ETV Bharat / city

జగనన్న విద్యాకానుక.. ఇంకా కుట్టుకూలి కూడా అందలేదు!

author img

By

Published : Nov 21, 2020, 11:04 AM IST

జగనన్న విద్యాకానుకలో 13 లక్షల మందికి ఇంకా కుట్టుకూలి డబ్బులు అందలేదు. విద్యార్థులకు పంపిణీ చేసిన బూట్లు.. సైజుల ఇబ్బందితో తిరిగి వస్తున్నాయి. తల్లిదండ్రుల బయోమెట్రిక్, ఆధార్​కు పొంతన కుదరక వివరాలు ఇంకా పాఠశాల విద్యాశాఖకు చేరలేదు. లోపాల పరిష్కారానికి విద్యాకానుక వారోత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది.

జగనన్న విద్యాకానుక.. ఇంకా కుట్టుకూలి కూడా అందలేదు!
జగనన్న విద్యాకానుక.. ఇంకా కుట్టుకూలి కూడా అందలేదు!

పాఠశాలల విద్యార్థుల కోసం జగనన్న విద్యాకానుకను కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాది పాడు గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ గత నెల 8వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది విద్యార్థులకు 650 కోట్ల రూపాయలు విలువైన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి అదే వేదికగా శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్.. 6 నుంచి 10 వతరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగుతో పాటు 'స్టూడెంట్ కిట్' గా అందజేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే.. ఈ కిట్లు అందుకున్న 13 లక్షల మందికి ఇంకా దుస్తుల కుట్టుకూలి డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఒక్కో విద్యార్థికి మూడు జతల చొప్పున ఏకరూప వస్త్రాలను అందించారు. వీటికి కుట్టుకూలిని తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. తల్లిదండ్రుల బయోమెట్రిక్‌ నమోదు ప్రక్రియ పూర్తికాకపోవడంతో నగదు జమ పెండింగ్‌లో పడింది. 1-8 తరగతుల వారికి ఒక్కో జతకు 40 రూపాయలు, 9, 10 తరగతులకు 80 రూపాయల చొప్పున ఇవ్వాలి.

విద్యాకానుక కింద ఈ ఏడాది 42 లక్షల మందికి కిట్లను సరఫరా చేయగా.. సుమారు 29 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల బయోమెట్రిక్‌ వివరాలే నమోదయ్యాయి. వీటిల్లోనూ కొన్నింటికి బయోమెట్రిక్, ఆధార్‌కు మధ్య పొంతన కుదరడం లేదు.

కిట్లలో భాగంగా విద్యార్థులకు బూట్లు అందించారు. 1-5, 6-10 తరగతి వరకు చిన్న, పెద్ద సైజుల్లో ఒకే నంబర్లు ఉండటంతో కొంతమందికి అవి సరిపోవడంలేదు. ఉన్నతాధికారులు విజయవాడ సమీపంలోని పెనమలూరు పాఠశాలలో చేసిన తనిఖీల్లో ఈ విషయం బహిర్గతమైంది. కొన్నిచోట్ల తల్లిదండ్రులు తిరిగి అప్పగించగా.. కొంతమంది కొత్తవి ఇస్తేనే పాతవి ఇస్తామంటున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో ఇప్పటివరకు 700 మంది సైజుల మార్పు కోసం బూట్లను తిరిగి ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే సమస్య ఉండటంతో కొంతమంది విద్యార్థులు బూట్లు వేసుకోకుండానే బడులకు వస్తున్నారు.

విద్యాకానుక అమలు తీరును మెరుగుపర్చేందుకు ఈనెల 23 నుంచి 28 వరకు వారోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.లోటుపాట్లు గుర్తించి సరిదిద్దుకొని, వచ్చే ఏడాది మరింత పక్కా ప్రణాళికతో కిట్లను సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించెందుకే వీటిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:

తుంగభద్ర పుష్కరాలు మొదలైనా.. పూర్తికాని పనులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.