ETV Bharat / city

CONTRACTORS PROTEST: నాడు ఉపాధి కల్పించాం.. నేడు ఉపాధి కోల్పోయాం.. కాంట్రాక్టర్ల ఆవేదన

author img

By

Published : Dec 30, 2021, 9:01 AM IST

CONTRACTORS PROTEST: విశాఖ జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద సబ్కా ఆధ్వర్యంలో 'ఆవేదన-4' పేరిట గుత్తేదారులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పలువురు గుత్తేదారులు నల్ల చొక్కాలతో హాజరై నిరసన తెలిపారు.

CONTRACTORS PROTEST
CONTRACTORS PROTEST

CONTRACTORS PROTEST: ‘అంపశయ్యపై ఉన్నాం.. ఆదుకోండి.. నాడు ఉపాధి కల్పించాం.. నేడు ఉపాధి కోల్పోయాం.. ఆస్తులు కరిగాయి.. అప్పులు మిగిలాయి’ అంటూ పలు జిల్లాల గుత్తేదారులు విశాఖ జీవీఎంసీ సమీపంలోని గాంధీవిగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. సబ్కా (స్టేట్‌ ఆఫ్‌ ఏపీ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో ‘ఆవేదన-4’ పేరిట బుధవారం నిర్వహించిన ఆందోళనకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పలువురు గుత్తేదారులు నల్ల చొక్కాలతో హాజరై నిరసన తెలిపారు.

సబ్కా ప్రధాన కార్యదర్శి విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో బ్యాంకుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వేధింపులకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఓపిక పట్టామని... ఇక ఆ శక్తి నశించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్కా కార్యాలయ కార్యదర్శి ఎం.ఆర్‌.డి.ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గుత్తేదారుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. టెండర్లలో పాల్గొని నిబంధనల ప్రకారం పనులు పూర్తిచేసినా బిల్లులు ఇవ్వట్లేదని వాపోయారు. గతంలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బిల్లులు మంజూరు కాలేదని చెప్పగానే ప్రత్యేకంగా జీవో ఇచ్చి నిధులు కేటాయించి న్యాయం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం తమ బాధలను పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.

గుంటూరు నుంచి వచ్చిన కొండా రమేశ్‌, మధుబాబు మాట్లాడుతూ.. కొత్త, పాత బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారుల వ్యవస్థ సుప్తచేతనావస్థకు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు-నేడు, జల్‌జీవన్‌ మిషన్‌ పనులకూ డబ్బులు చెల్లించలేదని, ముఖ్యమంత్రి దశలవారీగా నిధులు విడుదల చేస్తే... వాటిని మళ్లీ ఇతర పనులకే ఉపయోగిస్తామని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నుంచి వచ్చిన నీలకంఠేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన పనులకూ బిల్లులు మంజూరు కావట్లేదని వాపోయారు.

చిన్నచిన్న గుత్తేదారులకు రూ.వెయ్యి కోట్ల వరకే బకాయిలు ఉంటాయని, వాటినీ చెల్లించట్లేదని వివరించారు. బకాయిలు చెల్లించాల్సిన కార్యాలయాల ముందు ఆందోళనలు చేయాలని, ప్రతివారం అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని, ‘బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (బాయ్‌) సభ్యులు, అన్ని శాఖలు, విభాగాల గుత్తేదారులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పలువురు గుత్తేదారులు అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యక్రమంలో కాకుండా కొద్దిమందికే నిధులు మంజూరయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో సబ్కా రాష్ట్ర అధ్యక్షుడు పి.పి.రాజు, ఉపాధ్యక్షుడు సూర్యప్రకాశ్‌, సమన్వయకర్త శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Distribution increased pension: జనవరి 1 నుంచి పెంచిన పింఛను

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.