ETV Bharat / city

శతకానికి చేరువలో ఇంధన ధరలు.. రోజుకో కొత్త రికార్డు

author img

By

Published : Jan 24, 2021, 7:34 AM IST

petrol price Rising in andhrapradesh
petrol price Rising in andhrapradesh

పావలా.. పావలా చొప్పున పెరుగుతున్న ఇంధన ధరలు తెలియకుండానే వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో లీటరు పెట్రోలు ధర రూ.93.. డీజిల్‌ రూ.86 మార్కు దాటేశాయి. సెంచరీ దిశలో పరుగులు తీస్తున్నాయి.

తెలియకుండానే ఇంధన ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులు లీటరుకు చెల్లించే మొత్తంలో రెండొంతుల సొమ్ము (సుమారు రూ.60పైగా) పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకే జమవుతోంది. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు ఎక్సైజ్‌, ఇతర పన్నులు పెంచడం.. ముడిచమురు ధరలు పెరిగినప్పుడు పన్నులు తగ్గించకపోవడంతో వినియోగదారులపై భారం పడుతోంది.

నవంబరు రెండో వారం నుంచి..

గతేడాది నవంబరు రెండో వారం నుంచి పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. అప్పట్లో లీటరుకు రూ.87 వరకున్న పెట్రోలు ధర.. క్రమంగా పెరుగుతూ రూ.92కి పైగా చేరింది. డీజిల్‌ ధరలు కూడా రూ.77 నుంచి రూ.85కి పైగా చేరాయి. లీటరు పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.8కి పైగా పెరిగాయి.

  • శనివారం చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో అత్యధికంగా లీటరు పెట్రోలు రూ.93.82, డీజిల్‌ రూ.86.74 చొప్పున ఉంది. గుంటూరు జిల్లా మాచర్ల, అనంతపురం జిల్లా అగలి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లోనూ పెట్రోలు రూ.93కి చేరువలో ఉంది.

మూల ధర రూ.30 అయితే.. పన్నులతో రూ.62 అదనం

ఉదాహరణకు పెట్రోలు మూలధర లీటరుకు రూ.30 చొప్పున ఉంటే దానికి కేంద్ర ఎక్సైజ్‌ పన్ను రూ.33పైగా కలుస్తోంది. అంటే లీటరుకు రూ.63పైగా అవుతోంది. దీనికి డీలరు కమీషన్‌ రూపంలో రూ.3.50 కలిపితే రూ.66.50కి చేరుతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్‌, అదనపు వ్యాట్‌, రహదారి పన్నులను కలిపితే లీటరు రూ.26 వరకు పెరుగుతోంది. మొత్తంగా కలిస్తే లీటరు పెట్రోలు రూ.92 వరకు అవుతోంది. డీజిల్‌పైనా కేంద్ర ఎక్సైజ్‌ పన్ను లీటరుకు రూ.32 పైగా ఉండగా, డీలర్‌ కమీషన్‌ రూ.2.53 కలిపితే రూ.65 వరకు అవుతుంది. దీనికి రూ.20 వరకు రాష్ట్ర పన్నులు తోడవుతున్నాయి.

.
.

రాష్ట్రానికి రూ.10వేల కోట్లకుపైగా పన్నులు

పెట్రో ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఏటా రూ.10వేల కోట్లు వసూలవుతున్నాయి. 2014-15తో పోలిస్తే ఆరేళ్లలో పెట్రో ఆదాయం రూ.2వేల కోట్ల మేర పెరిగింది. కరోనా ప్రభావమున్నా తొలి అర్ధ సంవత్సరంలోనూ రూ.4,485 కోట్ల మేర వచ్చాయి.

దక్షిణాదిన.. ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం

దక్షిణాది రాష్ట్రాల్లో పెట్రో ధరల్ని పరిశీలిస్తే ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయి. పన్ను భారం ఎక్కువగా ఉండటంతో లీటరుకు రూ.3 చొప్పున అధికంగా చెల్లించాల్సి వస్తోంది. దిల్లీతో పోలిస్తే లీటరు పెట్రోలుపై రూ.7 వరకు తేడా కన్పిస్తోంది. డీజిల్‌పై ఇది రూ.9 వరకుంది. చెన్నై, బెంగళూరుతో పోల్చి చూస్తే.. పక్కనున్న చిత్తూరులో పెట్రోలుపై లీటరుకు రూ.4 ఎక్కువగా ఉంది.

పన్నుల భారమే కారణం

  • అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు కేంద్రం గతేడాది మార్చి, మే నెలల్లో.. 2దఫాలుగా పెట్రోలుపై లీటరుకు రూ.13, డీజిల్‌పై రూ.15 చొప్పున పెంచింది. ఎక్సైజ్‌ పన్నును పెంచింది. ఇప్పుడు ముడిచమురు ధరలు పెరిగినా అదే ఎక్సైజ్‌ పన్ను వసూలు చేస్తోంది.
  • అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు.. గతేడాది ఏప్రిల్‌లో సగటున బ్యారెల్‌కు 19.90 డాలర్లు ఉండగా.. అక్టోబరులో 40.66 డాలర్లకు చేరాయి. డిసెంబరులో 49.84 డాలర్లకు పెరిగాయి. అయితే ముడిచమురు ధరలు 2019లో సగటున 60.47 డాలర్ల మేర నమోదయ్యాయి. ముడిచమురు బ్యారెల్‌కు 65 డాలర్ల చొప్పున పలికినప్పుడూ పెట్రోడీజిల్‌ ధరలు ఇంత స్థాయిలో పెరగలేదు. దీనికి ప్రధాన కారణం.. అప్పట్లో పన్నుల భారం తక్కువగా ఉండటమే.
    .
    .
    .
    .
    .
    .

ఇదీ చదవండి: ప్రభుత్వ సహాయ నిరాకరణ: పతాక స్థాయికి పంచాయతీ పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.