ETV Bharat / city

వైకాపాపై తెదేపా శ్రేణుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

author img

By

Published : Nov 20, 2021, 9:08 AM IST

శాసనసభలో వైకాపా వ్యాఖ్యల్ని నిరసిస్తూ తెలుగుదేశం శ్రేణులు రోడ్డెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. సీఎం వ్యతిరేక నినాదాలు చేశారు. గుంటూరులో ఎమ్మెల్యే అంబటి ఇంటి ముట్టడికి యత్నించారు. అంబటి, కొడాలి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

TDP leaders protest
TDP leaders protest

వైకాపాపై తెదేపా శ్రేణుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట, పి.గన్నవరంలో తెదేపా నాయకులు నోటికి నల్లగుడ్డ కట్టుకుని నిరసన(TDP leaders protest over yscp comments on chandrababu naidu) తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ ఎంపీ కొనకళ్ల నిరసన తెలిపారు. వైకాపా నేతలు ప్లాట్‌ఫాం వ్యక్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెనమలూరులో ర్యాలీ చేశారు. పామర్రు ఎన్టీఆర్ కూడలి నుంచి పార్టీ కార్యాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. నందిగామ గాంధీ కూడలి నుంచి శివాలయం వరకు తెదేపా శ్రేణులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

వైకాపా నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో కాగడాలతో నిరసన తెలిపారు. రాజాం, నరసన్నపేటలో ఆందోళనలు చేశారు. పాలకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన చేసిన తెదేపా శ్రేణులు..మోకాళ్లపై నిలబడి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో కాగడాలతో ఆందోళన చేశారు. వైకాపా నేతల ప్రవర్తన రాక్షసంగా ఉందని తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత విమర్శించారు.మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. - బండారు సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి

కార్యకర్తల మద్దతు..

తామంతా పార్టీతోనే ఉంటామంటూ తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు నినాదాలు చేశారు. వారిని చంద్రబాబు సముదాయించారు. విజయవాడలో నిరసనకు దిగిన పశ్చిమ నియోజకవర్గ నాయకులను భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు ఎమ్మెల్యే రామ్మోహన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో టైర్లను తగులబెట్టారు.

రోడ్లపైకి తెదేపా కార్యకర్తలు..

ఎమ్మెల్యే అంబటి రాంబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ గుంటూరు సిద్ధార్థ నగర్‌లోని ఆయన నివాసం వద్ద తెదేపా నేతలు ఆందోళన చేశారు. నరసరావుపేటలోనూ తెదేపా నాయకుల్ని అరెస్ట్ చేశారు. తుళ్లూరు, తెనాలి, గురజాలలో రాస్తారోకో నిర్వహించారు. ప్రత్తిపాడులో రోడ్డుపై బైఠాయించారు. శాసనసభ నుంచి తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యే కిలారి రోశయ్య వాహనాన్ని తెదేపా నేతలు అడ్డుకున్నారు.

నెల్లూరు గాంధీ బొమ్మ కూడలిలో తెదేపా నేతల ధర్నాను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాలలో తెదేపా నాయకులు ఆందోళనలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ తెదేపా నాయకులు రోడ్డెక్కారు. తిరుపతి నగరంలో నేతలను నాయకులను స్టేషన్‌కు తరలించారు. చెర్లోపల్లెలో మంత్రి కొడాలి, ఎమ్మెల్యే అంబటి ఫొటోలను గేదెలకు అంటించి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతపురంలో ఇద్దరు తెదేపా కార్యకర్తలు మనస్తాపంతో పురుగులమందు తాగారు. వారిని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పరామర్శించారు.

ఇదీ చదవండి:

RAINS IN CHITTOOR: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.