ETV Bharat / city

ఇసుక డంపింగ్‌ పనుల అడ్డగింత

author img

By

Published : Oct 9, 2021, 6:52 AM IST

sand dumping work stopped by amaravathi farmers
sand dumping work stopped by amaravathi farmers

కృష్ణానది పక్కన కరకట్టను ఆనుకుని ఇసుక డంపింగ్‌ ఏర్పాట్లను నిలిపేయాలంటూ రైతులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా పనులెలా చేస్తారంటూ రైతులు అడ్డుకొనేందుకు యత్నించగా.. పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు.

రాజధానిలో కృష్ణానది పక్కన కరకట్టను ఆనుకుని ఇసుక డంపింగ్‌ ఏర్పాట్లను నిలిపేయాలంటూ రైతులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా పనులెలా చేస్తారంటూ రైతులు అడ్డుకొనేందుకు యత్నించగా.. పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. తాళ్లాయపాలెం సమీపంలో కృష్ణానదిలో తీసిన ఇసుకను కరకట్ట పక్కన డంపింగ్‌ చేసేందుకు గుత్తేదారు సంస్థ పనులు ప్రారంభించింది. విషయం తెలుసుకున్న రైతులు, మహిళలు శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకుని పనులు అడ్డుకోబోగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో మహిళా రైతు కంభంపాటి శిరీష నినాదాలు చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మిగతావారినీ తరలించారు. దీన్ని నిరసిస్తూ రైతులు కరకట్టపై ఆందోళనకు దిగారు. ఇసుక తవ్వకాలు, డంపింగ్‌ నిలిపేసే వరకూ కదలబోమని రోడ్డుపై బైఠాయించి, నినాదాలు చేశారు.

15 మంది అరెస్టు

ఆందోళన విరమించాలని పోలీసులు చెప్పినా రైతులు పట్టించుకోలేదు. దీంతో 15 మందిని అదుపులోకి తీసుకుని వాహనాల్లోకి ఎక్కించి పెదకూరపాడు, అమరావతి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అంతకుముందు శిరీషను అరెస్టుచేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రైతులు ఆందోళన చేయడంతో ఆమెను అమరావతి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కోర్టు తీర్పు వచ్చేవరకు ఆగలేరా..?

కృష్ణానదిలో డ్రెడ్జింగ్‌, కరకట్టను ఆనుకుని ఇసుక డంపింగ్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుండగా ప్రైవేటు సంస్థ పనులెలా మొదలుపెడుతుందని పలువురు రైతులు ధ్వజమెత్తారు. ఇసుక డంపింగ్‌ చేస్తే కరకట్ట బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘కోర్టు తీర్పు వచ్చేవరకూ ఆగలేరా..? ఇసుక డంపింగ్‌ చేస్తున్న ప్రాంతం నదినుంచి 150 మీటర్ల లోపే ఉంది. అక్కడ ఇసుక నిల్వచేస్తే నీరు చేరి కరకట్ట బలహీనపడుతుంది. గ్రామాలు మునుగుతాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. ఈ అంశంలో న్యాయస్థానాలు చేసిన సూచనలను అధికారులు పాటించాలి’ అని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి: HIGH COURT: సెంటు స్థలంలో ఇల్లు ఎలా సాధ్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.