ETV Bharat / city

HIGH COURT: ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాల నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం

author img

By

Published : Aug 10, 2021, 3:23 AM IST

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఇతర భవన నిర్మాణాలు చేపట్టరాదన్న ఆదేశాలు పెడచెవిన పెట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై కోర్టు ధిక్కరణ కేసులో హాజరైన ఏడుగురు ఐఏఎస్​ అధికారులపై మండిపడింది. కోర్టు ఆదేశాలు అమలు చేయాలంటూ కిందిస్థాయి సిబ్బందిని ఎందుకు ఆదేశించలేదని నిలదీసింది.

HIGH COURT
HIGH COURT

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు సహా ఇతర నిర్మాణాలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలంటూ.. గతేడాది జూన్‌లో ఇచ్చిన ఆదేశాల్ని పట్టించుకోకపోవడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఈ వ్యవహారంపై కోర్టు ముందు హాజరైన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ వి.చిన్నవీరభద్రుడు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పురపాలక శాఖ అప్పటి డైరెక్టర్ జి.విజయకుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎం.ఎం.నాయక్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందికి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదని నిలదీసింది. ఇప్పటికైనా దిగువ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఉంటే కోర్టు ధిక్కరణ కేసును మూసివేసేందుకు సిద్ధమని స్పష్టంచేసింది. అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో.. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్ని కాపాడే బాధ్యత నుంచి తప్పించుకునేలా మీ వైఖరి కనబడుతోందని వ్యాఖ్యానించింది. కోర్టు ముందు హాజరైన అధికారుల్లో ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారా, ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు చదువుకుంటారని తెలియదా అని నిలదీసింది. వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పుకుంటారని ప్రశ్నించింది. 2020 జూన్‌లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఏముందో ఇప్పటికైనా మీకు తెలుసా అని ఆగ్రహించింది. 90 శాతం మంది ఐఏఎస్‌లు.. కోర్టు ఆదేశాల్ని అమలు చేయాల్సిన అవసరం లేదనే భావనలో ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంచాయతీరాజ్ శాఖ, పురపాలకశాఖ, పాఠశాల విద్యాశాఖ అధికారులు బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిరద్శనమని, శిక్ష విధించడానికి ఇది సరైన కేసు అని అభిప్రాయపడింది.

ఈ వ్యవహారంపై ఆయా శాఖల అధికారులతో చర్చిస్తామని, కోర్టు ఆదేశాలు అమలయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్.. హైకోర్టుకు తెలిపారు. పురపాలక శాఖ మునుపటి ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కోరారు. హైదరాబాద్‌లో సమావేశం ఉన్నందున విచారణకు హాజరు కాలేదన్నారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్లు వేయడానికి సమయం ఇవ్వాలన్నారు. అందుకు అంగీకరించిన జస్టిస్ బట్టు దేవానంద్.. విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. తదుపరి విచారణకు మొత్తం 8 మంది ఐఏఎస్‌లు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు.

విశాఖ జిల్లాకు సంబంధించిన ఓ వ్యాజ్యం విచారణ సందర్భంగా.. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయం సహా ఏ ఇతర నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని.. పురపాలక శాఖ, విద్యాశాఖ అధికారులను గతేడాది హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను భేఖాతరు చేస్తూ విశాఖ జిల్లా తిరువోలు, నెల్లూరు జిల్లా కోటపోలూరు, కర్నూలు జిల్లా మిడూరు మండలం తాళ్లముడిపి గ్రామాల్లో.. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు నిర్మించడంపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తంచేసిన హైకోర్టు.. మొత్తం 8 మంది ఐఏఎస్‌లపై సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేసింది.

ఇదీ చదవండి:

సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూముల వివాదంపై దర్యాప్తునకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.