ETV Bharat / city

Fathers Day: నాన్నా.. మీ పాత్ర మరువలేం..!

author img

By

Published : Jun 20, 2021, 10:14 AM IST

fathers day
fathers day

ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర వెలకట్టలేనిది. వారుంటే పిల్లలకు భరోసా. మనం అమ్మ గురించి కాస్త ఎక్కువే చెబుతాం.. చెప్పాలి కూడా.. ఎందుకంటే వారు లేకుంటే మనం ఇక్కడ లేం.. ఉండం కూడా.. కాని నాన్న గురించి కూడా చెప్పుకోవాలి. ఇవాళ ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా.. నాన్న గురించి మాట్లాడుకుందాం.

నాన్న.. మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి.. తనలోని బాధని మనకు తెలియనీయకుండా లోలోపలే దాచుకునే భోళాశంకరుడు. అలాంటి తండ్రి.. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడే..మనం ఎగిరే గాలిపటం.. మనను ఎగిరేసిది అమ్మ.. ఆ రెండింటి మధ్య దారం ఉంటుంది. అది కనిపించదు. నాన్న ప్రేమ కూడా అంతే.. ఆ దారంలాంటిదే నాన్న చూపించే ప్రేమ.. చూసేవారికి అది ఎంత మాత్రం కనిపించదు. కానీ.. గమ్యాన్ని చేరేందుకు మార్గం చూపేది అదే.

అమ్మకు ఏదైనా బాధ వస్తే నాన్నకు చెప్పుకొంటుంది. దుఃఖం వస్తే ఏడుస్తుంది. కానీ... నాన్నకు బాధేస్తే.. ఆయనకంటూ దుఃఖం వస్తే.. తన బాధ భార్యాపిల్లలకు చెబితే ఏమవుతారో అని తనలోనే దాచుకునే వ్యక్తిత్వం ఆయనది. అందుకే అంత కఠినంగా కనిపిస్తాడు నాన్న. కానీ.. ఆ కఠినత్వం వెనక నలిగే సున్నితత్వాన్ని పిల్లలు గుర్తించలేరు.

మనం గెలిస్తే తను గెలిచినట్లు ఆనందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే... అది ముందుగా నాన్న మాత్రమే. అందుకే.. ప్రతీ తండ్రీ తన పిల్లలు తనకన్నా బాగా బతకాలని ఆలోచిస్తుంటాడు. ఆ క్రమంలో పిల్లలతో కఠినంగా ఉంటాడే తప్ప మనపై కోపం మాత్రం ఆయన మనసులో ఉండదు. చిన్నప్పుడు పిల్లలు స్కూల్​కు వెళ్లకుంటే నాన్న.. బెదిరించో, భయపెట్టో పంపిస్తాడు. అప్పుడు తండ్రి అంటే భయం, కోపం వస్తుంది. కానీ.. జీవితంలో నిలదొక్కుకున్న తర్వాత తెలుస్తోంది. నాన్న అప్పుడు.. అలా.. ఎందుకు అలా చేశాడో.

తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని ఎంతో కష్టపడతారు. ఓ పూట తిని, మరో పూట పస్తులుండి చదివిస్తారు. వాళ్లను ప్రయోజకుల్ని చేస్తారు. అందుకే... పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా.. దానికి కారణం వాళ్ల తల్లిదండ్రులే. కానీ.. అదే పిల్లలు పెద్దలై.. పెళ్లి చేసుకుని సంతానాన్ని కన్న తరువాత.. వారిలో మార్పు కనిపిస్తోంది. కన్న తల్లిదండ్రులను భరించలేని స్థితి ఏర్పడుతోంది. ఏదో ఒక వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్లిపోతున్నారు. మరి కొందరైతే.. తల్లిదండ్రులు చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా వెళ్లడం లేదు. ఏదో ఒక రోజు తమకూ అదే గతి వచ్చే అవకాశం ఉందని వారు అర్థం చేసుకోవడం లేదు.

ఎవరైనా సరే. ఎంతటి వారైనా సరే. నా.. అని అనుకున్న ప్రతి దాంట్లో.. నాన్న ప్రమేయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కచ్చితంగా ఉంటుంది. అంతటి ఉన్నతమైన.. ఉదాత్తమైన వ్యక్తిత్వం నాన్నది. తనకు తాను ఏదీ దాచుకోకుండా.. పిల్లల ఆనందమే తన ఆస్తిగా భావిస్తూ.. తన రక్తాన్ని చెమటగా మార్చి శ్రమిస్తాడు నాన్న. అంతటి నాన్నను, ఆయన చూపే ప్రేమ వెనక నిలబడి కుటుంబాన్ని నడిపించే అమ్మను.. వారి వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం తగని పని. అందుకే.. అమ్మ తోడుగా నాన్నను గౌరవిద్దాం. మన జీవితంలో ఆయన పాత్రకు మరింత విలువ ఇద్దాం. ఆయన శ్రమకు ఆప్యాయతతో.. అనురాగంతో.. తగిన గుర్తింపు కల్పిద్దాం.

ఇదీ చదవండి:

FATHERS DAY: అమెరికా అధ్యక్షుడైనా.. అబ్రహంలింకన్‌ కూడా తండ్రే కదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.