ETV Bharat / city

ఏపీ జిల్లా కోర్టుల్లో 1.41 లక్షల పెండింగ్‌ కేసులు

author img

By

Published : Aug 5, 2021, 8:22 AM IST

రాష్ట్రంలో 52 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. లోక్​సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్​లో అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం జిల్లాల్లో లక్షకు పైగా కేసులు పెండింగ్​లో ఉన్నాయన్నారు.

pending cases in ap district courts
pending cases in ap district courts

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కోర్టుల్లో ప్రస్తుతం 1,41,214 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. 52 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లాజయదేవ్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘కేసుల పరిష్కారం విభిన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. విచారణలో జాప్యానికీ న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలు, వాయిదాలు, పర్యవేక్షణ కొరవడటం వంటి ఎన్నో కారణాలున్నాయి. ఇప్పటివరకు న్యాయాధికారుల నియామకాలను కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు, మరికొన్ని రాష్ట్రాల్లో హైకోర్టులతో సంప్రదించి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు చేపడుతున్నాయి. కిందిస్థాయి కోర్టుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను యేటా మార్చి 31న మొదలుపెట్టి అక్టోబరు 31కల్లా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు 2007 జనవరి 4న మాలిక్‌ మఝర్‌ కేసులో స్పష్టంచేసింది. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులకు 2016, 2017లో లేఖలు రాసింది. పెరుగుతున్న పెండింగ్‌ కేసులను దృష్టిలో ఉంచుకొని 2018 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌తోపాటు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు న్యాయశాఖ లేఖలు రాసింది’’ అని కిరెన్‌ రిజిజు వివరించారు. కేంద్ర మంత్రి వెల్లడించిన ప్రకారం విశాఖపట్నంలో అత్యధికంగా, విజయనగరంలో అతి తక్కువగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో యేటా పెండింగ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. 2016లో 99,720, 2017లో 1,09,941, 2018లో 1,16,736, 2019లో 1,24,534, 2020లో 1,30,580 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

.

ఏపీ నుంచి సవరించిన ప్రతిపాదనలు రాలేదు
విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం స్పష్టీకరణ

మెట్రోరైల్‌ విధానం-2017కి అనుగుణంగా విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైల్‌ ప్రాజెక్టుల ప్రతిపాదనలను సవరించి పంపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 2017లోనే సూచించామని, ఇప్పటివరకూ అక్కడి నుంచి అవి అందలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఎంపీ టీజీవెంకటేష్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘విశాఖలో పీపీపీ పద్ధతిలో లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు చేపట్టడానికి కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు నుంచి విదేశీ ఆర్థిక మద్దతు అందేలా చూడాలని ఏపీ ఓ ప్రతిపాదన పంపింది. దానిని పరిశీలించాక ఆర్థికసాయం చేయడం సాధ్యంకాదని కొరియా సంస్థ చెప్పింది. ఇప్పుడున్న నిబంధనలకు లోబడి మరేదైనా విదేశీ ఆర్థిక సంస్థ నుంచి ఆర్థికసాయాన్ని అర్థిస్తూ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాలశాఖ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఏపీ ప్రభుత్వానికి సూచించాం. అయితే ఏపీ నుంచి ఇప్పటివరకు తాజా ప్రతిపాదనలేమీ రాలేదు’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: suspend officers: అప్పుల గుట్టు రట్టు.. అధికారులపై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.