ETV Bharat / city

ఒక్కో విడతలో 3000- 3500 పంచాయతీలకు ఎన్నికలు

author img

By

Published : Jan 10, 2021, 5:26 AM IST

Updated : Jan 10, 2021, 7:12 AM IST

ఒక్కో విడతలో ఎన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు,మూడు రోజుల్లో కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించనుంది. మూడు నుంచి మూడున్నర వేల పంచాయతీలకు ఒక్కో విడత చొప్పున ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

sec on panchayati raj elections
ఒక్కో విడతలో 3000- 3500 పంచాయతీలకు ఎన్నికలు

పంచాయతీ ఎన్నికలపై రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతున్నా.. ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినా.. ఎస్​ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభించేసింది. ఇందులో భాగంగా 2-3 రోజుల్లో కలెక్టర్లతో సమావేశంకాబోతోంది. ఒక్కో విడతలో 3 నుంచి మూడున్నర వేల పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ భావిస్తున్నా కలెక్టర్లతో భేటీ తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కోర్టు కేసులు, వివాదాలు లేని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం రాష్ట్రంలో 13వేల 771 పంచాయతీలు ఉన్నాయి. గతేడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించాలనుకున్న సమయానికి వీటి సంఖ్య 13వేల 365. ఎన్నికల వాయిదా అనంతరం కొన్నింటిని విభజించి, మరికొన్నింటిని నగర పంచాయతీలుగా మార్చారు.

బదిలీలపై నిషేధం..
కోడ్ అమల్లోకి వచ్చినందున.... ఎన్నికలు పూర్తయ్యేవరకూ నిర్దేశిత ప్రభుత్వశాఖల్లో బదిలీలపై నిషేధం అమల్లో ఉంటుందని ఎస్ఈసీ ప్రకటించింది. ఎస్ఈసీ, పంచాయతీరాజ్ కమిషనర్‌ కార్యాలయాల అధికారులు, సిబ్బంది బదిలీలపై నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని.... కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంయుక్త కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లనూ బదిలీ చేసే వీలు లేదని పేర్కొంది. ఎన్నికల రిటర్నింగ్ , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందితో పాటు ఎన్నికల కోసం ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి వినియోగించే సిబ్బంది బదిలీలపైనా నిషేధం అమల్లో ఉంటుంది. పోలీసులకూ ఇది వర్తించనుంది. ఎవర్నైనా తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేయాల్సి వస్తే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బదిలీకి గల కారణాలు సహేతుకంగా ఉంటేనే అనుమతించనున్నారు.

రెండో దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..?

పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక.... రెండో దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎస్​ఈసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 9వేల 693 ఎంపీటీసీ, మరో 652 జెడ్పీటీసీ స్థానాలకు గతేడాది మార్చిలో నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే 2వేల 363 ఎంపీటీసీలు, 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల సమయంలోనే పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్టు తెలుస్తోంది.

తప్పించాలని సీఎస్​కు లేఖ..
గతేడాది మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికలకు నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని.. వారిని ఇప్పుడు తప్పించాలని ఎస్​ఈసీ నిమ్మగడ్డ... సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. అప్పట్లో చిత్తూరు, గుంటూరు కలెక్టర్లతో పాటు తిరుపతి అర్బన్‌, గుంటూరు గ్రామీణ ఎస్పీలను విధుల నుంచి తప్పించి వేరేవారిని నియమించాలని నిమ్మగడ్డ ఆదేశించారు. మాచర్ల సీఐని సస్పెండ్ చేసి... శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేయాలన్నారు.

ఈ ఆదేశాలను అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు. గుంటూరు గ్రామీణ ఎస్పీ ఆ తర్వాత బదిలీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మళ్లీ విడుదలై కోడ్ అమల్లోకి రావడం వల్ల గతంలో ఏ అధికారులపై చర్యలకు ఎస్​ఈసీ సిఫారసు చేసిందో వారందరినీ విధుల నుంచి తప్పించి వేరేవారిని నియమించాలని ఆదేశిస్తూ రమేశ్‌కుమార్ మళ్లీ సీఎస్‌కు లేఖ రాశారు.

ఇదీ చూడండి:

స్థానిక ఎన్నికల ప్రకటనపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

Last Updated : Jan 10, 2021, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.