Minister Suresh On Employees protest: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని.. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రావాలని, సమస్యలపై చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం సమక్షంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు గౌరవించాలని సూచించారు.
"ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని ప్రభుత్వం కోరుతోంది. సీఎం సమక్షంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు గౌరవించాలి. సమస్యలుంటే వెంటనే చర్చలకు రావాలని కోరుతున్నా. ప్రభుత్వం ఇచ్చింది చీకటి జీవోలు కావు.. పగలు ఇచ్చినవే. పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఉపాధ్యాయులు ఆలోచించాలి." -ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖ మంత్రి
పెద్ద మనసు చేసుకొని చర్చలకు రావాలి: హోంమంత్రి
ఉద్యోగులు పెద్ద మనసు చేసుకొని చర్చలకు రావాలని.., ప్రభుత్వానికి సహకరించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత కోరారు. ఉద్యోగులను గృహనిర్బంధం చేయలేదని.., అనుమతి లేని ఉద్యమాలకు వెళ్లవద్దని మాత్రమే సూచించామన్నారు. చర్చల్లో పాల్గొని సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు చెప్పామన్నారు. ఘర్షణ వాతావరణాన్ని ప్రభుత్వం కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగుల వేతనాలు పెరిగాయి తప్ప ఎవరికీ తగ్గలేదన్నారు.
ఉద్యోగులను విస్మరించలేదు..
ప్రభుత్వం క్లిష్లపరిస్థితులను ఎదుర్కొంటున్నా..ఉద్యోగులను విస్మరించకుండా పీఆర్సీ ప్రకటించిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు నాలుగు డీఏలను ఇవ్వటం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ అప్పుల్లో ఉన్నప్పటికీ, ఉద్యోగులకు అన్ని ప్రోత్సాహకాలు అందించటం జరుగుతుందన్నారు.
'చలో విజయవాడ' విజయవంతం..
ఉద్యోగులు నిర్వహించిన 'చలో విజయవాడ' కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ఉద్యోగుల ఆకాంక్షల ముందు ప్రభుత్వ ఆంక్షలు చిన్నబోయాయి. పీఆర్సీ సాధించాలన్న లక్ష్యం ముందు పోలీసుల నిర్భంధం పని చేయలేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ అన్నిదారులు విజయవాడ వైపే కదిలాయి. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై పూరించిన సమరశంఖం దుర్గమ్మ సన్నిధిలో ప్రతిధ్వనించింది. చలో విజయవాడ కోసం తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో ఉద్యమాల గడ్డ బెజవాడ దద్దరిల్లింది. బీఆర్టీఎస్ రహదారి వేదికగా ఉద్యోగులు రణభేరి మోగించారు. డిమాండ్లు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆగబోదని తేల్చి చెప్పారు. ఈనెల 6 అర్థరాత్రి నుంచి సమ్మె తప్పదని.. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశారు.
సీఎం జగన్తో సజ్జల, సీఎస్ భేటీ
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశమయ్యారు. మెరుగైన పీఆర్సీ కావాలంటూ ఉద్యోగులు నిర్వహించిన 'చలో విజయవాడ' కార్యక్రమం విజయవంతం కావటంపై చర్చించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల చలో విజయవాడపై సీఎం జగన్ ఆరా తీశారు. ఉద్యోగుల పీఆర్సీ ఆందోళనలపై సీఎస్ సమీర్ శర్మ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి