స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏటా అక్కడ నల్ల జెండాలు ఎగిరేవి. అందుకు భిన్నంగా తొలిసారిగా ఈ ఏడాది జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి గిరిజనులతో పాటు సరిహద్దు పోలీసు బలగాలు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవాలు’ సందడిగా నిర్వహించాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కటాఫ్ ఏరియా మూడు దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోట. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఏటా ఆగస్టు 15న ఈ ప్రాంతంలో వీరు నల్లజెండాలు ఎగరవేసేవారు. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ క్యాంపుల ఏర్పాటు తరువాత తొలిసారిగా ఈ ఏడాది మువ్వన్నెల జెండా ఎగిరింది. ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా - ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సరిహద్దు గ్రామాల్లో జాతీయ జెండాలు ఎగరవేశారు. బీఎస్‌ఎఫ్-09 బెటాలియన్ ఆధ్వర్యంలో సరిహద్దులోని బోడోపొదర్, బోడోపొడ, పంపర్‌మెట్ల, దూలిపుట్, నక్కమామిడి, పనసపుట్, ఆండ్రాపల్లి, జొంత్రి తదితర ప్రాంతాల్లో ఆజాదీకా అమృత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామాల్లోని మావోయిస్టు స్తూపాల వద్ద సైతం జాతీయ జెండాలు ఎగరవేసి ఉత్సవాలను నిర్వహించారు.
ఇదీ చదవండి: