ETV Bharat / city

TRS and BJP Tweet War : తెరాస, భాజపా ట్విటర్​ వార్​.. ట్రెండింగ్​లో 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ'

author img

By

Published : Feb 6, 2022, 5:57 PM IST

TRS and BJP Tweet War: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో.. తెలంగాణ సీఎం కేసీఆర్​ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. జ్వరం వల్ల హాజరు కాలేకపోయారన్న తెరాస.. ప్రైవేటు కార్యక్రమాల్లో ప్రధానికి స్వాగతం పలకాల్సిన అవసరం లేదని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలే చెబుతున్నాయని ట్వీట్ చేసింది. మరోవైపు మంత్రులు, తెరాస నేతలు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్‌తో.. 20 వేలకుపైగా ట్వీట్లు చేసి ట్రెండింగ్ సృష్టించారు.

tweet war between trs and bjp
తెరాస, భాజపా ట్విటర్​ వార్

TRS and BJP Tweet War : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ పాల్గొనకపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జ్వరం వల్ల వెళ్లలేదా.. రాజకీయ వ్యూహమా అనే చర్చకు తెరలేసింది. మరోవైపు ట్విటర్ వేదికగా భాజపా, తెరాస మధ్య యుద్ధం నడిచింది. కేసీఆర్​ పదేపదే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని.. ప్రొటోకాల్ పాటించకపోవడం సిగ్గుచేటని భాజపా ట్వీట్ చేసింది. దానికి ట్విటర్​లో స్పందించిన తెరాస.. సీఎం ఆరోగ్యం బాగాలేదని.. అయినా ప్రైవేటు కార్యక్రమాల్లో ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించాల్సిన అవసరం లేదని.. కేంద్ర హోం శాఖ నిబంధనలే చెబుతున్నాయని రీట్వీట్ చేసింది. తప్పుదోవ పట్టించేలా చౌకబారు ప్రచారం వద్దంటూ ట్వీట్‌లో తెరాస కౌంటర్ ఇచ్చింది.

ట్విట్టర్ ట్రెండింగ్​..
Tweet War Between BJP and TRS : ముచ్చింతల్‌లో 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' ఆవిష్కరణ సందర్భంగా.. తెరాస శ్రేణులు 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ' హ్యాష్‌ ట్యాగ్‌ను ట్విటర్ ట్రెండ్‌ చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, పార్టీ శ్రేణులు ఈ క్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్‌తో 20 వేలకు పైగా ట్వీట్లు చేశారు. వివిధ రంగాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని, వివక్షను ప్రదర్శిస్తోందని ట్వీట్లలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో కేటాయింపులు, రాష్ట్ర విభజన హామీలు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి విషయాల్లో అన్యాయం జరుగుతోందన్నారు.

'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ'
Equality for Telangana : ప్రజా సమస్యలపై రాష్ట్ర మంత్రులు పంపిన లేఖలపై కేంద్రం స్పందించడం లేదంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్వీట్ చేశారు. కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగంపై వివక్ష చూపుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరను.. జాతీయ పండుగగా ఎందుకు గుర్తించడం లేదని మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు నవోదయ విద్యాలయాలు కేటాయించిన కేంద్రం.. తెలంగాణను ఎందుకు విస్మరించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. నిధుల కేటాయింపులో భాజపా పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణకు ఎందుకు లేదని.. మంత్రి మహమూద్ అలీ ప్రశ్నించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, తదితరులు ట్విటర్ వేదికగా 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ' హ్యాష్ ట్యాగ్‌తో.. కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. ఉదయం కొందరు యువకులు ట్యాంక్ బండ్‌పై ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అంటూ భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.