ETV Bharat / city

Dharmana ఇది ధర్మాన గారి దోపిడీ

author img

By

Published : Oct 15, 2022, 8:47 AM IST

Minister Dharmana prasadarao:విశాఖను రాజధాని చేయాలంటూ మంత్రి ధర్మాన ఇటీవల ఉద్వేగంగా మాట్లాడుతున్నారు..! ఉత్తరాంధ్ర వేదికపై ఉద్రిక్త ప్రసంగాలు చేస్తున్నారు..! పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై శివాలెత్తుతున్నారు..! విశాఖ రాజధాని కోసం రాజీనామాకైనా సిద్ధమని ప్రకటించేశారు..! ఈ మాటలన్నీ విన్నవారు... ఆయనేదో ఉత్తరాంధ్ర ఉద్యమకారుడని భ్రమపడ్డారు..! కానీ ‘సిట్‌’ నివేదిక బయటికొచ్చాకే తెలిసింది... ధర్మాన తపనంతా విశాఖలో అప్పనంగా కొట్టేసిన భూములపైనే అని..! ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ఉపన్యాసాలు దంచుతున్న ధర్మాన లాంటివాళ్లను చూశాకే అర్థమవుతోంది.. వెనుకబడింది ఉత్తరాంధ్రే గానీ, ఆయన లాంటి నాయకులు కాదని..! అధికారం చలాయించి.. అధికారుల్ని అదిరించి... రికార్డులు మార్పించి... విశ్రాంత సైనికోద్యోగులకు చెందిన వందల కోట్ల విలువైన 70 ఎకరాలకు పైగా భూముల్ని ఖాతాలో వేసేసుకున్నారు..! విశాఖ రాజధానిగా మారితే... ఆ భూముల విలువ ఒక్కసారిగా రెండు, మూడింతలు కావడం ఖాయం. అందుకే... ఎన్నికల ముందు ఓట్ల కోసం అమరావతే రాజధాని అంటూ నినదించిన ధర్మాన... ఇపుడు మడమ తిప్పి, ధర్మం తప్పి రైతులపై విషం చిమ్ముతున్నారు.

Ministers illegal assets
మంత్రి ధర్మాన ప్రసాదరావు

ఆ కుంభకోణాల్లో ధర్మాన ప్రసాదరావే సూత్రధారి

Minister Dharmana prasadaraor:చూశారుగా.. ధర్మాన గారి వీరావేశం. ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్లిపోతారట. ఉత్తరాంధ్రపై ప్రేమతో ఇదంతా చేసినట్లు కనిపిస్తున్నా... అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఉన్నఫళంగా విశాఖ రాజధాని అయితే... గతంలో తాను అక్రమంగా పోగేసిన భూముల విలువను భారీగా పెంచుకోవచ్చని ఆయన ఆశ పడుతున్నారు. ధర్మాన మాటల్లోని మర్మమిదే.

అత్యంత కీలకమైన రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు... ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనూ అవే బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో యంత్రాంగంపై అధికారం చలాయించి... విశాఖ శివార్లలో వందల కోట్ల విలువైన భూములు సొంతం చేసుకున్నారు. మాజీ సైనిక ఉద్యోగుల పేరుతో విశాఖ చుట్టుపక్కల ప్రభుత్వం ఇచ్చిన డీఫాం పట్టా భూములు అమ్ముకునేందుకు వీలుగా... నిరభ్యంతర పత్రాలు జారీ చేయించారు. అనంతరం ఆ భూములన్నీ తన కుటుంబసభ్యులు, స్నేహితులు, వారి కంపెనీల పేరిట రిజిస్టర్‌ చేయించేశారు. విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో ఏకంగా 71.29 ఎకరాలను ధర్మాన ఈ విధంగా గుప్పిట పట్టినట్లు.. విశాఖ భూకుంభకోణాలపై గత ప్రభుత్వ హయాంలో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌ తేల్చిచెప్పింది.

ఈ కుంభకోణాల్లో ధర్మాన ప్రసాదరావే సూత్రధారి, పాత్రధారి అని నిర్ధరించిన సిట్ నివేదిక... ఈనాడు-ఈటీవీ- ఈటీవీ భారత్​కి అందింది. ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఈ అనుమతులు వచ్చాయని.. సామాన్యులకు ఇలా ఎన్ఓసీలు దక్కే అవకాశమే లేదని కూడా స్పష్టంచేసింది. ఈ వ్యవహారంలో ధర్మాన పాత్రపై మరింత లోతైన దర్యాప్తు జరగాలని సిఫార్సు చేసింది. అలాగే ఈ కుంభకోణంలో భాగమైన అధికారులు, రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారని సిట్ స్పష్టంచేసింది. కొన్ని కేసుల్లో డీఫాం భూముల కేటాయింపు తీరూ ప్రశ్నార్థకమైంది. నిజంగా వారు మాజీ సైనికోద్యోగులా.? కాదా.? అసలు ఎప్పుడు వారికి భూములు కేటాయించారనే విషయాల్లో వచ్చిన అనుమానలకు సమాధానాలు దొరకలేదు. మాజీ సైనిక ఉద్యోగులుగా భూములు విక్రయించిన కొందరు.. విచారణ సమయంలో ఎక్కడున్నారో కూడా సిట్‌ గుర్తించలేకపోయింది.

