ETV Bharat / city

Visakhapatnam Railway Zone : విశాఖ రైల్వే జోన్‌ కు పచ్చజెండా.. ముందుకు కదిలినట్టేనా?

author img

By

Published : Dec 10, 2021, 4:55 PM IST

Updated : Dec 10, 2021, 5:20 PM IST

విశాఖ రైల్వేజోన్‌ కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో తెదేపా ఎంపీలు, వైకాపా సభ్యులు గడిచిన రెండు రోజులుగా లేవనెత్తుతున్నారు. అయితే.. రైల్వే జోన్​పై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెబుతూ వచ్చిన మంత్రి అశ్విని వైష్ణవ్.. తాజాగా చర్యలు చేపడతామని చెప్పడం గమనార్హం.

దక్షిణకోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు చర్యలు
దక్షిణకోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు చర్యలు

Central Minister on Visakhapatnam Railway Zone : విశాఖ రైల్వేజోన్‌ కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోందని నిన్న లోక్ సభలో రామ్మోహన్ నాయుడు, ఇవాళ రాజ్యసభలో కనకమేడల కేంద్రాన్ని ప్రశ్నించారు. వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి రైల్వే మంత్రి దృష్టికి విషయం తీసుకువెళ్లారు. ఈ క్రమంలో.. విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని కేంద్రమంత్రి వెల్లడించారు.

ఏం జరిగిందంటే..
పార్లమెంటులో జరుగుతున్న శీతాకాలం సమావేశాల్లో ఏపీ ఎంపీలు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు గురించి ప్రశ్న లేవనెత్తారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. జోన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో చెప్పలేమని బదులిచ్చారు. ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, మిథున్‌రెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్, లోక్‌సభలో ప్రశ్నను లేవనెత్తగా.... రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు.

railway minister on Visakhapatnam railway zone: 2019 మార్చి 8న దక్షిణ కోస్తా రైల్వే కోసం ప్రత్యేక విధి నిర్వహణాధికారి-ఓఎస్‌డీని నియమించినట్లు చెప్పిన మంత్రి.. ఈ జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను 2019 ఆగస్టు 26న ఓఎస్‌డి రైల్వే శాఖకు సమర్పించినట్లు చెప్పారు. డీపీఆర్‌కు అనుగుణంగా.. కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, తూర్పు కోస్తా రైల్వేలో కొత్తగా రాయగడ డివిజన్‌ ఏర్పాటు పనులను రూ.170 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 బడ్జెట్‌లో పొందుపరిచామన్నారు. పనుల కోసం రూ.40 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్న మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. కొత్త జోన్‌ ఎప్పటినుంచి పని ప్రారంభిస్తుందో.. కచ్చితమైన సమయం నిర్ధరించలేమని స్పష్టం చేశారు.

తెదేపా ఎంపీల ఆగ్రహం..
Central Minister on Visakhapatnam Railway Zone : కేంద్ర రైల్వే మంత్రి ప్రకటనపై తెదేపా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. రైల్వే జోన్​పై స్పష్టత ఇవ్వాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. 2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారు.. ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమన్నారు. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమేనన్నారు. రైల్వే జోన్‌ ఏర్పాటు, ఎంత బడ్జెట్‌ కేటాయిస్తున్నారో చెప్పాలని, ఏపీ ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కొత్త జోన్‌ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతి లేదు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదు. 2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారు. ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టం. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమే.

- రామ్మోహన్ నాయుడు, తెదేపా ఎంపీ

రైల్వేజోన్‌పై కేంద్రం ప్రకటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. విభజన హామీలన్నీ అమలు చేస్తామన్న మంత్రి.. రైల్వే జోన్​ అంశంపై ప్రత్యేకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

-కనకమేడల రవీంద్రకుమార్, తెదేపా ఎంపీ

చిరకాల కల నేరవేరేదెన్నడు..?
Visakhapatnam Railway Zone : విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. అయితే వీరి ఆశ పట్టాలెక్కె అవకాశం లేదా? అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకటం లేదు. ఎన్నో పోరాటాల ఫలితంగా చివరకు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటన చేశారు. కానీ సంబంధిత ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు సాగుతోంది. కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుకు విశాఖలో అన్ని వసతులూ ఉన్నాయి. రైల్వే పరిధిలో దాదాపు 5 వేల ఎకరాల భూమి ఉంది. రైల్వే జోన్‌ ఏర్పాటు వల్ల ఇటు పారిశ్రామిక సంస్థలకు... వాటి వల్ల రైల్వే జోన్‌కు పరస్పరం లాభం చేకూరనుంది. మరి, కేంద్ర మంత్రి చేసిన ప్రకటన ఇప్పటికైనా కార్యరూపం దాలుస్తుందో లేదో చూడాలి.

అనుబంధ కథనాలు..

Last Updated : Dec 10, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.