ETV Bharat / city

NADENDLA MANOHAR: 'రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఖనిజ దోపిడీ'

author img

By

Published : Aug 19, 2021, 7:37 PM IST

గతంలో తూర్పుగోదావరి వంతాడలో బాక్సైట్​ అక్రమ తవ్వకాలకు పాల్పడినట్లే ఇప్పుడు భమిడికలొద్దిలోనూ మైనింగ్​ అక్రమాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ ఆరోపించింది. అధికారంలోని నేతల అండదండలతోనే ఇవి జరుగుతున్నాయని పార్టీ నేత నాదెండ్ల మనోహర్​ అన్నారు. దీనిపై తాము నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అన్నారు.

రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఖనిజ దోపిడీ
NADENDLA MANOHAR

రాష్ట్రంలో ఖనిజ సంపద దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని జనసేన పార్టీ ఆరోపించింది. తూర్పు గోదావరి జిల్లా వంతాడలో లేటరైట్ ఖనిజం తవ్వకం పేరుతో విలువైన బాక్సైట్ ఖనిజాన్ని లక్షల టన్నులు తరలించేస్తున్నారని.. ఈ విషయాన్ని 2018 లోనే తమ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజల ముందుకు తెచ్చారని రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. వంతాడలో ఆండ్రూ కంపెనీ తవ్వకాలు సాగించి డంప్ చేసే ప్రాంతానికి పవన్‌ కల్యాణ్‌ వెళ్లి అక్కడ జరుగుతున్న దోపిడీని బయటకు తెచ్చారని అన్నారు. అప్పట్లో లేటరైట్ ముసుగులో బాక్సైట్ ఎలా దోచేశారో ఇప్పుడు కూడా అదే విధంగా ఖనిజ దోపిడీ సాగుతోందని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు దాటవేత ధోరణిలో మాట్లాడుతోంది..? అని ప్రశ్నించారు.

భమిడికలొద్దిలో మైనింగ్​ అక్రమాలు..

అప్పుడు వంతాడలో అక్రమానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నారో ఇప్పుడు భమిడికలొద్దిలోనూ అదే విధంగా అక్రమాలకు తెర తీశారని నాదెండ్ల మనోహర్​ ఆరోపించారు. వంతాడలో ఆండ్రూ కంపెనీ 34 లక్షల మెట్రిక్ టన్నుల బాక్సైట్ ఖనిజాన్ని వేదాంత కంపెనీకి తరలించినట్లు ఇప్పటి గనుల శాఖ అధికారులు చెబుతున్నారని అన్నారు. ఆ తవ్వకాలకు కొద్దిపాటి దూరంలో ఉన్న భమిడికలొద్ది వద్ద జరుగుతున్న తవ్వకాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.

ఖనిజ తరలింపునకు రోడ్లు..

భౌగోళికంగా భమిడికలొద్ది విశాఖ జిల్లాలోను, వంతాడ తూర్పుగోదావరిలోను ఉన్నా వాటి మధ్య దూరం ఎక్కువ కాదనే విషయాన్ని మరచిపోవద్దన్నారు. భమిడికలొద్దిలో సాగుతున్న తవ్వకాలపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా తవ్వేసిన విలువైన ఖనిజాన్ని తరలించేందుకు అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ నిధులతో రోడ్డు వేసిన మాట నిజమా కాదా..? అని ప్రశ్నించారు. ఆ రోడ్డు కోసం పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు.

దెబ్బతిన్న భూగర్భ జలాలు..

వంతాడలో చేసిన మైనింగ్ వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు దెబ్బ తిన్నాయని.. అక్కడి ప్రజల జీవితాలు కష్టాల పాలయ్యాయన్నారు. ఇప్పుడు భమిడికలొద్ది ప్రాంత గిరిజనుల పరిస్థితి కూడా అలాగే తయారైందన్నారు. ఆ పరిస్థితిని స్వయంగా చూసి ప్రజలకు తెలిపేందుకు వంతాడ ప్రాంతానికి పవన్ కల్యాణ్ వెళ్తుంటే అక్రమార్కులు ఎన్నో ఆటంకాలు కల్పించారన్నారు. అధికార పక్షం మాటలనే.. గనుల శాఖ అధికారులు వినిపిస్తే కచ్చితంగా గ్రీన్ ట్రైబ్యూనల్స్ లోనూ, న్యాయస్థానాల్లోనూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని.. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణ చేపట్టి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ న్యాయం చేస్తుందనే విశ్వాసం తమకు ఉందన్నారు.

ఇదీ చదవండి: ISO CERTIFICATION: విశాఖ ఆంధ్రా వైద్య కళాశాలకు ఐఎస్‌ఓ ధృవీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.