ETV Bharat / city

అనుభవ సారం.. అక్షర హారం

author img

By

Published : Feb 7, 2021, 10:59 AM IST

some of the authors penned their life experiences and wrote a book
అనుభవ సారం.. అక్షర హారం

ఓటమి నాలో మరింత దృఢత్వాన్ని పెంచిందంటాడు ఒకనాటి పరాజితుడు. ఊపిరిపోయే క్షణంలో నాకు బతుకు విలువ తెలిసిందంటారు మరొకరు. కష్టాలకు ఎదురీది గడించిన అనుభవాలనే విజయానికి మెట్లుగా మలచుకోవచ్చని సూచిస్తుంది ఒక వ‘యోధుడి’ జీవితం. తమ గాథ పదిమందికీ తెలిస్తే... అది వారికి ఎంతోకొంత ఉపయోగపడుతుందన్న ఆలోచన వారిది. తాము దాటి వచ్చిన జీవనయానాన్ని అక్షరీకరించారు కొందరు. స్వతహాగా రచయితలు కాకపోయినా... తాము ఎదుర్కొన్న కష్టనష్టాలు, వాటిని అధిగమించిన తీరు... భావోద్వేగాలు... ఇలా విభిన్న అంశాలను మేళవించి పుస్తకరూపమిచ్చారు. అనుభవాన్ని మించిన పాఠం లేదంటారు. అలా స్వీయానుభవాలను పంచిన కొందరి రచనలు... వాటిలోని రసజ్ఞత... ఒకసారి తరచి చూద్దామా...

జీవితం అంటే ఎన్నో గెలుపోటములు.. కష్టసుఖాలు.. ఎత్తుపల్లాలు! ప్రతి అడుగులోనూ కొత్తపాఠాలు. ప్రతి ఒక్కరిలో కదిలి కథ దాగుంటుంది. పలకరిస్తే వారి నుంచి ఎన్నో జ్ఞాపకాలు ఉబికివస్తాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ఔత్సాహికులు తమ విజయాలకు.. పరాజయాలకు.. సాహసాలకు.. భయాలకు పుస్తక రూపం ఇస్తున్నారు. పుట్టుకతోనే కవులో, రచయితలో కాకపోయినా తమ జీవనయానాన్ని రచనలుగా మలచి పుస్తకరూపంలో భద్రపరుస్తున్నారు. అలాంటి కొందరు తమ రచనల వెనుక దాగిన అనుభవాలను పంచుకున్నారు.

ఒక జడ్జిగారి ఆత్మకథ

ఒక జడ్జిగారి ఆత్మకథ
ఒక జడ్జిగారి ఆత్మకథ

విశ్రాంత న్యాయమూర్తి ఆచంట సద్గురు ప్రసాద్‌. కృష్ణాజిల్లా గుడివాడలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఇటీవలే 86వ ఏట అడుగుపెట్టారు. మూడేళ్ల వయసులో తండ్రి మరణం.. ఐదుగురు సంతానంతో ఒంటరి అమ్మ సాగించిన జీవనయానం. కలసిరాని కాలం.. సవాల్‌ విసిరిన సమాజం మధ్య.. ఆమె బిడ్డలను ప్రయోజకులుగా మార్చేందుకు పరితపించారు. ఒంటరి మహిళగా ఆమె చూపిన తెగువ.. ధైర్యసాహసాలే తనకు స్ఫూర్తి అంటారు సద్గురు ప్రసాద్‌. జిల్లా న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన ఆ తర్వాతా పలు పదవులు చేపట్టారు.

హైదరాబాద్‌ చంపాపేట్‌లో ఉంటున్న సద్గురు ప్రసాద్‌ తన అనుభవాలకు ‘ఒక జడ్జి గారి ఆత్మకథ’ (తెలుగు) పుస్తకానికి రూపమిచ్చారు. అమ్మ ఒంటిపై ఒక్కొక్క నగ మాయవుతుండగా నా చదువు కొనసాగింది. బాల్యంలో తండ్రిలేని లోటును అనుభవించానంటారాయన. కాళ్లకు చెప్పులు కొనేందుకు అమ్మ వెచ్చించిన మూడు రూపాయలతో ఒకరోజు గడచిపోతుందని ఆలోచించటం వంటి ఎన్నో స్వీయ అనుభవాలను పంచుకున్నారు. అమ్మలోని అమాయకత్వం, జాలి గుణాలు తనకు మహిళల పట్ల గౌరవాన్ని మరింత పెంచిందంటారు. ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆచితూచి జీవితంలో అడుగులు వేయాలనే విషయాన్ని భావితరాలకు పంచేందుకు ఆత్మకథ రాశారని ఆయన సతీమణి డాక్టర్‌ హేమలతాదేవి వివరించారు.

