ETV Bharat / city

విద్యుత్ ఛార్జీల పెంపు, చెత్త పన్నుల వసూలుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..

author img

By

Published : Apr 6, 2022, 3:42 PM IST

protest
విద్యుత్ ఛార్జీల పెంపు, చెత్త పన్నుల వసూలు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పలు పార్టీ నాయకుల ఆందోళనలు..

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, చెత్త పన్నుల వసూలు విషయంలో ప్రజలతో పాటు తెదేపా, కాంగ్రెస్, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాగే చెత్త పన్నుల విషయంలోనూ నిరసనలు చేస్తున్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళనలు:

అనంతపురం: తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా జగన్ పరిపాలన కొనసాగుతోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో పార్టీ కార్యాలయం నుంచి పాతూరు విద్యుత్ కేంద్రం వరకూ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. ర్యాలీ చేస్తున్న నాయకులను పోలీసులు రోడ్డుపై అడ్డుకుని అరెస్టు చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శైలజానాథ్‌ తెలిపారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళనలు

గుంటూరు: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ గుంటూరులో తెలుగు యువత వినూత్న నిరసన చేపట్టారు. ప్రజలకు విసనకర్రలు పంచుతూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఛార్జీలు తగ్గించకుంటే ప్రజాపోరుకు సమాయత్తమవుతామని హెచ్చరించారు.

విజయవాడ: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడ పటమటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్​రావు నిరసన చేపట్టారు. ప్రజలకు ఇక కొవ్వొత్తులే దిక్కంటు.. స్థానికులకు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. అరాచక పాలనతో జగన్​రెడ్డి త్వరలో గిన్నిస్ బుక్ ఎక్కనున్నారన్నారని ధ్వజమెత్తారు. బాదుడే బాదుడు అనేది.. జగన్ రెడ్డి ట్యాగ్ లైన్‌లా మారిందని విమర్శించారు.

శ్రీకాకుళం: పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, కోతలకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట మండలంలో తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో లక్ష్మీనర్సుపేట విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించారు. అనంతరం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. చేతకాని ప్రభుత్వంతో ప్రజలు కునుకు తీసే పరిస్థితి లేకుండా పోయిందని తెదేపా నేతలు విమర్శించారు.

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని కొల్లివలస కూడలిలో కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, టీడీఆర్ రాజుపేట ఎంపీటీసీ సభ్యుడు అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు పెంపు, విద్యుత్ అంతరాయంపై నిరసన చేపట్టారు. విద్యార్థులు, వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాలు విద్యుత్ అంతరాయంపై ఆందోళన చేపట్టారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జైరాం, సంగం నాయుడు, సంతోష్, జనసేన కార్యకర్తలు పాల్గున్నారు.

అన్నమయ్య జిల్లా: రాజంపేటలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ప్రధాన ద్వారం నుంచి ఈఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరంతరం రైతులకు విద్యుత్తు సరఫరా చేస్తానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం గంట సైతం ఇవ్వడం లేదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ఆరోపించారు. బొప్పాయి, అరటి, నిమ్మ పంటలు వేసుకోవడానికి ఎకరాకు లక్ష రూపాయల పైగా అవుతోందని తీరా పంట చేతికి వచ్చే సమయానికి విద్యుత్తు సరఫరాలో లోపం వల్ల పంటకు నీళ్లు అందడం లేదని తెలిపారు. పుష్కలంగా వర్షాలు పడిన విద్యుత్ ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజ మెత్తారు.

చెత్తపన్నుపై ఆందోళనలు: విశాఖ: ప్రజల నిత్యజీవనాన్ని ప్రభుత్వం పన్నులమయం చేస్తోందని విశాఖలో పౌరసంఘాల వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. చెత్తపన్నుకు వ్యతిరేకంగా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త బుట్టలతో నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆస్తి పన్నులోనే చెత్త పన్ను కట్టించుకుంటున్న ప్రభుత్వం రెండోసారీ వసూలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మరుగు దొడ్లపైనా పన్నుల బాదుడుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెత్తపన్నుపై ఆందోళనలు

ఇదీ చదవండి: ABV Comments: 'తన గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకూడదా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.