ETV Bharat / city

రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్​

author img

By

Published : Jul 23, 2022, 5:30 PM IST

cm kcr
cm kcr

Rains in TS: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులో ఉండాలన్నారు. ఈ మేరకు సీఎస్​ సోమేశ్​కుమార్ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.​

Rains: రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. రాగల నాలుగు వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదైందని.. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎగువ నుంచి గోదావరి నదిలోకి మళ్లీ వరద నీరు వచ్చే సూచనలు ఉండటంతో.. గోదావరి పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలన్నారు.

ఇంద్రకరణ్​రెడ్డితో ఫోన్​లో మాట్లాడిన కేసీఆర్​..: ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై మంత్రి ఇంద్రక‌ర‌ణ్​రెడ్డితో సీఎం ఫోన్​లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వర‌ద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్న కేసీఆర్​.. మ‌రో 24 గంట‌ల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. హెలీప్యాడ్​లను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.

సీఎస్​ టెలీ కాన్ఫరెన్స్..: ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని సీఎస్​ సోమేశ్​కుమార్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో కలిసి కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. పూర్తి అప్రమత్తతతో ఉండాలని చెప్పారు. వరుసగా వస్తున్న రెండు రోజుల సెలవులను ఉపయోగించకుండా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు.

పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉందని సీఎస్​ సూచించారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండిన జలాశయాలు, చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రహదారులు, వంతెనలు తెగిన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా రాకపోకలు నిలిపి వేయాలన్నారు. పోలీస్​, నీటి పారుదల, ఆర్ అండ్ బీ, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖలన్నీ మరింత సమన్వయంతో పని చేయాలని సీఎస్ ఆదేశించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.