ETV Bharat / city

'నైతికతే గాంధీజీ ఆశయం.. ఆ నీతిని అందించింది శాస్త్రినే'

author img

By

Published : Oct 2, 2021, 6:06 PM IST

గాంధీజీ, భారత రెండో ప్రధాని లాల్ బహదూర్​ శాస్త్రి జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. గాంధీ మహాత్మునికి, శాస్త్రికి నివాళులర్పించారు. సంపూర్ణ సమైక్య జాతి నిర్మాణం, రాజకీయాల్లో నైతికతను గాంధీ ఆశించారని చంద్రబాబు పేర్కొన్నారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని ఆయన ఆకాంక్షించారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

రాజకీయాల్లో నైతికతే గాంధీజీ ఆశయం అని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు తన పరిధిలో ఏ తప్పు జరిగినా దానికి తానే బాధ్యత వహించాలన్న నీతిని రాజకీయాలకు అందించిన మహానుభావుడు మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయుల చిత్రపటాలకు హైదరాబాద్​లోని తన నివాసంలో చంద్రబాబు నివాళులర్పించారు. నవభారత శక్తికి, భారతావని పవిత్రతకు, భారతీయుల ఉత్తమ సంస్కృతికి ప్రతీక గాంధీ జయంతి అని తెలిపారు. గాంధీజీ ఆశించినట్లుగా కుల, మతాలుగా విడిపోని సంపూర్ణ సమైక్య జాతి నిర్మాణం, నిజాయితీ కూడిన రాజకీయాలు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అప్పుడే సమాజాన్ని విడగొట్టే వారి కుట్రలకు అడ్డుకట్ట వేయగలమని అన్నారు.

ఆ ఆదర్శమే శాస్త్రిని విశిష్ఠ వ్యక్తిగా నిలిపింది

"నిరాడంబరత, నైతిక విలువలకు కట్టుబడి ఉండే ఆదర్శమే లాల్ బహదూర్ శాస్త్రిని విశిష్ట వ్యక్తిగా నిలిపాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు తన పరిధిలో ఏ తప్పు జరిగినా దానికి తానే బాధ్యత వహించాలన్న నీతిని రాజకీయాలకు అందించిన మహానుభావుడు. భారత మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి సందర్భంగా నీతి శాస్త్రం వంటి ఆయన జీవిత చరిత్రను మననం చేసుకుందాం"

-చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ అధినేత

మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చడం గాంధీ కలలుగన్న రాజ్యమా?

గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని మహిళలకు హామీ ఇచ్చారని కానీ అందరికీ అందుబాటులో మద్యం షాపులను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పొట్టగొట్టి మద్యం ఆదాయం పెంచడం గాంధీ ఆశయమా? అని ప్రశ్నించారు. సొంత కల్తీ బ్రాండ్లతో ప్రాణాలు తీయడం గాంధీ సిద్ధాంతమా? మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చడం గాంధీ కలలుగన్న రాజ్యమా? అని ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

'వస్తున్నా మీకోసం పాదయాత్ర' ప్రారంభించి 9ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్టీ నేతలు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కేక్ కట్ చేయించారు. 2012లో గాంధీ జయంతి రోజు నాటి ప్రతిపక్షనేతగా 63ఏళ్ల వయస్సులో చంద్రబాబు ప్రారంభించిన పాదయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో 208రోజులపాటు సాగిందని మొత్తం 16జిల్లాల్లో 2817కిలోమీటర్లు కాలినడకన తిరిగారని నాటి సంఘటనలను నేతలు గుర్తు చేసుకున్నారు.

మహాత్ముని కలలు నెరవేరాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అవినీతిపరుల చేతులకు అధికారమిచ్చి గాంధీజీ కోరుకున్న సమాజాన్ని నిర్మించటమెలా సాధ్యమో ఆలోచించాలని ప్రజల్ని కోరారు.

ఇదీ చదవండి: మహాత్మునికి, లాల్​ బహదూర్​ శాస్త్రికి సీఎం జగన్, చంద్రబాబు నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.