ETV Bharat / city

ఆదాయం వస్తున్నా గంగవరం పోర్టును అమ్మాల్సిన అవసరం ఏంటి ?: తేదేపా

author img

By

Published : Aug 26, 2021, 7:22 PM IST

వైకాపా ప్రజావ్యతిరేక పాలనా విధానాలపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు, మోసకారీ మాటలతో పబ్బం గడుపుకుంటున్న సీఎం జగన్​ను ప్రజలు ఎల్లకాలం నమ్మరని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదాయం ఆర్జిస్తున్న గంగవరం పోర్టును అమ్మాల్సిన అవసరం ఏంటని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నిలదీశారు.

TDP leaders hot comments over ycp
వైకాపా ప్రజావ్యతిరేక పాలనా విధానాలపై తెదేపా ఆగ్రహం

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాగా ఉన్న.. 10.4 శాతం షేర్లను అదానీ గ్రూపునకు అప్పగించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. రూ. 3వేల కోట్ల విలువైన ప్రభుత్వ షేర్లను కేవలం రూ. 645కోట్లకే అదానీ పరంచేశారని మండిపడ్డారు. ఏటా రూ. 1050కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న పోర్టును అమ్మాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. పోర్టు అభివృద్ధి చెందితే తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తే.. జగన్ దాన్ని ప్రైవేట్ పరం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగవరం పోర్టు.. కృష్ణపట్నం, కాకినాడ పోర్టు.. ఇలా అన్నీ ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్రాన్ని ఏం చేయాలని జగన్ భావిస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజలను.. తన దోపిడీ వనరుగా మార్చుకున్నారు: మర్రెడ్డి

అబద్ధాలు, మోసకారీ తనంతో పబ్బం గడుపుకుంటున్న ముఖ్యమంత్రి జగన్​​రెడ్డిని ప్రజలు ఎల్లకాలం నమ్మరని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు రూ. 10 ఇచ్చి రూ. 100 వసూలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే దేశంలో ఎక్కడాలేని విధంగా చమురు ధరలు తగ్గిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు రాష్ట్రాన్ని పెట్రోడీజిల్ ధరల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని మండిపడ్డారు. చమురు ధరలు ఇష్టానుసారం పెంచేసి.. ప్రజలను తన దోపిడీ వనరులుగా మార్చుకున్న ప్రభుత్వతీరుని తెదేపా తీవ్రంగా ఆక్షేపిస్తోందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించి, వ్యవసాయరంగానికి 50శాతం సబ్సిడీపై డీజిల్ అందించాలని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు.

తలనీలాల వ్యవహారంలో వైకాపా పెద్దల హస్తం: మాణిక్యరావు

రాష్ట్రం.. కేంద్రంగా సాగుతున్న తలనీలాల అక్రమ వ్యాపారంపై ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్టడం లేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు. కేంద్ర నిఘా సంస్థలు, విదేశీ పోలీసులు తలనీలాలు పట్టుకునే వరకు రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ సోదాల్లో తేలిన రూ. 16కోట్ల హవాలా సొమ్ము వ్యవహారం, రూ. 3కోట్ల లెక్కల్లేని సొమ్ముపై జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతారని నిలదీశారు. తలనీలాల అక్రమరవాణా వ్యవహారం వెనుక అధికార పార్టీ పెద్దలు ఉన్నందునే ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆరోపించారు. తలనీలాలను కూడా ఈ ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఇళ్ల నిర్మాణం పేరుతో కొత్త దోపిడీ: సయ్యద్​ రఫీ

వైకాపా ప్రభుత్వం తాజాగా ఇళ్ల నిర్మాణం పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టిందని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆరోపించారు. సెంటు పట్టా స్థలాల పంపిణీలో రూ. 6వేల కోట్ల కుంభకోణానికి ముఖ్యమంత్రి జగన్ పాల్పడినట్లు సయ్యద్​ రఫీ పేర్కొన్నారు. ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చి.. పేదలు ఎంచుకున్న మూడో ఆప్షన్ తొలగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 5 లక్షలతో ప్రభుత్వమే ఇళ్లుకట్టించి ఇస్తుందని చెప్పిన జగన్.. ఇప్పుడు ప్రజలే ఇళ్లు కట్టుకోవాలనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

ఇదీ చదవండి..

KRMB, GRMB MEETING: సెప్టెంబర్‌ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.