన మరో స్వచ్ఛంద సంస్థ అడజస్ట్ ఫర్ సంస్థ తోడైంది. ఈ రెండు సంస్థలు దీపావళికి బాణసంచా కాల్చడం ఆపాలని ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. గతంలో హుద్ హుద్ సమయంలో నగరమంతా ఒక తాటి పైకి వచ్చి దీపావళి చేసుకోలేదని...మళ్ళీ ఇప్పుడు కరోనా సమయంలోనూ ప్రజలు ఐకమత్యంగా టపాసులు కాల్చకుండా దీపాలు వెలిగించి పండగ చేసుకోవాలని కోరుతున్నారు. అత్యధిక శబ్దం చేసే టపాసులు వేస్తేనే దీపావళి కాదని, పర్యావరణాన్ని కాపాడితే భవిష్యత్ తరాలకు మరిన్ని వెలుగులు పంచినవాళ్లు అవుతామని ఈ సంస్థలు చెబుతున్నాయి.

పర్యావరణం కోసం ఆలోచిస్తున్న ఈ యువతకు స్థానికులు అండగా నిలుస్తున్నారు. బాణసంచాను కాల్చబోమని చెబున్నారు. విశాఖ సాగరతీరంలో దీపావళి సమయంలో మరింత కలుషితమై సముద్ర జీవరాసులకు ముప్పు వాటిల్లుతుందని స్థానికులు చెబుతున్నారు. కనీసం ఈ దీపావళి నుంచి రసాయనాలు ఉన్న బాణసంచా వదిలి, దీపాల వెలుగులతో దీపావళి జరుపుకుంటామని అంటున్నారు.

కరోనా రెండో దశ భయపెడుతున్న సమయంలో ఈ రసాయనాలు వల్ల మనిషి రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. అందుకే దీపాలు వెలిగించి రంగులతో శోభాయమానంగా పండగ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి

ఇకపై రైళ్లలోనే జీరో ఎఫ్ఐ​ఆర్ నమోదు..!

Last Updated : Nov 12, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.