విశాఖ రూరల్‌ మండల అటవీ, రెవెన్యూ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని, రికార్డులు ట్యాంపరింగ్‌ చేశారని, 2017 మే నెలలో బయటికొచ్చింది. భూఅక్రమాలపై 2015లోనే అప్పటి విశాఖ తహసీల్దార్‌ సుధాకర్‌నాయుడు.. కలెక్టర్‌కు ఓ నివేదిక సమర్పించినట్లు తేలింది. 2015కు ముందు వివిధ రెవెన్యూ కార్యాలయాల పరిధిలో జరిగిన అక్రమాలు, రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌పై ఉన్నతాధికారులకు కొందరు అధికారులు ముందే తెలియజేసినట్లు నిర్ధరణ అయింది. ఈ పరిస్థితుల్లో ఆనాటి గ్రేహౌండ్స్‌ డీఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆధ్వర్యాన.. విశాఖ జేసీ జి.సృజన, డిప్యూటీ కలెక్టర్‌ లంకా విజయసారథి సభ్యులుగా 2017 జూన్‌ 20న ప్రభుత్వం సిట్‌ ఏర్పాటుచేసింది. విశాఖ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వందల కోట్ల విలువైన భూములకు సంబంధించిన అక్రమాలను వెలికితీసిన సిట్‌, అప్పటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటికీ వెలుగుచూడని ఆ నివేదిక.. తాజాగా ఈనాడు- ఈటీవీ- ఈటీవీ భారత్ చేతికి చిక్కింది. అప్పటి, ఇప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు పాత్రను.. సిట్‌ నివేదికలో కీలకంగా ప్రస్తావించింది. ఈ నివేదిక రాజకీయ ప్రేరేపితం అనుకోవడానికీ లేదని, అదే ఉద్దేశమైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ధర్మానపై చర్యలు తీసుకునే వారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మాజీ సైనికులు, రాజకీయ బాధితుల పేరుతో పట్టాలు సృష్టించి రికార్డులు తారుమారు చేసిన ధర్మాన.. వాటికి నిరభ్యంతర పత్రాలు పొందారు. ఆ తర్వాత తన కుటుంబసభ్యులు, సన్నిహితుల పేరిట భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కొన్ని కేసుల్లో డీఫాం భూములు పొందినవారు మాజీ సైనిక ఉద్యోగులు, అధికారులే అయినా.. వారికి ఆ విధంగా భూమి పొందే అర్హత లేదని విచారణలో వెలుగుచేసింది. వారి నుంచి భూములు చేతులు మారి, మంత్రి కుటుంబీకులకు చేరినా... అసలు వ్యక్తులు ఎక్కడున్నారో సిట్ కనుక్కోలేకపోయింది. ఈ భూముల దందాలో రికార్డులు మార్చడం ఒక ఎత్తయితే, కొన్ని కేసుల్లో రికార్డులను కూడా గుర్తించలేకపోయారు. కొన్ని భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ అనుమతులు లభించిన సమయంలో... ధర్మాన ప్రసాదరావే రెవెన్యూ మంత్రిగా ఉన్నారని కూడా సిట్‌ నివేదికలో పేర్కొంది. ఈ భూములను పొందిన పేదలు లేదా మాజీ సైనిక ఉద్యోగులు వాటిని అమ్ముకోవాలన్నా, వారి నుంచి ఎవరైనా కొనాలన్నా... జిల్లా కలెక్టర్‌ నిరభ్యంతర పత్రాలు జారీ చేయాలి. సరైన తనిఖీలు, పరిశీలన లేకుండానే ఈ భూముల క్రయవిక్రయాలకు అప్పటి విశాఖ జిల్లా అధికారులుఎన్​ఓసీలు ఇచ్చేశారని సిట్‌ తేల్చింది. ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఇదంతా జరిగిందని నిర్ధరించింది. ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టర్లు లవ్‌ అగర్వాల్, జె.శ్యామలరావుతో పాటు సంయుక్త కలెక్టర్ల పాత్రనూ తప్పుబట్టింది.

