ETV Bharat / city

విధివంచితుల విషాద గాథ.. ఎన్నెళ్లైనా తీరని వ్యథ !

author img

By

Published : Feb 21, 2021, 9:32 PM IST

విధివంచితుల విషాదగాథ.. ఎన్నెళ్లైనా తీరని వ్యథ
విధివంచితుల విషాదగాథ.. ఎన్నెళ్లైనా తీరని వ్యథ

వారంతా విధి వంచితులు. వివిధ ప్రమాదాల్లో గాయపడి ఏళ్లుగా అచేతనంగా మంచానికే పరిమితమైన అభాగ్యులు. రోడ్డు ప్రమాదాలు, ప్రమావదశాత్తు సంభవించిన సంఘటనలతో వెన్నెముక కోల్పోయి తీరని వేదన అనుభవిస్తున్న బాధితులు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు తెలంగాణలో దాదాపు 1800 బాధితుల్లో ఎవరిని కదిలించినా దయనీయ గాథలే. కష్టాల కథలే. విధి వక్రీకరించి కుటుంబానికి వెన్నెముకలా నిలవాల్సిన వారే ప్రభుత్వ సాయం కోసం చేతులు జోడించి అర్థిస్తున్న వైనం కంటతడి పెట్టిస్తోంది.

విధివంచితుల విషాదగాథ.. ఎన్నెళ్లైనా తీరని వ్యథ

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణ పురానికి చెందిన సామినేని ప్రసాద్..ఎంఏ చదివారు. అప్పట్లో ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 2007 ఏప్రిల్ 20న డాబా ఎక్కి దిగుతుండగా మెట్లపై నుంచి జారిపడి కిందపడిపోయాడు. స్పృహ కోల్పోయిన ప్రసాద్‌ను కుటుంబ ఆసుపత్రికి తరలించగా వెన్నెముక విరిగిపోయిందని వైద్యులు తెలిపారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్​లోని అన్ని ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. మూమూలు మనిషి అయ్యే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పారు.

దాదాపు 20 లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు

ఆయుర్వేదిక్, ప్రకృతి వైద్యం కోసం కేరళ వరకూ వెళ్లారు. దాదాపు 20 లక్షల వరకు చికిత్స కోసం ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. దీంతో 14 ఏళ్లుగా మంచానికే పరిమితమై అచేతన స్థితిలోనే ఉన్నారు. తల్లి సాయమో భార్య చేయూతో లేకుంటే కనీసం కూర్చోలేడు. మంచంపై లేచి కూర్చోవాలన్నా, అన్నం తినాలన్నా తల్లి హైమావతి, భార్య అరుణ తోడు కావాల్సిందే. యూరిన్ బ్యాగ్ తీయడం, డైపర్లు మార్చడం వంటి పనులు చేయాల్సిందే. ఇలా దాదాపు 15 ఏళ్లుగా జీవితపోరాటంలో ఓ యుద్ధమే చేస్తున్నాడు. వైకల్యానికి తోడు వచ్చే అనారోగ్య సమస్యలతో మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు.

దాదాపు 1800 మంది బాధితులు

ఈయన ఒక్కరే కాదు.. తెలంగాణలో రోడ్డు ప్రమాద, ఇతర ప్రమాదాల బారినపడి వెన్నెముక ఇరిగిపోయి అచేతన స్థితిలో ఉన్న బాధితలందరివీ ఇవే దీనగాథలు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి వెన్నుపూస విరిగిపోయిన వారు, ప్రమాదవశాత్తు భవనాలు, మెట్లపై నుంచి కిందకు జారిపడిన వారు, చెట్లు, విద్యుత్ స్తంభాలపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డ వారు.. ఇలా వివిధ ప్రమాదాలతో విధి వక్రీకరించి వెన్నెముక దెబ్బతిని అచేతన స్థితిలో మంచానికే పరిమితమైన వారి కష్టాల కథలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ హృదయవిదారకంగా మారాయి. బాధితులు చెబుతున్న ప్రకారమే ఈ తరహా ప్రమాదాలతో వెన్నెముక దెబ్బతిన్న వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1800 మంది ఉన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 100 మంది

