ETV Bharat / city

సర్పంచులకు షాక్‌.. నిధులు కాజేసిన రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Apr 1, 2022, 7:32 PM IST

Updated : Apr 2, 2022, 3:30 AM IST

govt taken Panchayat funds in ap
పంచాయతీ ఖాతాలు ఖాళీ

Panchayat funds: ఉగాది పండుగ వేళ సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని వెయ్యికిపైగా పంచాయతీల్లో సాధారణ నిధుల్ని మళ్లించింది. వేసవిలో చేపట్టాల్సిన పనులకు నిధులు లేకపోవడంతో.. సర్పంచులు ఏంచేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. అత్యధిక పంచాయతీల్లో ఇదే పరిస్థితి తలెత్తడంతో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లోని సాధారణ నిధులు (జనరల్‌ ఫండ్‌) ఖాళీ అయ్యాయి. అత్యధిక పంచాయతీల్లో ఇదే పరిస్థితి తలెత్తడంతో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇప్పటికే మళ్లించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆస్తి పన్ను, ఇతరత్రా రుసుముల కింద వచ్చే సాధారణ నిధులనూ ఇప్పుడు మళ్లించడంతో సర్పంచులు మరింత రగిలిపోతున్నారు.

ప్రస్తుతం చాలా పంచాయతీల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్లు మరమ్మతులు చేయించాలన్నా, పాడైన పైపులైన్లు సరి చేయాలన్నా సాధారణ నిధులే పంచాయతీలకు ప్రస్తుతం ఆధారమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు మళ్లిస్తే సమస్యలెలా పరిష్కరిస్తామని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

బిల్లులు చెల్లించకపోగా... నిధుల మళ్లింపా?
గ్రామ పంచాయతీల ఖాతాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు (సీఎఫ్‌ఎంఎస్‌) అనుసంధానించాక ఆర్థికశాఖ దయాదాక్షిణ్యాలపై సర్పంచులు, కార్యదర్శులు ఆధారపడుతున్నారు. పంచాయతీల్లో చేసే ప్రతి పనికి సంబంధించి బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాక ఆర్థికశాఖ ఎప్పుడు ఆమోదించి నిధులు విడుదల చేస్తే అప్పుడే తీసుకోవాలి. సీఎఫ్‌ఎంఎస్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. వీటి కోసం సర్పంచులు ఎదురు చూస్తున్న దశలో పంచాయతీల్లోని సాధారణ నిధులు ఖాళీ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లోని సాధారణ నిధులు ఎన్ని మళ్లించారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సర్పంచులకు తెలియకుండా పంచాయతీ ఖాతాల్లోని రూ.కోట్ల నిధులను ప్రభుత్వం కాజేసిందని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. ‘సర్పంచులకు ప్రభుత్వం ఇచ్చిన ఉగాది కానుక ఇది. ఆదుకోవలసిన ప్రభుత్వమే ఇలా చేస్తే సర్పంచులు ప్రజలకెలా సేవ చేయగలరు? నిధులు వెంటనే తిరిగి జమ చేయకపోతే ఆందోళన చేస్తాం’ అని హెచ్చరించారు.


ఇదీ చదవండి: జోరుగా వైకాపా భూకబ్జాల దందా.. నిల‌దీసిన వృద్ధులకు బెదిరింపులు: లోకేశ్

Last Updated :Apr 2, 2022, 3:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.