ETV Bharat / city

స్త్రీ మూర్తిగా గణనాథుడు.. ఆలయాలు ఎక్కడంటే!

author img

By

Published : Aug 22, 2020, 12:30 PM IST

Updated : Aug 22, 2020, 12:52 PM IST

ముదాకరాత్త మోదకం సదావిముక్తి సాధకం కళాధరా వతంసకం.. నమామి తం వినాయకమ్‌!’ అని విఘ్ననాయకుణ్ని మనమంతా కొలిచే ఈ వేళ మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన్ని ‘విఘ్ననాయకి’గా ఆరాధిస్తారు! వైనాయకీ, విఘ్నేశ్వరీ, గణేశినీ, ఐన్గనీ అని కొలుస్తారు. వినాయకుణ్ని బ్రహ్మచారిగానే కొలుస్తాం. తల్లి తప్ప సతి నీడ తెలియనివాడుగానే భావిస్తాం. అలాంటిది ఆయన్ని ఏకంగా స్త్రీమూర్తిగానే ఎందుకు కొలుస్తున్నారు?

thamilnadu people prayerd women ganesh idols
thamilnadu people prayerd women ganesh idols

వినాయకి పూజకి తమిళనాడులో విశేష ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకంగా కాకపోయినా ఆలయాల్లోని ఉపదేవతలుగా పూజలు చేస్తున్నారక్కడ. కన్యాకుమారిలోని శుచీంద్రంలో మనం ‘గణేశ్వరి’ని చూడొచ్చు! లలితాసినిగా ఇక్కడ వినాయకి దర్శనమిస్తుంది. తలపై చక్కటి అలంకరణలతో మకుటం.. పైచేతుల్లో అంకుశం, పాశం.. కింది చేతుల్లో అభయ, వరద ముద్రలతో కనిపిస్తుంది. మెడకింద స్త్రీ రూపం, హారం, శుక్లాంబరాలతో.. ఎడమపాదాన్ని తాకేంత పెద్ద తొండంతో ఉంటుందీ విగ్రహం. చతుర్థినాడు వినాయకుడికి ఇంట్లో పూజ చేసుకునే భక్తులు, ఈ రోజున గణేశ్వరిని ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేకంగా పూజిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని వినాయకి విగ్రహం విద్యాగణపతిగా ప్రసిద్ధి పొందింది. మదురై అనగానే మనకు మీనాక్షి అమ్మవారి గుడే స్ఫురిస్తుంది. ఆ ఆలయంలోనూ విఘ్నేశ్వరిని దర్శించుకోవచ్చు. చొక్కనాథుని సన్నిధికి పక్కనే ఓ స్థూపంలో ‘అభంగ’... అంటే నిల్చున్న భంగిమలో వినాయకినిని గమనించొచ్చు. ఈ విగ్రహానికి నడుము కింది భాగం పులిరూపం! కనుకే ‘వ్యాఘ్రపాద వినాయకి’ అని పిలుస్తారు. ఇదేలాంటి స్త్రీ రూప గణేశుణ్ని ప్రఖ్యాత శివాలయం చిదంబరంలోనూ చూడొచ్చు. ఇక్కడా వ్యాఘ్రపాద రూపిణియే కానీ.. చేతిలో ఆయుధాలకు బదులుగా పూలగుచ్ఛం ఉంటుంది!! శాంతికాముకిగా అనిపిస్తుంది.

కర్ణాటకలోనూ..

కర్ణాటకలోని శిరాలి చిత్రపూర్‌ మఠంలో పదో శతాబ్దానికి చెందిన వినాయకి లోహశిల్పం చాలా అందమైంది. ఇక్కడ వినాయకి.. వినాయకుడిలా బొజ్జతో ఉండదు. అందమైన నడుముతో అలరారుతూ ఉంటుంది. మధ్యప్రదేశ్‌ బెడాఘాట్‌ ప్రాంతంలోని చౌసాత్‌ యోగిని ఆలయంలో కనిపించే వినాయకి ఉత్తరభారత దేశమంతటా ప్రఖ్యాతి చెందింది. పదో శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని గణేశ్వరిని ‘శ్రీ ఐన్గని’ అని పిలుస్తారు. ఇప్పటి మన వినాయకుడి విగ్రహాల్లాగే చేతిలో పరశుతో ఉంటుందీ విగ్రహం. మధ్యప్రదేశ్‌ సాత్నాలోని భూతేశ్వర ఆలయంలోని విగ్రహాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సప్తమాతృకల నడుమ ఇక్కడ మనం చిన్నారి వినాయకినిని చూడొచ్చు! చిట్టిబొజ్జతో చేతిలో వినాయకుడిలా అంకుశంతో మనకిక్కడ దర్శనమిస్తుంది. పుణే దగ్గర్లోని భూలేశ్వర్‌ శివాలయంలోనూ దాదాపు ఇదేలాంటి చిట్టి విఘ్నేశ్వరి కనులపండగ చేస్తుంది. బీహార్‌లోని గిర్యక్‌ ప్రాంతంలో బౌద్ధ మతస్థులు సృష్టించిన వైనాయకినిని వీక్షించొచ్చు.

కేవలం మనదేశంలోనే కాదు... ఇండొనేషియాలోని బాలిలో గణేంద్రిగా పూజలందుకుంటుంది వినాయకి! జపాన్‌లో వినాయకిని కాంగిటెన్‌గా పూజిస్తారు. ఇక్కడ వినాయకుడు ఆడా, మగా జంటగా ఆలింగన భంగిమలో ఉంటాడన్నదే విశేషం. మనదేశంలో తొలి వినాయకి విగ్రహం రాజస్థాన్‌లో దొరికింది. అది క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిందని చెబుతారు. మన పురాణాల్లోనూ వైనాయకి ప్రస్తావన ఉంది. వినాయకుని వివిధ రూపాలని విడమర్చి చెప్పే ముద్గల పురాణం.. విఘ్నాలను తొలగించే ఆయన స్త్రీరూపాన్నే ‘ప్రజాదేవి’గా కీర్తించింది. స్కందపురాణం కాశీని రక్షించడానికి శివుడు నియమించిన శక్తుల్లో విఘ్నేశ్వరి కూడా ఒకటని చెబుతుంది. మత్స్యపురాణం, విష్ణుధర్మోత్తర పురాణంలోనూ వినాయకి ప్రస్తావన ఉంది. దేవీపురాణం విఘ్ననాయకుని శక్తి (సృష్టి) రూపమే వినాయకి అని వివరిస్తుంది.

ఇదీ చూడండి

మూషికా..! మనం వచ్చింది భూలోకానికేనా..!

Last Updated : Aug 22, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.