ETV Bharat / city

VISAKHA RAILWAY ZONE: విశాఖ జోన్‌ మాటేమిటి?

author img

By

Published : Dec 9, 2021, 5:32 AM IST

Updated : Dec 9, 2021, 6:45 AM IST

VISAKHA RAILWAY ZONE: కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదన్న కేంద్ర మంత్రి లోక్​సభలో ప్రకటించడంతో విశాఖ రైల్వే జోన్​ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న కానుక అంటూ చేసిన ప్రకటనపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

VISHAKHA RAILWAY ZONE
VISHAKHA RAILWAY ZONE

VISAKHA RAILWAY ZONE: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్‌ కోస్టు) రైల్వే జోన్‌ ఏర్పాటవుతుందా లేదా అన్నది మరోమారు చర్చనీయాంశమయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్లున్నాయని, కొత్త జోన్లు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పార్లమెంటులో ప్రకటించడంతో విశాఖ జోన్‌పై మరోమారు చర్చకు తెరలేచింది. అవసరాలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే డిమాండ్ల ఆధారంగా మరిన్ని రైల్వే జోన్లు మంజూరు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే ఆ వివరాలు చెప్పాలని బుధవారం లోక్‌సభలో అజయ్‌ నిషాద్‌ అనే సభ్యుడు అడిగారు. అలాంటి ఉద్దేశమేదీ లేదని రైల్వే మంత్రి సమాధానమిచ్చారు.

ప్రస్తుతం ఉన్న 17 రైల్వే జోన్లు, వాటి పరిధిలోకి వచ్చే డివిజన్ల సంఖ్యను వివరిస్తూ.. జోన్లవారీ వర్క్‌లోడ్‌, ట్రాఫిక్‌ తీరు, పరిపాలనా అవసరాలు, దానిపై ప్రభావం చూపే నిర్వహణ అంశాలను మదించడం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ మదింపు ఆధారంగా, నిర్వహణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న జోన్లు, డివిజన్ల పరిధిలో సమయానుకూలంగా మార్పులు చేయనున్నట్లు చెప్పారు. అయితే అవసరాలు, రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని మరిన్ని జోన్లు మంజూరు చేసే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదన్నారు. కొన్నాళ్ల కిందట శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు రైల్వేజోన్‌ గురించి ప్రశ్నించగా.. జోన్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదించాల్సి ఉందని, అందుకు ఎంత సమయం పడుతుందనేది స్పష్టంగా చెప్పలేమని మంత్రి పేర్కొన్నారు.

విశాఖ రైల్వే జోన్‌పై ప్రస్తుత పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించనున్నట్లు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై మరింత స్పష్టత కోరతామని, సత్వరమే జోన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తామన్నారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను అధికారికంగా ప్రకటించారు. అదే ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న కానుక అని ప్రకటించారు.

వాల్తేరు డివిజన్‌లో కొంత భాగంతో ఒడిశాలోని రాయగడ్‌ డివిజన్‌గా, మరికొంత విజయవాడ డివిజన్‌లో కలుపుతామన్నారు. ఆ తరువాత జోన్‌ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ప్రత్యేకాధికారి (ఓఎస్డీ)నీ నియమించారు. డీపీఆర్‌ను తయారుచేసి రైల్వే బోర్డుకు, రైల్వే శాఖకు సమర్పించారు. దీనిపై అధ్యయనం చేసి జోన్‌ను ఆమోదించాల్సి ఉంది. అంతులేని కాలయాపనతో డీపీఆరే ఇంకా ఆమోదం పొందలేదు. జోన్‌ రావడం తథ్యం! : రైల్వేబోర్డుకు పంపిన డీపీఆర్‌లో కొత్త జోన్‌ పరిధికి సంబంధించిన అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు. దక్షిణ కోస్తా జోన్‌ పరిధిలోకి 95 శాతం వరకు ఏపీ పరిధి ఉండేలా ప్రతిపాదించారు. ఫలితంగా కేంద్రం కేటాయించే బడ్జెట్‌లో దక్షిణ కోస్తా జోన్‌ వాటా దాదాపుగా రాష్ట్రానికే వర్తించే అవకాశం ఉందని భావించారు. కొత్త జోన్‌పై ఎన్నో ఆశలతో ఉన్న రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి తాజా ప్రకటన మింగుడుపడటం లేదని పలువురు పేర్కొంటున్నారు. అయితే అధికారికంగా ప్రకటించినందున, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ తథ]్యమని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి:

Maha Dharna: 'సీఎం జగన్‌ అధ్యక్షతన అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి'

Last Updated : Dec 9, 2021, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.