ETV Bharat / city

విశాఖ విమానాశ్రయ భూములపై.. కేంద్రానికి రాష్ట్రం లేఖలు!

author img

By

Published : Apr 24, 2022, 5:43 AM IST

visakha airport
visakha airport

విశాఖ విమానాశ్రయ భూముల అంశం చర్చనీయాంశమవుతోంది. 2002లో విమానాశ్రయ అవసరాలకు వీలుగా 74 ఎకరాలను రాష్ట్రం కేటాయించింది. వాటిని తిరిగి ఇచ్చేయాలని ఇటీవల కేంద్రానికి రాష్ట్ర అధికారులు లేఖలు రాసినట్లు విశ్వసనీయ సమాచారం.

విశాఖ విమానాశ్రయ భూముల అంశం చర్చనీయాంశమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయోనన్నది ఆసక్తిగా మారింది. 2002లో విమానాశ్రయ అవసరాలకు వీలుగా 74 ఎకరాలను రాష్ట్రం కేటాయించింది. వాటిని తిరిగి ఇచ్చేయాలని ఇటీవల కేంద్రానికి రాష్ట్ర అధికారులు లేఖలు రాసినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖకు సమీపంలో విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి సన్నాహాలు సాగుతున్న నేపథ్యంలో అది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం విశాఖలో ఉన్న విమానాశ్రయ కార్యకలాపాలు గణనీయంగా తగ్గుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సదరు భూముల్ని వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

ఆ 74 ఎకరాల్లో: విశాఖ విమానాశ్రయానికి ఉన్న 375 ఎకరాల్లో రాష్ట్రం ఇచ్చిన 74 ఎకరాలూ ఉన్నాయి. వీటిని వివాహనాలు నిలిపే స్థలాలకు, అంతర్గత రహదారుల నిర్మాణానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించారు. అవన్నీ ప్రాంగణం అంతర్భాగంగా మారాయి. వాటిని వేరు చేస్తే విమానాశ్రయ రూపురేఖలు మారిపోతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏం చేస్తారో: భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియదు. అయినా విశాఖలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తుండడంతో కేంద్రం ఆ భూముల అప్పగింతపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఉత్కంఠగా మారింది. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి ఇస్తే... వాటిని ఇతర సంస్థలకు కేటాయిస్తే యుద్ధ విమానాల శిక్షణ కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందేమోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

కీలక స్థావరం: విశాఖ విమానాశ్రయం రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో ఉంది. ఇక్కడికి ఏ సర్వీసు నడవాలన్నా ఆ శాఖ అనుమతులు అవసరం. వాస్తవానికి ఇక్కడే పలు యుద్ధవిమానాల పైలట్లకు శిక్షణ ఇస్తుంటారు. నౌకాదళ వాయుస్థావరం ‘ఐ.ఎన్‌.ఎస్‌.డేగా’ పేరుతో నౌకాదళ అధికారులు మౌలిక సదుపాయాల్ని వినియోగించుకుంటున్నారు. దేశ రక్షణ పరంగా అత్యంత కీలకమైన వాయు స్థావరంగా దీనిని పరిగణిస్తుంటారు. ఇందులో అంతర్భాగంగా మారిన భూములను వెనక్కి ఇస్తే రక్షణ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ఒకసారి భూములను కేంద్రానికి ఇచ్చిన తరువాత తిరిగి తీసుకునే ప్రక్రియ సంక్లిష్టమైనది. ఇది ఎలా కొలిక్కి వస్తుందోన్నది చూడాలి. భోగాపురం అందుబాటులోకి వచ్చినా విశాఖ విమానాశ్రయాన్ని యథాతథంగా కొనసాగించాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించినట్లు సమాచారం. కాకపోతే కార్యకలాపాలు, ఉద్యోగుల సంఖ్య తగ్గవచ్చు. శంషాబాద్‌ విమానాశ్రయం ఏర్పాటైనా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను కొనసాగిస్తున్న విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.

భూముల వివరాలు అడిగారు

విశాఖ విమానాశ్రయ భూముల వివరాలను కేంద్ర ఉన్నతాధికారులు అడిగారు. వారికి అవసరమైన సమాచారం ఇచ్చాం. భూములను వెనక్కి అప్పగించే అంశం మా పరిధిలో ఉండదు. కొత్తది వచ్చినా విశాఖ విమానాశ్రయం కొనసాగుతుంది. - కె.శ్రీనివాసరావు, డైరెక్టర్‌, విశాఖ విమానాశ్రయం

ఇదీ చదవండి: 'కంకర అక్రమ తవ్వకాలు... నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్​ నియామాకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.