ETV Bharat / city

తెలంగాణ: పులి పంజా బాధిత కుటుంబ మౌన వేదన

author img

By

Published : Dec 19, 2020, 10:51 PM IST

పేగు బంధం... రక్త సంబంధం... తరుచూ వినేమాటలే. కానీ అందులో ఎడబాటు తలెత్తితే మనసు మూగబోతోంది. మౌన రోదనగా మిగులుతుంది. ఎదిగిన కూతురు ... కళ్లముందటే తిరిగిరానిలోకాలకు వెళ్లిపోతే.. ఎదలోతుల్లో కలిగే వేదన మాటల్లో వర్ణించలేం. అనుభవించేవారికే ఆ గోడు తెలుసు. తెలంగాణలోని కుమురంభీం జిల్లా పెంచికల్‌ పేట మండలం కొండపల్లిలో పెద్దపులి పంజా మిగిల్చిన పసుల నిర్మల కుటుంబం... మౌనంగా రోదిస్తోంది. కన్నీటి పర్యంతంతో తల్లడిల్లుతోంది.

పులి పంజా బాధిత కుటుంబ మౌన వేదన
పులి పంజా బాధిత కుటుంబ మౌన వేదన

అక్క జ్ఞాపకాలను తలుచుకుంటూ... మౌనంగా రోదించే చెల్లి. బిడ్డ కళ్ల ముందే కదులుతుందనే కుమిలిపోతున్న తల్లి. లోకం పోకడ అసలే తెలియని అమాయకత్వం... ఆస్తిపాస్తులంటూ ఏమీలేని దైన్యమైన జీవితం. వెరసి... తెలంగాణలోని కుమురంభీం జిల్లా కొండపల్లిలో ఇటీవల పులిపంజాకు ప్రాణాలు వదిలిన పసుల నిర్మల కుటుంబ దయనీయమైన దుస్థితి ఇది.

అసలు ఏం జరిగిందంటే?

కుమురంభీం జిల్లా పెంచికల్‌ పేట మండలం కొండపల్లిలో నవంబర్‌ 29న పత్తి తీయడానికి కూలికి వెళ్లిన పసుల నిర్మల అనే బాలికను పెద్దపులి హత మార్చింది. నిర్మలది రెక్కాడితే గానీ డొక్కనిండని నిరుపేద కుటుంబం. తల్లీతండ్రులు పసుల లస్మక్క- పోశం ఆరుగురు సంతానంలో నిర్మల రెండో అమ్మాయి. రేకులతో వేసిన చిన్నపూరిగుడిసె, తలా రెండు బట్టల జతలు, ఇంటిముందు తాడుతో కట్టిన ఓ ఊయల, మూడు పొయ్యిరాళ్లే వారి ఆస్తిపాస్తులు. కుటుంబీకులందరూ పోషకాహార లోపంతోనే బాధపడుతున్నారు. కుటుంబాన్ని నెగ్గుకురావాలనే కారణంతోనే నిర్మల తల్లీ, అన్నకు తోడుగా రోజు కూలికి వెళ్తుంది.

నవంబర్‌ 29న అలాగే వెళ్లింది. పత్తితీస్తుండగా వెనకనుంచి పెద్దపులి దాడిచేసింది. అమ్మా... అనే ఆమె ఆకరి పిలుపే తల్లి సహా మిగిలిన కూలీలను అప్రమత్తం చేసింది. అప్పటికే నిర్మల మృతి చెందింది. కంటి ముందరనే బిడ్డ పులి పంజాకు బలికావడంతో ఆకుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. బుక్క నోట్లోకి వెళ్లక కుటుంబం అభద్రతలో కొట్టుమిట్టాడుతోంది.

కంటిలో కనిపించే కూతురు జ్ఞాపకం తల్లీదండ్రులను మరింత కుంగదీస్తోంది. ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం అందచేసినప్పటికీ ... ప్రాణం తిరిగిస్తుందా..? అనే వారి గుండె గోడు మనసులనే కాదు... మనుషులను చలింపచేస్తోంది.

పులి పంజా బాధిత కుటుంబ మౌన వేదన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.