ETV Bharat / city

దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కానుకల లెక్కింపుపై మార్గదర్శకాలు విడుదల

author img

By

Published : May 3, 2021, 11:21 AM IST

విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయంలోని హుండీ లెక్కింపునకు దేవదాయ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. కౌంటింగ్‌ ప్రక్రియ సీసీ కెమెరాల్లో రికార్డింగ్‌ చేసేందుకు మల్లికార్జున మహామండపంలో ఏర్పాట్లు చేశారు.

vijayawada hundi
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపునకు దేవదాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. చేతివాటానికి అవకాశం ఇవ్వకుండా పాటించాల్సిన నిబంధనావళిని ఇందులో పొందుపరిచారు. ఈనెల 3న దుర్గగుడి హుండీ ఆదాయాన్ని లెక్కించేందుకు సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఈవో భ్రమరాంబ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో దేవస్థానంలో పనిచేసే ఇద్దరు డీఈలు, పరిపాలనా విభాగంలో నలుగురు ఏఈవోలతోపాటు 50 మంది సిబ్బందికి హుండీ లెక్కింపు విధులు కేటాయించారు. వీరితోపాటు 51 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, మ్యాక్సు సెక్యూరిటీ సిబ్బందికి కానుకల లెక్కింపు విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. హుండీల లోపల నుంచి కానుకలు తీసేటప్పుడు, లెక్కించేటప్పుడు ప్రతి విషయం వీడియో రికార్డింగ్‌ చేయడంతోపాటు కౌంటింగ్‌ ప్రక్రియ ఆద్యంతం సీసీ కెమెరాల్లో రికార్డింగ్‌ చేసేందుకు మల్లికార్జున మహామండపంలో ఏర్పాట్లు చేశారు.

సూచించిన అంశాలు ఇవే..
* హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను 15 రోజులకు ఒకసారి లెక్కించాలి.
* ప్రతి హుండీకి డబుల్‌ లాక్‌ సిస్టం ఏర్పాటు చేయాలి.
* సహాయ కమిషనర్‌ ఆపైస్థాయి దేవస్థానాల్లో హుండీల్లో కానుకలు లెక్కించేటప్పుడు సహాయ కమిషనర్‌ స్థాయి అధికారి విధిగా పర్యవేక్షణ ఉండాలి.
* కానుకల లెక్కింపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ముగించాలి. లెక్కించగా మిగిలిని వాటిని దేవాలయం స్ట్రాంగ్‌ రూమ్‌లో పటిష్ఠ బందోబస్తు నడుమ భద్రపరిచి తిరిగి మరుసటి రోజు లెక్కించాలి.
* కౌంటింగ్‌లో పాల్గొనే మగ సిబ్బంది తప్పనిసరిగా లుంగీ, కండువా మాత్రమే ధరించాలి. చేతికి వాచీలు, బంగారం, ఇతర ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లు వెంట తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకు వస్తే వాటిని తప్పనిసరిగా ముందుగానే సెక్యూరిటీకి అప్పగించిన తరువాత కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలి.
* బంగారం, వెండి వస్తువులు లెక్కించే సమయంలో తూకం తూసే మిషను, బక్కెట్లు గోల్డ్‌ అప్రయిజర్‌ పర్యవేక్షణలో ఉండాలి.
* విద్యార్థులు, మహిళలకు కౌంటింగ్‌ ప్రక్రియ విధులు కేటాయించరాదని నిబంధనల్లో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.