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీరి సంఖ్య దాదాపు 100 మంది వరకు ఉండగా.. మిగిలిన బాధితులంతా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్నారు. గీత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చెట్లపై నుంచి కిందపడిన రైతులు, రోడ్డు ప్రమాదాలకు గురైన వారు ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. కనీసం 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు మంచానికే పరిమితమై కదల్లేని స్థితిలో ఉన్నవారు వీరిలో అనేక మంది ఉన్నారు. వెన్నుముక దెబ్బతిని కనీసం కూర్చోలేక, నిలబడలేక కదల్లేని స్థితిలో ఉన్నారు. కేవలం నోటి మాట తప్ప మిగిలిన ఏ పనీ చేయలేని వారు తమ కుటుంబ సభ్యులమీదే పూర్తిగా ఆధారపడి ఏళ్లుగా జీవన పోరాటం చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు

ఇటువంటి బాధితులున్న ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు వీరికి చేదోడువాదోడుగా ఉండాల్సిందే. ఉదరభాగం మినహా శరీరభాగంలో స్పర్ష తెలియకపోవడం వల్ల ఇతర కుటుంబీకులే వారికి అన్ని సపర్యలు చేయాల్సి వస్తుంది. మంచంలో నుంచి లేచి కూర్చోవాలన్నా ఎవరో ఒకరి సాయం కావాల్సిందే. అన్నం తినిపించడం, డైపర్లు మార్చడం, యూరిన్ బ్యాగులు మార్చడం, నిత్యం చేయాల్సిందే. ప్రమాదవశాత్తు వెన్నెముక కోల్పోయిన బాధితులుగా ఏళ్లుగా మంచానికే పరిమితమైన ఈ బాధితుల్లో అత్యధిక మందికి ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్ రావడం లేదు. సదరం ధృవీకరణ పత్రాలు ఇవ్వకోవడం వల్ల వీరిలో చాలామంది ఆసరా పెన్షన్లకు ఏళ్లుగా అర్హులు కావడం లేదు. అంతేకాకుండా చాలావరకు శరీరభాగాలకు స్పర్శ తెలియకపోవడం వల్ల కనీసం మలమూత్రాలు వచ్చే సమయం కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇందుకోసం యూరిన్ క్యాథటర్స్, యూరిన్ బ్యాగులు నిత్యం వాడాల్సి వస్తుంది.

నెలకు రూ. 10 వేలు పెన్షన్ ఇవ్వాలి

ఇంకా బెడ్ సోర్స్ డ్రెస్సింగ్ కు రోజూ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎయిర్ పరుపులు వాడక తప్పడం లేదు. నిత్యం ఫిజియోథెరపి, మందులు వాడాల్సిందే. రిహాబిలిటేషన్ కేంద్రం లేకపోవడం వల్ల వైద్య ఖర్చులకు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఇంటిపెద్ద అచేతనంగా ఉండటంతో ఈ కుటుంబాలన్నీ చిన్నాభిన్నమై గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా..ఏళ్లుగా జీవిత పోరాటం చేస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. తమకు వైద్యం కోసం అయ్యే ఖర్చను ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ల రూపంలో అందించాలని కోరుతున్నారు. నెలకు పెన్షన్ రూ. 10 వేలు చెల్లించాలని వేడుకుంటున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి కేసీఆర్ను​ కలిసే అవకాశం కల్పిస్తే తమ గోడు చెప్పుకుంటామని బాధితులంతా దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒక్కటయ్యారు.

తెలంగాణలో ఉన్న వెన్నెముక బాధితులంతా ఎక్కడో ఓ చోట వైద్యం కోసం వెళ్లిన సందర్భంలో ఆస్పత్రుల్లో కలుసుకునే వారు. అలా కలుసుకున్న వారంతా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒక్కటయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో బాధితులంతా చికిత్సకు సంబంధించిన సమాచారం పంచుకుంటున్నారు. చికిత్స విధానాలు, ఫిజియోథెరపి ఎలా చేసుకోవాలో ఆలోచనలు పంచుకుంటున్నారు. తమ బాధలు, కష్టాలు పంచుకుంటూనే వాటికి వారే పరిష్కారాలపై సలహాలు, సూచనలు ఇచ్చుకుంటున్నారు. ఏళ్లుగా మంచానికి పరిమితమై నిరాశనిస్పృహుల్లో ఉన్న తమకు తామే ఆత్మస్తైర్యం నింపుకునేలా ధైర్యం చెప్పుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారిలో వారే ఆత్మస్తైర్యం నింపుకుంటూ ముందుకెళ్లేలా మానసిక ధైర్యాన్ని ఇచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ముగిసిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు.. 82.85 శాతం పోలింగ్​ నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.