మాజీ సైనిక ఉద్యోగులుగా పేర్కొంటూ విశాఖ రూరల్, పరవాడ మండలాల్లో ప్రభుత్వం నుంచి కొందరు పొందిన 71.29 ఎకరాల డీఫాం భూముల్నని.. మంత్రి ధర్మాన కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు చేజిక్కుంచుకున్నట్లు సిట్‌ తేల్చింది. ఇందుకోసం ధర్మాన హయాంలోనే 20 నిరభ్యంతర పత్రాలు జారీ అయ్యాయి. భూయజమానుల నుంచి ధర్మాన భార్య లక్ష్మి, కుమారుడు రామమనోహర్‌ నాయుడు, సోదరుడు ధర్మాన రామదాస్‌తో పాటు స్నేహితులు, బంధువుల పేరిట మారిపోయాయి. కోరమాండల్‌ ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ కంపెనీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన రామదాస్‌ డైరెక్టర్‌. మరో డైరెక్టర్‌ ఐ.బీ కుమార్‌ ధర్మానకు అత్యంత సన్నిహితుడు. ఓంకాన్‌ రియల్టర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ కంపెనీలోనూ ధర్మాన రామదాస్ డైరెక్టర్‌. ఈ సంస్థ పేరిట కొన్ని భూములు రిజిస్ట్రేషన్‌ చేశారు. రెండు కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా ఉన్న రామదాస్‌ పేరిట కొన్ని భూములు నేరుగా కొన్నారు.

ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామమనోహర్‌ నాయుడు పేరుపైనా కొన్ని భూముల కొనుగోళ్లు జరిగాయి. కొన్ని సర్వే నంబర్లలో ఇతరులు కొన్నా... చివరికి ఆ భూమి రామమనోహర్‌ చేతికి చిక్కింది. ఒక సర్వే నెంబర్‌లో డీఫాం భూములు మొదట గుబ్బల గోపాలకృష్ణ చేతికి చిక్కగా.... ఆ తర్వాత ధర్మాన భార్య లక్ష్మి పేరుతో రిజిస్టరయ్యాయి. ధర్మాన సన్నిహితుడు ఐ.బీ కుమార్‌ భార్య జి.ప్రసన్న కూడా భూముల కొనుగోలుదారుల జాబితాలో ఉన్నారు. కోరమాండల్‌ ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్న గుబ్బల గోపాలకృష్ణ కుమార్తెను ఐ.బీ కుమార్‌ పెళ్లి చేసుకున్నాడు. ఇక భూములు దక్కించుకున్న ఎస్. రవికుమార్, అల్లు కేశవ వెంకట జోగినాయుడు, జాస్తి భాస్కరరావు, పి.నాగేంద్రప్రసాద్‌లలో... కొందరు ధర్మానకు బంధువులు, మరికొందరు స్నేహితులు.

మాజీ సైనిక ఉద్యోగుల పేరుతో పొందిన డీఫాం పట్టా భూములు అమ్ముకునేందుకు ఎన్​ఓసీలు జారీ చేయాల్సిందిగా కలెక్టర్లకు స్వయంగా మంత్రి ధర్మాన సిఫార్సులు చేశారని సిట్‌ నివేదిక తేల్చింది. డీఫాం పట్టాలు పొందిన పదేళ్లకు ఆ భూములు అమ్ముకోవచ్చంటూ 1993 నవంబర్ 11న జారీ చేసిన జీవో నెంబరు 1117 ఆధారంగా... ఆయన ఈ సిఫార్సులు చేశారు. అసైన్డ్‌ భూముల అక్రమాలు జరిగే సమయానికే విశాఖ జిల్లాలో అనేక అరాచకాలు జరిగినట్లు గుర్తించారు. తప్పుడు డీఫాం పట్టాలు సృష్టించి, వాటి ఆధారంగా ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేసేస్తున్నారని ప్రభుత్వ దృష్టికి రావడంతో... డీఫాం పట్టా భూములను రిజిస్టర్‌ చేయవద్దని అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆదేశించారు. తహసీల్దార్ అనుమతులతో కాకుండా కలెక్టర్‌కు తెలియజేసి... ఆయన స్వయంగా అనుమతిస్తేనే అసైన్డు భూములు, డీఫాం భూములు రిజిస్ట్రేషన్‌ చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. వీటిని ఉల్లంఘించి మరీ భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు సిట్‌ నిర్ధరణ చేసింది. కలెక్టర్ల నుంచి అనుమతులు రాకముందే కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేసేశారు.

