ETV Bharat / city

MILAN 2022 : ఆర్కేబీచ్‌లో మిలన్ 2022 ... అబ్బుర పరిచిన గగనతల విన్యాసాలు

author img

By

Published : Feb 27, 2022, 6:04 AM IST

MILAN 2022 : మిలన్-2022 పూర్తి స్థాయి డ్రస్‌ రిహార్సల్స్ శనివారం సాయంత్రం అత్యంత ఆకర్షణీయంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ పాల్గొన్నారు. నేవీ మెరైన్ కమాండోలు చేసిన సాహసకృత్యాలు భారత నౌకాదళ బృందం ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచాయి. ఎటువంటి పరిస్థితికైనా భారత్ సిద్ధంగా ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పారు.

MILAN 2022
MILAN 2022

MILAN 2022 : విశాఖ బీచ్‌లో జరుగుతున్న మిలాన్‌-2022 రిహార్సల్‌ ఘనంగా జరుగుతున్నాయి. శనివారం పెద్ద సంఖ్యలో నేవీ కుటుంబాల ప్రతినిధులు, సాధారణ ప్రజలు హాజరై.... గగనతలంలో నేవీ యుద్ద విమానాలు, హెలీకాప్టర్లు చేసిన విన్యాసాలను తిలకించారు. గగన తలం నుంచి పారాషూట్లలో దిగిన నావికులు.... భారత శౌర్య పరాక్రమాలను చాటి చెప్పారు. వివిధ దేశాల ప్రతినిధులు కూడా వీటిని వీక్షించారు. అంతర్జాతీయ సిటీ పరేడ్‌లో భాగంగా నౌకాదళం, త్రివిధ దళాలు కవాతు చేశాయి. ఇందులోనూ వివిధ దేశాల నౌకాదళాల సిబ్బంది కవాతుచేశారు.

ఆర్కేబీచ్‌లో మిలన్ 2022 ... అబ్బుర పరిచిన గగనతల విన్యాసాలు

అగ్రదేశాల సరసన భారత్

ఆత్మనిర్భర్ భారత్‌ ద్వారా... ప్రపంచంలోని తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న 25 అగ్రదేశాల సరసన భారత్ చేరిందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అన్నారు. మిలన్ 2022 ద్వారా మిత్రదేశాలమధ్య మరింత సహకారం పెంపొందించడమే లక్ష్యంగా భారత్ నిర్వహిస్తోందని, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ అన్నారు.

మిలాన్‌ కార్యక్రమం 1995 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పుడు 4 దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కూడా... 39 దేశాల ప్రతినిధులు ఈ మిలాన్‌ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ప్రపంచ దేశాలు ఒకరికొకరు సాయం చేసుకోవాడానికి మన పూర్వీకులు ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. మనందరిది ఒకే కుటుంబం అనే భావన చాటి చెప్పారు. అది విశాఖలో మేము చూశాము.- అజయ్ భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి

మిలన్ గ్రామం
మిలన్ 2022 ప్రారంభం సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన స్ధావర యూనిట్లలో ఒకటైన సముద్రిక ఆడిటోరియం సమీప ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మిలన్ గ్రామాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రారంభించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్ సహా పలు దేశాల ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించారు. ఇందులో భారతీయ హస్త కళలను ప్రదర్శించారు. కళాకారులు తయారు చేసిన పలు ఆకృతులను, బొమ్మలను, అలంకరణ సామగ్రితో కూడిన 40 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా నేవీ బ్యాండ్

మిలన్ 2022 సందర్భంగా సముద్రిక అడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో భారత నౌకాదళ బ్యాండ్ అలపించిన సంగీతం అందరిని ఆకర్షించింది. 39మందికి పైగా విదేశీ రాయబారులు, నేవీ చీఫ్ లు, 13 దేశాల యుద్ద నౌకల ప్రతినిధులు హాజరైన ఈ ప్రారంభోత్సవ సమావేశంలో నేవీ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందేమాతరంతో ప్రారంభమైన నేవీ బ్యాండ్ కొన్నిప్రాచుర్యం పొందిన సినీమ్యూజిక్‌లను కూడా వినిపించి అందరిని అహ్లాదపరిచింది.

ఇదీ చదవండి : "మిలన్-2022"ను ప్రారంభించిన కేంద్రమంత్రి అజయ్ భట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.