ETV Bharat / city

'తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయాలి'

author img

By

Published : Dec 28, 2019, 1:25 PM IST

'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అలాంటి తెలుగును ప్రభుత్వాలు, ప్రజలు అందరూ విస్మరిస్తున్నారు. ఆంగ్లం మోజులో పడి మాతృభాషను మరిచిపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు తెలుగంటే తెలియకుండా పోతుందని.. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరైన వక్తలు అభిప్రాయపడ్డారు.

world telugu writers conference in vijayawada
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో రెండోరోజు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మీగడ రామలింగేశ్వర స్వామితో సంగీత నవావధానం.. ప్రముఖ నృత్య దర్శకుడు సప్పా దుర్గాప్రసాద్​ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన నిర్వహించారు. పలు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు భాషోద్యమ, చరిత్ర పరిశోధన రంగ, సాహితీ సంస్థలు, సాంస్కృతిక, ప్రచురణ రంగ ప్రతినిధుల సదస్సులు ఏర్పాటు చేశారు.

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

భాషను కాపాడుకోవాలి...

తెలుగుపై అభిమానం ఉన్నా.. వృత్తిరీత్యా దూరంగా ఉండాల్సి వచ్చిందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, సాహిత్యం, భాషదే ప్రముఖ పాత్ర అని వివరించారు. ఆంగ్లంపై ప్రభుత్వాలు మోజు పెంచుకోకూడదని సూచించారు. తెలుగులో కొత్త పదాల సృష్టి జరగట్లేదని.. ఎవరైనా మౌనంగా ఉండవచ్చుగానీ రచయితలు మౌనంగా ఉండకూడదన్నారు. భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

హాస్యాస్పదం...

మన విద్యావిధానంపై ఇప్పటికీ ఆంగ్లేయుల ప్రభావం ఉందని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు మాతృభాషలో చదివినవారికే సాధ్యమవుతున్నాయని.. కేవలం ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయనడం హాస్యాస్పదమన్నారు.

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

భావితరాలకు తెలియజేయాలి...

ప్రజాప్రతినిధులు మన భాష పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ మాధవ్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాల వారికి తెలియజేయాలన్నారు. తెలుగు మాధ్యమంలో రాణించేవారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వాలు చొరవ చూపించాలని కోరారు. భాష ద్వారా ఓట్లు వచ్చే సంస్కృతి తీసుకురావాలని.. అప్పుడే రాజకీయ పార్టీలు భాషను పట్టించుకుంటాయన్నారు.

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

భాషకు, ఉద్యోగాలకు సంబంధం లేదు

తమిళంలో ప్రతి ఐదేళ్లకోసారి ఒక కమిటీ వేసి వాళ్ల పదాలను వృద్ధి చేసుకుంటారని సీపీఐ నేత నారాయణ తెలిపారు. అలాంటి ప్రయత్నం తెలుగులోనూ ఉండాలన్నారు. భాషకు, ఉద్యోగాలకు సంబంధం లేదని.. మాతృభాషలో విద్యా బోధన ఉంటే పాతాళానికి పడిపోతామనే భావన మంచిది కాదన్నారు.

ఇవీ చదవండి..

మాతృభాషను కాపాడుకుందాం.. స్వాభిమానం చాటుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.