ఎవరెస్ట్‌ నుంచి ప్రేమతో..

ఎవరెస్ట్‌ నుంచి ప్రేమతో..
ఎవరెస్ట్‌ నుంచి ప్రేమతో..

పర్వతారోహకురాలు (మౌంటనీర్‌) నీలిమ పూదోట. గచ్చిబౌలిలో ఉంటున్నారు. కార్పొరేట్‌ కొలువు.. ఉన్నతమైన జీవితం. అన్నీ వదులుకుని పర్వతారోహణమే జీవితంగా మలచుకున్నారు. సాధనచేసి.. శ్రమకోర్చి అడ్డంకులు దాటుకుని ఎవరెస్ట్‌ శిఖరం అంచున జాతీయపతాకం ఎగురవేశారు. కిలిమంజారో శిఖరపు అందాలను ఆస్వాదించారు. ఆడపిల్లంటే సున్నితత్వమే కాదు.. తలచుకుంటే పర్వతాలను సైతం జయించగల శక్తిమంతురాలని నిరూపించారు. రోజుల తరబడి ప్రమాదపుటంచుల్లో సాగిన ఎవరెస్ట్‌ పర్వతారోహణ అనుభవాలతో ‘ఫ్రం ఎవరెస్ట్‌ విత్‌ లవ్‌’ (ఆంగ్లం) పుస్తకాన్ని అందించారు.

హైదరాబాద్‌లో ఉన్న తల్లి కోసం తన వద్ద పుస్తకంలో రోజుకో ఉత్తరం రాయటం ప్రారంభించారు. ఒకవేళ తనకు ఏదైనా జరిగితే తాను రాసిన ఉత్తరాలను తల్లి కొండవీటి పాపకు పంపాలని షెర్పాకు చెప్పారామె. ప్రమాదకరంగా సాగిన ప్రయాణంలో మృత్యు ముఖం వరకు వెళ్లారు. సహాయకులు రావటం ఏ మాత్రం ఆలస్యమైనా ఘోరం జరిగేది. తన అనుభవాలను పుస్తకంగా మలచాలని భావించారు. తన భావోద్వేగాలు తాను మాత్రమే చెప్పగలననే ఆలోచనతో అమ్మకు రాసిన ఉత్తరాలను ఏర్చికూర్చి ఈ పుస్తకానికి ప్రాణం పోశానంటారామె.

నా దారి రహదారి

నా దారి రహదారి
నా దారి రహదారి

జై భారతి.. ఇలా చెప్పటంకంటే బైకర్నీ జైభారతి అంటే అందరూ గుర్తుపడతారు. ఫిలింనగర్‌లో ఉంటున్నారు. ఆర్కిటెక్ట్‌గా అందంగా సాగే జీవితం. తనకు మాత్రం ప్రపంచాన్ని చుట్టిరావాలనే కోరిక. బుల్లెట్‌ నడపటంలో ప్రావీణ్యం. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన అనుభవం. ఆడపిల్ల ఎందులో తక్కువ. ప్రతి అమ్మాయి బుల్లెట్‌ నడపగలదు. ఎంతదూరమైనా ప్రయాణించగలదనే ధైర్యాన్ని నింపేందుకు ‘రోడ్‌ మెకాంగ్‌’ పుస్తకం రాశానంటారామె. 6 దేశాలు.. లక్ష కిలోమీటర్ల ప్రయాణం.. ఇదీ ఆమె ట్రాక్‌ రికార్డ్‌. బైకర్నీ పేరుతో ఆడపిల్లలకు బుల్లెట్‌ నడపటంలో శిక్షణనిస్తున్నారు.

2018 ఫిబ్రవరిలో నాలుగు బైక్‌లు.. నలుగురు సహాయకులు మరో కారులో ప్రయాణిస్తుండగా థాయ్‌లాండ్‌, వియత్నాం చుట్టొచ్చారు. ఆ అనుభవాలను అక్షరాలుగా గుదిగుచ్చి 2019లో నెలరోజుల పాటు శ్రమించి రాసిన పుస్తకమే ‘రోడ్‌ మెకాంగ్‌’. తెలుగు/ఇంగ్లిషు భాషల్లో ఆవిష్కరించారు. ‘‘ఈ పుస్తకాన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థినులకు పంపిణీ చేశాం. ఒకసారి గురుకుల విద్యార్థినులతో మాట్లాడేందుకు వెళ్లినపుడు.. డాక్టర్‌ జై భారతి అంటూ బోర్డుపై ఆహ్వానం పలుకుతూ రాయటం ఆశ్చర్యమేసింది. నేను డాక్టర్‌ని కాదని చెప్పినా.. ఇంతటి గొప్పపని సాధించినందుకు తామిచ్చే గౌరవం’’ ఆ పిల్లలు చెప్పడం నాకెంతో గొప్పగా అనిపించిందంటారామె.

