ETV Bharat / city

Rains effect in AP cities: వానొస్తే వణుకే.. రాష్ట్రంలోని అత్యధిక నగరాల్లో ఇదే పరిస్థితి!

author img

By

Published : Jul 22, 2021, 6:44 AM IST

వానాకాలం వచ్చిందంటే చాలు.. రాష్ట్రంలోని నగరాల్లో పల్లపు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్లను, దారులను ముంచెత్తే వాన నీటితో ఇక్కట్ల పాలవుతున్నారు. రోజుల తరబడి నీళ్లు నిలిచిపోతున్న పరిస్థితిలో.. ముంపులోనే బతుకుతున్నారు.

రాష్ట్రంలో వర్షం
రాష్ట్రంలో వర్షం

వానాకాలం వచ్చిందంటే చాలు.. రాష్ట్రంలోని నగరాల్లో పల్లపు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్లను, దారులను ముంచెత్తే వాన నీటితో ఇక్కట్ల పాలవుతున్నారు. రోజుల తరబడి నీళ్లు నిలిచిపోవడంతో ముంపులోనే బతుకుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కడప, తిరుపతి, అనంతపురం నగరాల్లో ఏటా ఇదే సమస్య. ప్రధాన కాలువల ఆక్రమణలు, పూడికలు తొలగించకపోవడం ఇందుకు ముఖ్య కారణాలు. అత్యధిక చోట్ల వరదనీటిపారుదల కాలువలు లేవు. ఈ పనులు ప్రారంభించినచోటా బిల్లులు సరిగా చెల్లించక అవి పూర్తవడంలేదు.

మూడేళ్ల కిందటే హెచ్చరించిన కాగ్‌

విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం నగరపాలక సంస్థలతోపాటు మార్కాపురం, నగరి, పులివెందుల పురపాలక సంఘాల్లో 34 తాగునీటి చెరువులు, జలాశయాలను మూడేళ్ల కిందట కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పరిశీలించింది. 132.03 ఎకరాల ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. విజయవాడ పరిధిలోని కుమ్మరి చెరువు (6.79 ఎకరాలు), గుణదల చెరువు (3.94 ఎకరాలు), నల్ల చెరువు (5.30 ఎకరాలు), శ్రీకాకుళంలో బుడమమ్మ చెరువు (4.79 ఎకరాలు), చౌదరి సత్యనారాయణ కాలనీలో చెరువు (5.29 ఎకరాలు) పూర్తిగా ఆక్రమణకు గురైనట్లు కాగ్‌ వెల్లడించింది. చెరువుల్లో నిర్మాణాలను అడ్డుకోవడంలో పుర, నగరపాలక సంస్థలు విఫలమయ్యాయని పేర్కొంది.

నగరాల్లో నరకమే!

విజయవాడలో... వరద నీటి కాలువలు పూర్తయ్యేదెప్పుడో?

కొద్దిపాటి వానకే విజయవాడలో రోడ్లు, కాలనీలు జలమయమవుతున్నాయి. సమస్య శాశ్వత పరిష్కారానికి 2017లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.461 కోట్లతో వరద నీటి కాలువల పనుల్ని చేపట్టాయి. 2019 ఆగస్టుకే పనులు పూర్తికావాల్సి ఉన్నా జరగలేదు. దీంతో 2021 నవంబరుకు గడువు పొడిగించారు. 443 కిలోమీటర్ల చిన్న, పెద్ద కాలువల నిర్మాణంలో రూ.180 కోట్లు ఖర్చు చేసి 65% పనులు పూర్తి చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యం, ఆక్రమణల తొలగింపుల్లో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు పనులకు అడుగడుగునా అవరోధంగా నిలుస్తున్నాయి.

కడపలో.. ఆక్రమణలే ముంచుతున్నాయి..

కడపలో 80 శాతం ప్రాంతాలు ఏటా వర్షాకాలంలో మునిగిపోతున్నాయి. చెరువులకు వరద నీరు వెళ్లే వంకలు, చెరువుల నుంచి నీరు బయటకు పోయే వాగుల ఆక్రమణలతో నగరానికి ఏటా వరద ముంపు తప్పడం లేదు. నగరంలో వరదనీటి కాలువల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నందున కొద్దిపాటి వర్షాలకు నీరు రోడ్లపైకి వస్తోంది. బుగ్గవంక రక్షణ గోడల నిర్మాణం పూర్తి కాకపోవడంతో వరద కడపలోని వివిధ ప్రాంతాలను ముంచెత్తుతోంది.