విశాఖ జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడలో సర్వే నెంబర్ 437/1లో 5.14 ఎకరాల డీఫాం పట్టా భూమి అమ్ముకునేందుకు... అప్పటి కలెక్టర్‌ జె.శ్యామలరావు అనుమతులు ఇవ్వడాన్ని సిట్‌ తప్పుబట్టింది. మంత్రి ధర్మాన బంధువులు ఈ భూములను కొంటుండటం వల్లే కలెక్టర్‌ అనుమతిచ్చారు తప్ప... సాధారణ పరిస్థితుల్లో అలాంటి అవకాశమే లేదని స్పష్టంగా పేర్కొంది. విశాఖ గ్రామీణ మండలం మధురవాడలో సర్వే నెంబర్ 355/4లోని 5 ఎకరాల డీఫాం భూమి అమ్మకాల వ్యవహారంలోనూ ధర్మాన పాత్ర ఉందని, దీనిపై లోతైన విచారణ జరపాలనీ సిట్‌ పేర్కొంది. పరవాడ మండలం పెదముషిడివాడకు చెందిన సత్యాడ అప్పారావు... 3.95 ఎకరాల భూమి అమ్ముకునేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేయడంలోనూ అవకతవకలు జరిగాయి.

ఈ భూములను ధర్మాన రామదాస్,ఐ.బీ. కుమార్‌ డైరెక్టర్లుగా ఉన్న కోరమాండల్‌ ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కొన్నారు. ఈ భూముల అమ్ముకునేందుకు ఎసైనీకి కలెక్టర్‌ ఎన్​ఓసీలు జారీ చేశారు. ధర్మాన ప్రసాదరావు జోక్యంతోనే ఇది సాధ్యమైనట్లు సిట్‌ తెలిపింది. ఆ భూములు చివరికి ధర్మాన కుటుంబానికే చేరినట్లు స్పష్టంచేసింది. ప్రస్తుత ఐఏఎస్‌ అధికారి, అప్పట్లో విశాఖ జిల్లా డీఆర్గ్​ఓగా ఉన్న సత్యనారాయణ.. కొన్ని రోజులపాటు ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఏకంగా 28.72 ఎకరాలకు ఎన్​ఓసీలు జారీ చేశారు. కలెక్టర్‌ అనుమతితోనే ఎన్​ఓసీలు ఇవ్వాల్సి ఉన్నా... ఆయన ప్రమేయం లేకుండానే ఇన్‌ఛార్జి జేసీ హోదాలో సత్యనారాయణ నిరభ్యంతర పత్రాలు జారీ చేయడాన్ని సిట్‌ తీవ్రంగా తప్పుబట్టింది.

విశాఖ నగరంతోపాటు జిల్లాలో నకిలీ డీఫాం పట్టాల ఆధారంగా భూబదలాయింపు జరుగుతోందని... 2005 నవంబర్‌లో విశాఖపట్నం జిల్లా రిజిస్ట్రార్‌కు అప్పటి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ తెలియజేశారు. ఆ భూముల రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, కలెక్టర్‌ నుంచి అనుమతి ఉంటే తప్ప డీఫాం భూములకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని... 2005లో మెమో ద్వారా జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ‘మాజీ సైనికులకు ఇచ్చిన డీపట్టా భూములను... 1993 నాటి జీవో నెంబరు 1117 ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయొద్దన్నారు. సంబంధిత తహసీల్దార్ నుంచి అనుమతి పొందితే తప్ప... అసైన్డ్‌ భూములు రిజిస్టర్‌ చేయవద్దని నిర్దేశించారు. ఆ తర్వాత 2006 అక్టోబరులో భూముల అక్రమాలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై వార్తా కథనాలు రావడంతో... 2006 నవంబర్ 13న మరో మెమో జారీ చేశారు. దాని ప్రకారం తహసీల్దార్ నుంచి వచ్చిన లేఖల సాయంతో అసైన్డు భూములను రిజిస్టర్‌ చేయవద్దని స్పష్టంచేశారు.

తహసీల్దార్లు ఏ సర్వే నెంబరు అసైన్డ్‌ భూముల జాబితా నుంచి తొలగిస్తూ లేఖ ఇచ్చారో.... దానిపైన కలెక్టర్‌కు లేఖ రాసి అనుమతి పొందాకే రిజిస్టర్‌ చేయాలన్నారు. ఈ కుంభకోణంలో అనేక కేసుల్లో సబ్‌ రిజిస్ట్రార్లు ఈ నిబంధనలు పాటించలేదు. కొన్నిసార్లు ఎన్ఓసీ జారీ చేసే ప్రక్రియ సాగుతుండగానే... సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. అప్పట్లో రెవెన్యూతో పాటు రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు పర్యవేక్షించే మంత్రి బాధ్యతల్లో ధర్మాన ప్రసాదరావే ఉన్నారు. సిట్‌ అప్పటి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక వెలుగుచూడలేదు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక అదే అంశంపై మళ్లీ ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సిట్ ఏర్పాటుచేసింది. వారు విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా... ప్రభుత్వం ఇంకా బయటపెట్టలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.