ETV Bharat / city

మొరాయిస్తున్న సర్వర్లు... ముందుకెళ్లని చెల్లింపులు

author img

By

Published : Jun 27, 2020, 12:43 PM IST

obstacles in  VMC tax payment due to server problem
పన్ను చెల్లింపులో కష్టాలు

సర్వర్‌ సమస్య... విజయవాడలో ఆస్తిపన్ను చెల్లింపుదార్లకు అడ్డంకిగా మారింది. దీంతో నగరపాలక సంస్థ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. ఇక నెలాఖరులోపు పన్ను కట్టిన వారికి ప్రభుత్వం ఇచ్చే 5 శాతం రిబేటు కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అదనంగా మరో 2 శాతం అపరాధ రుసుం సైతం కలిపి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఏడాదికి రూ.129.81 కోట్ల ఆస్తిపన్ను డిమాండ్‌ ఉంది. ఇటీవల వరకు ప్రతి ఏటా 98 శాతం వసూలవుతున్నట్లు అధికారులు ప్రకటిస్తుండగా, గడిచిన మూడు నెలలుగా వసూళ్లు పూర్తిగా మందగించాయి. ఈ స్థితిలో పన్ను చెల్లింపుదార్లను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వం 5 శాతం రిబేటు ప్రకటించింది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ నెలాఖరుతో ముగియగా, తిరిగి జూన్‌ 30 వరకు పొడిగించింది. దీంతో ఈ నెలలో భారీగా పన్ను వసూలవుతుందని భావించినా సాంకేతిక సమస్యలు అడ్డంకిగా నిలిచాయి. జూన్‌ మొదటి నుంచే సర్వర్‌ నెమ్మదించగా, గడిచిన వారం నుంచి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫలితంగా పన్నులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

భారీగానే వసూలు కావాలి..

డిమాండ్‌ ప్రకారం సగటున నెలకు రూ.10 కోట్లకు పైగానే వసూళ్ల లక్ష్యం ఉంది. పలు సందర్భాల్లో రోజుకు రూ.1.50 కోట్ల చొప్పున రాగా, ఒక్కొక్క రెవెన్యూ ఇన్‌స్పెక్టర్​కు రోజుకు రూ.30 లక్షల వరకు లక్ష్యం నిర్దేశించేవారు. సర్వర్‌ సమస్యతో ఈ నెలలో ఇప్పటి వరకు రూ.20 లక్షలు కూడా రాబట్టలేకపోయారు. డిస్కౌంట్‌ అవకాశం మరో 10 రోజులు మాత్రమే ఉండడంతో చెల్లింపుదార్లు ఆందోళన చెందుతున్నారు.

డిమాండ్‌ నోటీసుల్లో జాప్యం..

ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసులు నగరవాసులకు ఇప్పటికీ అందలేదు. వాటి తయారీలోనే జాప్యం జరిగిందని చెపుతుండగా, పంపిణీ ప్రక్రియను అధికారులు తాజాగా వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. వారు కూడా యజమానులకు అందజేయడంలో అలక్ష్యం చేస్తున్నారు. చెల్లించాల్సిన సొమ్ము ఎంతో తెలియక, అస్సెస్‌మెంట్‌ నెంబరులేక పలువురు చెల్లింపులకు ముందుకు రాని పరిస్థితి ఉంది.

ఎంఏయూడీ దృష్టికి తీసుకెళ్లాం...

సర్వర్‌ బాగా నెమ్మదిగా ఉంది. సక్రమంగా పనిచేసిన సమయంలో మాత్రం పన్నులు స్వీకరిస్తున్నారు. సమస్యను అదనపు కమిషనర్‌, నేను కలిసి ఎంఏయూడీ దృష్టికి తీసుకెళ్లాం. వారితో తరచూ మాట్లాడుతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే, పన్నులు చెల్లించేందుకు వచ్చే వారి నుంచి నగదు స్వీకరించి రసీదులు ఇస్తాం. ఆ వివరాలను ప్రత్యేకంగా ఒక పుస్తకంలో నమోదు చేస్తాం. డిమాండ్‌ నోటీసులు రాగానే డిస్కౌంట్‌ సొమ్ము పోస్టింగ్‌ వేసేలా చర్యలు తీసుకుంటాం - వెంకటలక్ష్మి, డీసీఆర్‌

ఆస్తిపన్ను డిమాండ్‌ రూ.129.81 కోట్లు

నెలకు వసూలు లక్ష్యం రూ.10 కోట్లు

ప్రస్తుతం వసూళ్లు రూ.20 లక్షలు

ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.