నాన్న అర్థమయ్యారు

నాన్న అర్థమయ్యారు
నాన్న అర్థమయ్యారు

స్టూమ్యాగ్జ్‌ సీఈఓ శ్రీచరణ్‌ లక్కరాజు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్నారు. బాల్యంలో హీరోగా కనిపించే నాన్న.. కొందరికి యుక్తవయసులో బద్ధశత్రువుగా కనిపిస్తాడు. ఎందుకో నాన్న చేతగానివాడనే అభిప్రాయం కొందరు కుమారుల్లో కనిపిస్తుంది. తన స్నేహితుడి తండ్రి బెంజ్‌ కారులో తిరుగుతుంటే.. ఇప్పటికీ నాన్న ఎందుకిలా డొక్కు స్కూటర్‌ మీద ప్రయాణిస్తున్నారో అనే చులకన భావం ఉంటుంది. కానీ.. ఆ కష్టాల వెనుక.. కుటుంబం.. బాధ్యతలు ఉన్నాయనే సత్యం గుర్తించినపుడు నాన్నలోని ఔన్నత్యం.. పెద్దరికం కనిపిస్తాయంటున్నారు శ్రీచరణ్‌. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో తన తండ్రితో జరిగిన సంభాషణలకు అక్షర రూపమిచ్చారు. ‘డాడ్‌’ అనే పుస్తకం (ఆంగ్లం) రాశారు.

మా నాన్న రవీందర్‌ లక్కరాజు. ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు. ప్రతి తండ్రి.. తన అనుభవాలు.. గెలుపోటములను బిడ్డలతో పంచుకోవటం ద్వారా వారికి దిశానిర్దేశం చేస్తాడు. దీన్ని గ్రహించలేని పిల్లలు.. తండ్రిని చులకనగా చూడటం.. తక్కువగా అంచనా వేయటం చేస్తుంటారు. నాన్న ధైర్యంగా ఏదైనా చేసి ఉంటే సమాజంలో గొప్పగా బతికేవాళ్లమనే ఉద్వేగాలకు లోనవుతుంటారు. నాన్న వెనుకబాటుకు అప్పటి పరిస్థితులు అనుకూలించక విఫలమయ్యారనేది అర్థం చేసుకోగలిగానంటారు శ్రీచరణ్‌. నాన్నను తక్కువ చేయవద్దు. ఆయన అపజయాన్ని చేతగానితనంగా భావించవద్దనేది నా సూచన అన్నారు. ‘ఏరా.. నేను మాట్లాడుతుంటే నువ్వేమి పట్టించుకోలేదనుకున్నా.. బాగానే గుర్తుపెట్టుకున్నావు’’రా అంటూ పుస్తకం పూర్తయ్యాక.. నాన్న అన్న మాటలు సంతోషం కలిగించాయంటారు శ్రీచరణ్‌.

సమాచారమే సంపద

సమాచారమే సంపద
సమాచారమే సంపద

ఎ.రంజిత్‌ స్వస్థలం కామారెడ్డి జిల్లా. ఎథికల్‌ హ్యాకర్‌గా పనిచేస్తున్నారు. సాధారణ పల్లెటూరి విద్యార్థి. చదువుకోవాలని.. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలనేది తపన. ఉన్నత విద్యాసంస్థల్లో నిర్వహించే సదస్సులకు వెళుతూ విజ్ఞానం సంపాదించారు. అంతర్జాలం ద్వారా ఇంగ్లిషు, సాంకేతికతపై పట్టు పెంచుకున్నారు. పెరుగుతున్న సైబర్‌ నేరాలు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలను తప్పటగుడులు వేయిస్తున్న స్మార్ట్‌ఫోన్లపై నిఘా కోసం స్పై యాప్‌ను రూపొందించి ఉచితంగా సేవలు అందిస్తున్నాడు. హ్యాకింగ్‌పై పరిజ్ఞానం పెరిగాక ‘ఇన్ఫర్మేషన్‌ ఈజ్‌ వెల్త్‌’ (ఇంగ్లిష్‌) పుస్తకం రాశాడు. హ్యాకర్ల బారినపడకుండా ఉండటం.. సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవటం వంటి అంశాలను ఆ పుస్తకంలో వివరించారు.

ఇదీ చూడండి : తొలిరోజు జోరుగా సాగిన మూడోవిడత నామినేషన్ల ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.