ETV Bharat / city

వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది: తెదేపా

author img

By

Published : Nov 24, 2020, 4:04 PM IST

వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని తెదేపా నేతలు విమర్శించారు. భవనాల కూల్చివేత, అభివృద్ధిని అడ్డుకోవటమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. విశాఖ ఎయిర్​పోర్టు ఆపాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాశారో చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు.

వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది
వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది

వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, తెదేపా నేత చినరాజప్ప విమర్శించారు. విశాఖ ఎయిర్​పోర్టు ఆపాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో భవనాల కూల్చివేతే లక్ష్యంగా వారానికో నిర్మాణాన్ని కూల్చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే సబ్బంహరి, శ్రీహర్ష, గీతం సంస్థలు, కాశీలకు చెందిన నిర్మాణాలను ఇప్పటి వరకు కూల్చేశారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో తెదేపాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని.., రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పుష్కర స్నానాలు జరుగుతున్న తీరు దారుణం

తుంగభద్ర పుష్కర స్నానాలు జరుగుతున్న తీరు దారుణమని తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత విమర్శించారు. జగనన్న షవర్ బాత్ పేరిట 250 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం కనీసం రోడ్లు కూడా వేయలేదని దుయ్యబట్టారు.

రాజధాని పేరుతో విశాఖలో భూకుంభకోణాలు

విశాఖలో రాజధాని పేరుతో వైకాపా నేతలు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. భోగాపురం పూర్తి చేయకుండా విశాఖ ఎయిర్​పోర్ట్​లో సర్వీసులు నిలుపుదల చేయాలని ఎంపీ విజయసాయి లేఖ రాయటం దారుణమన్నారు. జీఎంఆర్​కు మేలు చేయటం కోసం ఈ తరహా చర్యలు పాల్పడ్డారని ఆరోపించారు.

సంప్రదాయానికి తూట్లు పొడుస్తున్నారు

చట్టసభల్లో చనిపోయిన సభ్యుల స్థానాల్లో జరిగే ఉపఎన్నికలకు సంబంధించి కుటుంబ సభ్యులకే సీటు ఇచ్చే సంప్రదాయానికి జగన్ తూట్లుపొడిచారని టీడీఎల్పీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. శోభానాగిరెడ్డి చనిపోతే ఏకగ్రీవానికి చంద్రబాబు సహకరించారన్న ఆయన..., నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిపై జగన్ పోటీపెట్టారని గుర్తు చేశారు. మండలి రద్దు ప్రకటించి బల్లిదుర్గాప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ ఇస్తాననటం మోసపూరితమేనన్నారు.

ఇదీచదవండి

మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్​ తరలింపు కీలకం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.