ETV Bharat / city

ఇంద్రకీలాద్రి: స్వర్ణ కవచాలంకృత దుర్గమ్మగా దర్శనం

author img

By

Published : Oct 17, 2020, 6:46 PM IST

కనకదుర్గా.. కరుణించమ్మా.. అంటూ అమ్మవారి నామస్మరణతో.. విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసరాలు మారుమోగాయి. దేవిశరన్నమరాత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు స్వర్ణ కవచాలంకృతమైన దుర్గమ్మను భక్తులు దర్శించుకున్నారు. కొవిడ్‌ నిబంధనలతో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తున్న పరిస్థితుల్లో.. ముందస్తు టిక్కెట్లు తీసుకున్న వారంతా.. జగన్మాతకు మొక్కులు చెల్లించుకున్నారు.

vijayawada durga temple in krishna district
vijayawada durga temple in krishna district

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శార్వరీ నామ సంవత్సర దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని దేవస్థానం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది. గతంలో కంటే ఈసారి భక్తుల తాకిడి గణనీయంగా తగ్గింది. ఉదయం 3 గంటలకు అమ్మవారి సుప్రభాత సేవ.. స్నపనాభిషేకం, బాలబోగ నివేదన, నిత్యార్చనలు జరిగాయి. నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, ఆలయ ఈవో సురేష్‌బాబు దంపతులు అమ్మవారి ఉత్సవ మూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టగా.. కేరళ బృందం.. వాయిద్య నాదాలతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభించారు.

తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంతో జగన్మాత భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. గంటకు వెయ్యి మంది వంతున రోజుకు 10 వేల మందికి మాత్రమే దర్శనానికి అవకాశం ఇస్తున్నారు. సర్వదర్శనం, వంద రూపాయలు, 300 రూపాయల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ముందస్తుగా కేటాయిస్తున్నారు. వీటిని తీసుకున్నవారి వివరాలను పరిశీలించి.. ఆరోగ్య తనిఖీలు చేశాకే ఆలయం వద్దకు రానిస్తున్నారు.

వినాయక ఆలయం.. కుమ్మరిపాలెం వద్ద నుంచి వేర్వేరుగా ఇంద్రకీలాద్రి కొండపై వరకు 3 వరుసల క్యూలను ఏర్పాటు చేశారు. 4 చోట్ల థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. ముందుగా సమయం నిర్దేశించి టిక్కెట్లు ఇవ్వడంతో క్యూ లైన్లలో రద్దీ, నిరీక్షణ లేకుండా వడివడిగా అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు ముందుకు సాగారు. ఆన్‌లైన్‌ టికెట్లు లేని భక్తులకు ఆరోజు టైం స్లాట్‌ ప్రకారం ఖాళీ ఉంటే సీతమ్మవారి పాదాలు వద్ద ఏర్పాటుచేసిన దేవస్థాన కౌంటర్‌ వద్ద అప్పటికప్పుడు టికెట్లు ఇస్తున్నారు.

నవరాత్రుల సమయంలో అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ప్రత్యక్షంగా కాకుండా కేవలం పరోక్షంగానే పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకుంటే వారి గోత్రనామాలతో పూజలు చేసి ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తామని దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు. మహామండపంలో అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక సేవలు చండిహోమం, ప్రత్యేక కుంకుమార్చన, శ్రీ చక్రార్చన పరోక్షంగా జరిపిస్తున్నారు.

దసరా ఉత్సవాల్లో భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించుకుని, కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించాక దుర్గమ్మను దర్శించుకుంటారు. కరోనా వల్ల ఈ ఏడాది వాటిని రద్దు చేశారు. ప్రత్యేక కేశన ఖండనశాల ఏర్పాట్లు ఏమీ చేయలేదు. పుణ్యస్నానాలు చేసే ఘాట్లను మూసివేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. అంతరాలయ దర్శనాలు లేకుండా అందరికీ లఘుదర్శనం, ముఖమండప దర్శనాలకే పరిమితం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏడాదిగా దర్శనానికి అవకాశం నిలిపివేసిన మల్లేశ్వరస్వామి ఆలయాన్ని పునఃప్రారంభించారు.

వినాయక ఆలయం నుంచి వచ్చిన భక్తులు, అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత ఉపాలయాల మీదుగా మల్లేశ్వరస్వామి దర్శనంతో కొండపై నుంచి దిగువకు చేరుకుంటున్నారు. శివాలయం దర్శనం అయిన వెంటనే భక్తులకు ఉచితంగా పులిహార, దద్దోజనం ప్రసాదాన్ని అందిస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి దేవినేని ఉమ, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసారి వీఐపీలకు పూర్ణకుంభం, సన్నాయి వాయిద్య స్వాగతాలు లేకుండా సాధారణంగానే ఆహ్వానించి.. దర్శనం కలిపిస్తున్నారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు దర్శన సమయం కేటాయించారు.

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు సింహవాహనం అధిరోహించి.. ఎనిమిది చేతులతో.. అద్భుతమైన కాంతి కలిగిన ముక్కుపుడకతో.. బంగారు ఛాయ ఉన్న దేహంతో దర్శనమిచ్చారు. శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ ఆయుధాలు ధరించిన ఈ తల్లికి ఆకర్షణశక్తి అధికంగా ఉంటుందని పండితులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ స్వర్ణకవచంతో అలంకరించడం వల్ల నవరాత్రుల తొలిరోజున స్వర్ణకవచంతో అలంకరించడం ఆచారంగా వస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసిన దేవస్థానం.. అమ్మవారి ప్రాకారం చుట్టూ ఉత్సవ మూర్తుల పల్లకీ సేవ నిర్వహించారు.

ఇదీ చదవండి:

'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.