ETV Bharat / city

No Security Hospitals: ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత ఎక్కడ..?

author img

By

Published : Apr 24, 2022, 1:29 PM IST

No Security in Government Hospitals:‍‌ ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే మహిళలు భయపడుతున్నారు. సరైన పర్యవేక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. మద్యం సేవించిన వ్యక్తులు సైతం నిత్యం ఆసుపత్రుల్లో కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల మహిళా రోగుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. ఆస్పత్రికి ఎవరు వస్తున్నారో, వెళ్తున్నారో పర్యవేక్షించాల్సిన భద్రతా సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు సైతం పనిచేయడం లేదంటే... పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు.

SECURITY IN Govt HOSPITALS
SECURITY IN Govt HOSPITALS

ప్రభుత్వ ఆస్పత్రుల్లో..భద్రత ఏదీ..?

No Security in Government Hospitals: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిఘా నిద్రపోతోంది. పర్యవేక్షణ మచ్చుకైనా కనిపించడం లేదు. మహిళా రోగులకు కనీస అవసరాలు కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో మహిళా రోగులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించిన వ్యక్తులు మహిళా వార్డుల్లోకి ప్రవేశిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిత్యం వేల మందితో కిటకిటలాడే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొద్దిమంది మాత్రమే వైద్యం కోసం వస్తారు. మిగిలిన వారు ఎందుకు వస్తారో, ఎక్కడికి వెళ్తారో గమనించే వారు లేకపోవడంతో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖ, గుంటూరు తదితర ఆసుపత్రుల్లో సరైన భద్రతా సిబ్బంది లేకపోవడంతో శిశువుల అపహరణ, వస్తువుల చోరీ లాంటి ఘటనలు జరిగాయి. ఆసుపత్రుల్లో పనిచేసే ఉద్యోగుల వద్ద సైతం సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో రోగి ఎవరో, సిబ్బంది ఎవరో గుర్తించే పరిస్థితి లేదు. ఇటీవల విజయవాడ జీజీహెచ్‌లో జరిగిన అత్యాచార ఘటన... భద్రతా డొల్లతనానికి నిదర్శనం.

బోధనాసుపత్రుల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో ఉండటంతో సమన్వయం దెబ్బతింటోంది. వీరు కేవలం క్యూ వద్ద మాత్రమే ఉంటున్నారు. రోగులు, వారి బంధువులకు ఏ విభాగం ఎటు ఉందో చెప్పటానికి మాత్రమే పరిమితమవుతున్నారు.

రోగుల బంధువులు, సహాయకులకు సరైన పాసులు ఇవ్వడం లేదు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు... బయటి వారు వస్తున్నారు. వీరిని ప్రశ్నించేవారు లేకపోవడంతో మహిళా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయకులు, రోగుల బంధువుల చరవాణులు, విలువైన వస్తువులు అపహరణకు గురవుతున్నాయి. బాధితులు వైద్యులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన కనిపించడం లేదు.

తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగింది. ఆమెపై 30 గంటలుగా అఘాయిత్యం జరిగినా.. ఎవరి కంటా పడలేదంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండి ఉంటే.. అక్కడ అంత ఘోరం జరిగి ఉండేది కాదని పలువురు ఆరోపిస్తున్నారు.

గత నెలలో విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రి ప్రసూతి విభాగంలో గుర్తుతెలియని ఇద్దరు మహిళలు నర్సుల్లా నటించి వైద్యం పేరుతో శిశువులను అపహరించుకుపోయిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసి నివ్వెరపోయారు. కొన్ని ఆసుపత్రుల్లో నర్సులు తక్కువగా ఉండటంతో మహిళా రోగులు... తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య విభాగం, లాండ్రీ తదితర ఉద్యోగుల్ని నియమించే క్రమంలో సరైన ప్రమాణాలు సైతం పాటించటం లేదు.

పేదలకు సేవలందించాల్సిన ప్రభుత్వాసుపత్రుల్లో... సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎవరు వస్తున్నారో, వెళ్తున్నారో నిఘా పెట్టడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమవుతోంది. దీనివల్ల అత్యాచారాలు, దోపిడీలు, శిశువుల అపహరణ లాంటి ఘటనలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు అమర్చి భద్రత విషయంలో రాజీ పడకుండా ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.


ఇదీ చదవండి : పండ్ల రసం కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి... బాలికపై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.