ETV Bharat / city

'ప్రాణం ఇస్తాం కానీ.. మీ వెంట రాలేం'.. రాజగోపాల్​రెడ్డితో కార్యకర్తలు..!

author img

By

Published : Jul 28, 2022, 7:27 PM IST

Komatireddy Rajgopal Reddy: తెలంగాణలో కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. కార్యకర్తలతో సంప్రదింపులు మూడు రోజులకు చేరిన నేపథ్యంలో.. మిశ్రమ స్పందన వస్తోంది. భాజపాలో చేరేందుకు సిద్ధమైనా.. రాజీనామా చేయాలా..? పార్టీ సస్పెండ్​ చేసేవరకు ఆగాలా..? అన్న అయోమయంలోనే రాజగోపాల్​రెడ్డి ఇంకా ఉన్నారు.

rajgopal
rajgopal

Komatireddy Rajgopal Reddy: తెలంగాణలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. తాను పార్టీ మారాలా వద్దా.. అనే విషయంపై మూడు రోజులుగా నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జపుతున్న రాజగోపాల్​ రెడ్డి.. ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వటంలేదు. పార్టీ మార్పుతో పాటు.. రాజీనామా అంశంపై కూడా స్థానిక నాయకులతో రాజగోపాల్​ రెడ్డి చర్చిస్తున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అయితే.. కార్యకర్తల నుంచి ఆయనకు మిశ్రమ స్పందన వస్తుండటం గమనార్హం.

పార్టీ మార్పు విషయంలో తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కొందరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. "వ్యక్తిగతంగా మీరంటే ప్రాణం ఇస్తాం.. కానీ మీ వెంట రాలేం.." అంటూ కొందరు అభిమానులు రాజగోపాల్​రెడ్డికి నేరుగానే తేల్చి చెబుతున్నారు. పార్టీ మార్పు వద్దని.. అందులోనూ భాజపాలోకి అస్సలు వద్దని సూచిస్తున్నారు. భాజపాకు నియోజకవర్గంలో సానుకూలత లేదని వివరిస్తున్నా.. ఒకవేళ రాజీనామా చేస్తే.. తిరిగి గెలుపు సాధ్యం కాదని మరికొందరు ముఖం మీదే చెప్పేస్తున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే.. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే.. కాషాయ కండువా కప్పుకోవాలని భాజపా స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో.. భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న రాజగోపాల్​రెడ్డి.. రాజీనామాపై మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ మారుతున్నట్టు సంకేతాలు అధిష్ఠానానికి ఇప్పటికే చేరిన నేపథ్యంలో.. హైకమాండ్ సస్పెండ్ చేస్తే వెంటనే భాజపాలో చేరొచ్చన్న వ్యూహంతో రాజగోపాల్​ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేస్తే అందుకు తగిన వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందని.. దానికి బదులు కాంగ్రెస్​ సస్పెండ్​ చేయటం వల్లే భాజపాలో చేరాననే వాదనను బలంగా వినిపించేందుకు అవకాశం ఉంటుందని యోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు.. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తోన్న హైకమాండ్​ మాత్రం రాజగోపాల్​రెడ్డి సస్పెన్షన్​ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. పైగా.. పలు కాంగ్రెస్​ నేతలు ఇప్పటికీ బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజగోపాల్​రెడ్డిని దిల్లీకి రమ్మని.. హైకమాండ్​ దూతల నుంచి పిలుపు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఇన్ని సమీకరణాల మధ్య.. రాజగోపాల్​రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న అంశంపై రెండు పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.