కడపలోని అప్సరా థియేటర్‌ నుంచి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లే ప్రధాన మార్గం ఇది. గత ఇరవై రోజుల్లో నాలుగుసార్లు వరద నీటి ముంపునకు గురైంది. వాన కురిసే సమయంలో ఈ మార్గంలో పకీరు చెరువుకు వెళ్లాల్సిన వరద నీరు కాలువల ఆక్రమణలతో రహదారిపైకి వచ్చి నిలిచిపోతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు నాలుగు అడుగుల లోతులో మూడు రోజులపాటు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

అనంతపురంలో.. అసంపూర్తి పనులు

అనంతపురంలో మరువవంక వరద నీటి కాలువ అభివృద్ధికి అమృత్‌ పథకంలో రూ.41 కోట్ల అంచనాతో 2018లో పనులు ప్రారôభించారు. పది శాతం పూర్తయ్యాక నిలిపివేశారు. ఫలితంగా వానాకాలంలో కాలువ సమీపంలోని మహాత్మాగాంధీకాలనీ, జర్నలిస్టుకాలనీ, రాజహంస కొట్టాల కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో జనశక్తినగర్‌, ప్రశాంతినగర్‌, రంగస్వామినగర్‌, సోమ్‌నాథ్‌నగర్‌కు ముంపు బెడద తప్పడం లేదు. మరో ప్రధాన కాలువ నడిమివంక అభివృద్ధి పనులు ఆక్రమణల కారణంగా అక్కడక్కడ నిలిచిపోయాయి.

విశాఖపట్నంలో... వీధుల్లోకి చెరువుల నీరు

భారీ వర్షం కురిస్తే విశాఖ గాజువాక పరిధిలోని కాలనీల్లో ప్రజలకు అవస్థలే. చెరువుల్లో చేరే వాన నీటితో రహదారులు, ఇళ్లు మునుగుతున్నాయి. కృష్ణమహంతి, మింది పెద్దచెరువుల్లో గృహాలు, అపార్ట్‌మెంట్లు వెలిశాయి. భారీ వర్షం కురిస్తే చెరువుల్లోని నీరు దిగువకు రావడంతో షీలానగర్‌, వెంకటేశ్వరకాలనీ, హరిజనజగ్గయ్యపాలెం, అయ్యప్పనగర్‌, మిలట్రీకాలనీ, మిందిఎస్సీకాలనీ మునుగుతున్నాయి. ఎర్రిగెడ్డ, గంగులగెడ్డలో పూడికలతో జ్ఞానాపురం మొదలుకొని చుట్టూ ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.

తిరుపతిలో... చినుకు పడితే జలమయం

తిరుపతిలో సాధారణ వానకే పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. 12 మీటర్ల వెడల్పు ఉండే మురుగునీటి కాలువలు అనేక చోట్ల ఆక్రమణలతో ప్రస్తుతం రెండు మీటర్లయినా లేవు. ఆటోనగర్‌, పూలవానిగుంట, సుబ్బారెడ్డినగర్‌, కొత్తపల్లి, మధురానగర్‌, ఎస్వీనగర్‌ ఏటా వర్షాకాలంలో ముంపు బారిన పడుతున్నాయి. నగర అవసరాలకు తగ్గ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, వరదనీటి కాలువల నిర్మాణ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో ఏటా వానాకాలమంతా అవస్థలే.

నెల్లూరులో.. వరదనీటి పారుదల వ్యవస్థ అంతంతే

నెల్లూరు నగరంలో సరైన వరదనీటి పారుదల వ్యవస్థ లేక ముంపు సమస్య తలెత్తుతోంది. గత ఏడాది వర్షాలకు బుజబుజ నెల్లూరు, పోలీసుకాలనీ, లెక్చరర్స్‌కాలనీ, గాంధీగిరిజనసంఘం, శివగిరికాలనీ, పరమేశ్వరినగర్‌, మనుమసిద్ధినగర్‌, ఇరుగాళమ్మ సంఘం, శ్రామికనగర్‌.. చెరువులను తలపించాయి. 2015 నవంబరులో వారంపాటు కురిసిన వర్షాలకు మద్రాసుబస్టాండ్‌, మన్సూర్‌నగర్‌, ఖుద్దూస్‌నగర్‌, పరమేశ్వరినగర్‌, వాకర్స్‌రోడ్డు, మనుమసిద్ధినగర్‌ చాలారోజులు నీటిలోనే ఉన్నాయి. నగరంలోని 14 పంట కాలువల ఆక్రమణలే ముంపునకు కారణమని గుర్తించినా ఇప్పటికీ చర్యల్లేవు.

ఇదీ చదవండి:

TELENGANA: "కష్టపడ్డందుకు రాజకీయ లాభం ఆశిస్తే తప్పేంటి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.