ETV Bharat / city

ఆపరేషన్​ చిరుత... ఎంతవరకు వచ్చిందంటే?

author img

By

Published : May 15, 2020, 10:18 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో కలకలం రేపిన చిరుత... అటవీ అధికారులకు చిక్కకుండా పారిపోయింది. వ్యవసాయ పొలంలో నక్కిన చిరుతను బంధించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బోన్లు, వలలు ఏర్పాటు చేసినప్పటికీ... వాటి నుంచి చిరుత తప్పించుకుపోయింది. చిరుత జాడను కనుక్కునేందుకు అటవీ, పోలీసు అధికారులు గాలిస్తున్నారు.

operation-cheetah-in-hyderabad
operation-cheetah-in-hyderabad

పట్టపగలే దర్జాగా నడిరోడ్డుపై పడుకొని ప్రజలను భయాందోళనకు గురి చేసిన చిరుత.... ఇప్పడు అటవీ అధికారులను తిప్పలు పెడుతోంది. రహదారిపై నుంచి వ్యవసాయ పొలంలోకి దూరి పొదల్లో నక్కిన చిరుత... అర్ధరాత్రి ఎవరి కంటా పడకుండా జారుకుంది. చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి వాటిలో మేకలను ఉంచి ఎరగా వేసినా... రుచి చూడకుండానే వెనుదిరిగింది. పొలంలో వలలు వేసినా... దానిబారిన పడకుండా పక్కనుంచి వెళ్లిపోయింది. చిరుత సంచారాన్ని గుర్తించేందుకు 25 సీసీ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా... ఒక్క దాంట్లో కూడా తన చిత్రం పడకుండా జాగ్రత్తపడింది. ఇవన్నీ కాకతాళీయంగానే జరిగినా... చిరుత మాత్రం సురక్షితంగా తప్పించుకుంది. చుట్టుపక్కల వాళ్లను మాత్రం భయాందోళనకు గురిచేస్తోంది.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్, బెంగళూర్ జాతీయ రహదారికి 200మీటర్ల దూరంలో నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో చిరుత సంచరించింది. కాటేదాన్ వెళ్లే ప్రధాన రహదారిపైనే పడుకున్న చిరుతను స్థానికులు గమనించారు. చిరుత పక్కనుంచే వాహనదారులు రాకపోకలు సాగించినా... అది ఎవరిని ఏమనకుండా మిన్నకుండిపోయింది. చుట్టుపక్కల వాళ్లు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలు నియంత్రించారు. జనం కేకలు వేయడం వల్ల చిరుత అక్కడి నుంచి పరుగెత్తి... పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ మీదుగా వ్యవసాయ పొలంలోకి వెళ్లింది. అటవీ అధికారులు వ్యవసాయ క్షేత్రాన్ని అధీనంలోకి తీసుకున్నారు.

అంత భద్రతలోనూ

నిన్న ఉదయం 10 గంటల నుంచి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అధికారులు గాలింపు నిర్వహిస్తే... చిరుత తప్పించుకొని పక్కనే ఉన్న జనావాసాల్లోకి వెళ్లి... మనుషులపై దాడి చేసే ప్రమాదముందని వెనక్కి తగ్గారు. ప్రజలను చూసి భయపడిన చిరుత పొదల్లోనుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనాకు వచ్చారు. చిరుతను బంధించేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు. రెండు బోన్లను తీసుకొచ్చి వాటిలో మేకలను ఉంచి ఎరగా వేశారు. ఒకవేళ బోన్లలోకి రాకుంటే.... వలలు కూడా ఏర్పాటు చేశారు.

హిమాయత్​సాగర్​వైపు వెళ్లిందా?

చిరుత పంజా జాడలను అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి చిరుత రాజేంద్రనగర్​లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు ఉన్న అడవి మీదుగా హిమాయత్ సాగర్ వైపు వెళ్లి ఉండొచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

చిరుత సంచారాన్ని గుర్తించేందుకు వ్యవసాయ పొలంలో పలుచోట్లు 25 సీసీ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. అటవీ, పోలీసు అధికారులు 24 గంటల పాటు కాపలా కాశారు. కానీ వీళ్లెవరి కంటా పడకుండా చిరుత అక్కడి నుంచి తప్పించుకుంది. చివరికి సీసీ ట్రాప్ కెమెరాలకు కూడా చిరుత చిక్కలేదు. పంజా జాడలను బట్టి అది హిమాయత్​సాగర్​ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. - ప్రకాశ్​రెడ్డి, శంషాబాద్​ డీసీపీ

ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.