ETV Bharat / city

దక్షిణ కోస్తా రైల్వేజోన్​కు బడ్జెట్​లో నిధులు శూన్యం..!

author img

By

Published : Feb 4, 2021, 4:49 PM IST

విశాఖ కేంద్రంగా ఏర్పడాల్సిన దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు. బడ్జెట్‌ తర్వాత నిధులు కేటాయింపులో భాగంగా రైల్వేబోర్డు ఇచ్చే పింక్‌బుక్‌ వివరాలు బుధవారం రాత్రి వెల్లడయ్యాయి. గతేడాది బడ్జెట్‌లో దక్షిణకోస్తా జోన్‌ ఏర్పాటు ప్రక్రియకు రూ.3కోట్లు ఇచ్చినా.. ఈసారి బడ్జెట్‌లో దాన్ని ఖర్చు చేసినట్లు కూడా పింక్‌బుక్‌లో చూపలేదు.

There is no funding allocation for the South Coast Railway in the Union Budget
దక్షిణకోస్తా రైల్వేజోన్​కు బడ్జెట్​లో నిధులు శూన్యం

రైల్వేజోన్‌ ఏర్పడేందుకు విశాఖ మీద శ్రద్ధ కన్నా.. ఒడిశాలోని రాయగడ డివిజన్‌ ఏర్పాటు మీదే ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.3కోట్లలో కొంత వరకు ఈ నూతన డివిజన్‌ కోసం ఖర్చు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. తాజా బడ్జెట్‌లో ఈ డివిజన్‌ ఏర్పాటుకు మరో రూ.40లక్షలు కేటాయించారు. విశాఖ ప్రస్తావన ఎక్కడా లేదు. కొత్త జోన్‌ ప్రక్రియ కోసం రూ.179.90 కోట్లు ఇది వరకూ మంజూరు చేశారు. ఈ నిధులు పేరుకే ఉన్నా.. ప్రత్యేకంగా జనరల్‌ మేనేజర్‌ అధికారిని నియమించడం, ఇతర ఉద్యోగుల్ని కేటాయించడం, కనీసం రైల్వేమంత్రిత్వశాఖలో పెండింగ్‌లో ఉన్న డీపీఆర్‌కు అనుమతివ్వడం వంటివి పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.

'వాల్తేరు'కు.. రూ.1422కోట్లు: వాల్తేరు డివిజన్‌కు ఈ బడ్జెట్‌లో రూ.1422 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ మొత్తంలో ఇతర డివిజన్లతో కలిసిన రైల్వేలైన్లు, ఇతర పనులూ ఉన్నాయి. అలాగే జోన్‌ కార్యాలయం భువనేశ్వర్‌ నుంచి వాల్తేరుకు రావాల్సిన మరికొన్ని నిధులు పైనా స్పష్టత రావాల్సి ఉంది.

వీటి ప్రస్తావనే లేదు: విశాఖకు ప్రత్యామ్నాయంగా మర్రిపాలెం టెర్మినల్‌ను 6 ప్లాట్‌ఫామ్‌లతో నిర్మించేందుకు డీపీఆర్‌ను సిద్ధంచేసి రైల్వేబోర్డుకు పంపారు. దీనికి ఆమోదం లభించనట్లుగా తెలుస్తోంది. గోపాలపట్నం-విశాఖపట్నం 3వ లైను, పెందుర్తి-సింహాచలం నార్త్‌ మధ్య సులభతర సరకు రవాణాకోసం రైల్వే ఫ్లైఓవర్‌, విజయనగరం-కొత్తవలస 4వ లైనుకు సంబంధించిన ఎలాంటి నిధులూ ఈసారి రాలేదు.


ఇదీ చదవండి:

అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.