ETV Bharat / city

రెండు రోజుల పాటు మాక్ అసెంబ్లీ నిర్వహణకు తెదేపా నిర్ణయం

author img

By

Published : May 19, 2021, 8:14 PM IST

రెండురోజుల పాటు మాక్ అసెంబ్లీ నిర్వహణకు తెదేపా నిర్ణయించగా.. ఇవాళ మాక్ బీఏసీ సమావేశం జరిపారు. గురు, శుక్ర వారాల్లో చర్చించనున్న విషయాలను.. ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు జూమ్ సమావేశం ద్వారా మీడియాకు వెల్లడించారు.

tdp mock bac
తెదేపా మాక్ బీఏసీ సమావేశం

ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. రెండురోజుల పాటు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని ప్రతిపక్ష తెదేపా నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన.. ఈ మేరకు తెదేపా శాసనసభాపక్షం మాక్ బీఏసీ సమావేశం నిర్వహించింది. రేపు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు.. ఈ మాక్ అసెంబ్లీ జరపడానికి తీర్మానించారు. ప్రజా సమస్యలు చర్చించడం, పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందునే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెదేపా నేతలు వెల్లడించారు.

ఇదీ చదవండి: విజయన్ 2.0: కేరళ సీపీఎంలో 'కొత్త' పొద్దు!

మాక్ బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు జూమ్ సమావేశం ద్వారా మీడియాకు వెల్లడించారు. "అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి, ప్రజల ప్రాణాలు కాపాడే అంశాలే ప్రధాన అజెండాగా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. ఈ రెండు రోజుల సమావేశాల్లో ప్రజల అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి సూచనలు పంపుతాం. తొలిరోజు ప్రశ్నోత్తరాలు లేకుండా కొవిడ్ పై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి చర్చ చేపడతాం. రెండో రోజు ప్రశ్నోత్తరాల్లో భాగంగా పింఛన్లలో కోత, సీపీఎస్ రద్దు, బీసీ ఎస్సీ ఎస్టీతో పాటు వివిధ కార్పొరేషన్ల నిర్వీర్యం, దిశ చట్టం వైఫల్యాల పై చర్చిస్తాం. తర్వాత లఘు చర్చలో భాగంగా.. వ్యవసాయం-రైతులకు గిట్టుబాటు ధర, బడ్జెట్ తీరుతెన్నులు, అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగం అమలు, జె ట్యాక్స్ వసూళ్లు- అవినీతిపై అనే నాలుగు అంశాలపై చర్చిస్తాం." అని తెలిపారు.

శాసనసభను లోటస్ పాండ్​లా మార్చారు:

దేవాలయం లాంటి శాసనసభను గత రెండేళ్లలో సీఎం జగన్ లోటస్ పాండ్ లా, వైకాపా కార్యాలయంలా మార్చారని రామానాయుడు, శ్రీనివాసులు ధ్వజమెత్తారు. "మార్చిలో రాష్ట్రంలో 900 కొవిడ్ కేసులు మాత్రమే ఉన్నప్పుడు శాసనసభ నిర్వహించకుండా దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చారు. అదే సమయంలో కేంద్రం పార్లమెంట్ సమావేశాలు, పొరుగున తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాయి. ఇప్పుడు రాజ్యాంగ పరమైన ఇబ్బంది ఉండటంతో ఒక్కరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని సజ్జల నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ రెండేళ్లు శాసనసభకే రాలేదు." అని మండిపడ్డారు.

ఇదీ చదవండి: జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రుల అభివృద్ధి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.