ETV Bharat / city

మావోయిస్టు ఆర్కే భార్య, విరసం నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

author img

By

Published : Jul 19, 2022, 12:21 PM IST

Updated : Jul 19, 2022, 6:54 PM IST

NIA
ఎన్​ఐఏ

NIA Searches: విజయవాడ, ప్రకాశం జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులకు నగదు బదిలీలు జరిగినట్లు ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. తనిఖీ వివరాలను ఎన్‌ఐఏ గోప్యంగా ఉంచుతోంది.

NIA Raids: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం నాయకుడు కల్యాణరావు, మావోయిస్టు ఆర్కే భార్య శిరీష ఇంట్లో తనిఖీలు జరిపారు. జిల్లా పోలీసు బలగాల సహాయంతో వారి ఇళ్లను చుట్టుముట్టారు. స్థానికులను, మీడియా ప్రతినిధులను పరిసరాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానాలతో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ సింగ్‌నగర్‌లోని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డి ప్రభాకర్‌ ఇంట్లోనూ ఎన్‌ఐఏ ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించింది. అన్యాయాలను ప్రశ్నించిన ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నాయకులపై కావాలనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని దొడ్డి ప్రభాకర్ మండిపడ్డారు. అమాయకురాలైన ఆర్కే భార్య శిరీషను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ఐఏ సోదాలపై ఆర్కే భార్య శిరీష స్పందించారు. సోదాల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భర్త చనిపోయి బాధపడుతుంటే విచారణ పేరుతో వేధిస్తారా ? అని ప్రశ్నించారు. "అనారోగ్య సమస్యలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి.. అజ్ఞాతవ్యక్తులు మా ఇంటి వద్ద ఉన్నారంటూ సోదాలు చేస్తున్నారు. నేను ఏం నేరం చేశానని ? నేరం చేసినవాళ్లు రోడ్లపై తిరుగుతుంటే మాత్రం పట్టించుకోరు. మహిళ అని కూడా చూడకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు" అని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ లూనా సెంటర్‌లోని ఓ గృహంలో కూడా ఎన్‌ఐఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులు అక్కడ ఏడాదిగా అద్దెకు ఉంటున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటిపై ఎన్‌ఐఏ అధికారుల బృందం దాడి చేసింది. ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులకు నగదు బదిలీలు జరిగినట్లు ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు సానుభూతిపరులు ఉన్న ఇంటి వద్దకు స్థానిక పోలీసులను ఎన్‌ఐఏ అధికారులు అనుమతించలేదు. ఈ తనిఖీ వివరాలను ఎన్‌ఐఏ గోప్యంగా ఉంచుతోంది.

ఇవీ చదవండి:

Last Updated :Jul 19, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.