ETV Bharat / city

సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియ

author img

By

Published : Dec 31, 2020, 3:29 AM IST

రాష్ట్రంలో చేపట్టనున్న సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టు కోసం 24 బిడ్లు దాఖలయ్యాయి. త్వరలోనే ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం తెరిచి సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను చేపట్టే సంస్థను ఖరారు చేయనుంది.

సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియ
సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియ

రివర్స్ బిడ్డింగ్​లో టెండర్లను పూర్తి చేసిన అనంతరం సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా 48 వేల 800 కోట్ల విద్యుత్ ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 24 బిడ్లు దాఖలైనట్టు ఇంధన శాఖ వెల్లడించింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అనంతరం ప్రాజెక్టును నిర్మించే సంస్థను ఖరారు చేయనున్నారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నవంబరు 30వ తేదీన ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. డిసెంబరు 28వ తేదీతో బిడ్ల స్వీకరణకు గడువు ముగిసింది. త్వరలోనే ఈ బిడ్లను తెరిచి రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియ ముగియనుంది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు(ఎంఎన్‌ఆర్‌ఈ) అనుగుణంగా ఈ టెండర్లను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా రానున్న 30 ఏళ్లలో 48 వేల 800 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఆదా అయ్యే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఆమోదించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల ద్వారా ప్రతి ఏటా 12,221 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారని అంచనా. డిస్కంలు 13,039 మిలియన్ యూనిట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 8,354 మెగావాట్ల విద్యుత్​ను ఏటా వినియోగించాల్సి వస్తున్నందున సబ్సిడీ పరంగా భారం పడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. 2015-16లో 3,186 కోట్లు 2018-19 నాటికి 4 వేల కోట్ల రూపాయల మేర సబ్సిడీ చెల్లించాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. ఇక 2020-21లో వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి ప్రభుత్వం 8,354 కోట్లు కేటాయించింది.

సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు అయితే గరిష్టంగా విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశముందని ఇంధనశాఖ అంచనా వేస్తోంది. పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలులో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రం మొత్తం వినియోగించే విద్యుత్​లో 65 శాతం మేర ఈ జిల్లాల్లోనే విద్యుత్ వినియోగం అవుతోంది. దీంతో ఏపీ గ్రీన్‌ ఎనర్జీ సోలార్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్​కు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును చేపట్టింది. వ్యవసాయానికి సౌర విద్యుత్‌ వినియోగం వాడటం వల్ల శిలాజ ఇంధనం వాడకం క్రమంగా తగ్గే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే 14 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: తిరుపతిలో భార్యకు ఖరీదు కట్టిన శాడిస్టు భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.