ETV Bharat / city

Prakash javadekar on YSRCP: బెయిల్‌పై ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చు: ప్రకాశ్​ జవదేకర్

author img

By

Published : Dec 28, 2021, 5:21 PM IST

Updated : Dec 29, 2021, 4:35 AM IST

Prakash javadekar on YSRCP
Prakash javadekar on YSRCP

17:16 December 28

prakash javadekar in prajagraha sabha: భాజపా ప్రజాగ్రహ సభలో మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్​ జవదేకర్

ప్రజాగ్రహ సభలో మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్​ జవదేకర్ ప్రసంగం

ఏపీలో చాలామంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. వాళ్లు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపాకు ప్రత్యామ్నాయంగా రానున్న ఎన్నికల్లో భాజపాను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్​ ప్రభుత్వం విఫలమైందన్నారు. వైకాపా, తెదేపా, తెరాస.. మూడూ కుటుంబ పార్టీలే... ఈ 3 ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ప్రకాశ్‌ జావడేకర్‌ ఆరోపించారు. విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీలో తెదేపా, వైకాపా రెండూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెదేపా, వైకాపా రెండూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ప్రజలు ఆశీర్వదిస్తే.. చిన్న పార్టీగా ఉన్న భాజపా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్మాణాత్మక పాలన సాగుతుంటే.. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని మండిపడ్డారు.

రాజధానిపై రెండు పార్టీల ఘర్షణ

‘రాష్ట్రాన్ని రెండు, మూడు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. నేను పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు రికార్డు సమయంలో పోలవరం నిర్మాణానికి అనుమతులు ఇచ్చాను. ఏడేళ్లు గడిచినా అది పూర్తి కాలేదు. ఈ విషయంలో తెదేపా, వైకాపా ప్రభుత్వాలు రికార్డు సృష్టిస్తున్నాయి. అమరావతి రాజధాని కోసం అటవీ భూములను వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాను. అయితే.. రాజధాని విషయంలో రెండు పార్టీలు ఘర్షణ పడుతున్నాయి’ అని జావడేకర్‌ మండిపడ్డారు.

‘పుష్ప’లోలాగే రాష్ట్రంలోనూ..

పుష్ప సినిమాలో లాగే రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ సాగుతోందని ప్రకాశ్‌ జావడేకర్‌ ఆరోపించారు. ‘నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధానికి వేసిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్సును ఏపీలో రద్దు చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని వైకాపా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ప్రస్తుతం మద్యం విక్రయాలతో వచ్చే డబ్బుతోనే రాష్ట్రంలో పాలన సాగుతోంది. జగన్‌ ఇచ్చిన వాగ్దానాలను అసలు అమలు చేయట్లేదు’ అని ధ్వజమెత్తారు.

‘ప్రధాని మోదీ నాయకత్వంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. దేశవ్యాప్తంగా జై శ్రీరాం నినాదం మార్మోగుతోంది. కాశీలో కొత్తగా కారిడార్‌ నిర్మాణం జరిగింది. రాష్ట్రంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టారు. రామతీర్థంలో రాముని విగ్రహానికి అవమానం జరిగింది. ఇది చాలా బాధాకరం. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోంది. గూండాయిజాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోంది’ అని జావడేకర్‌ పేర్కొన్నారు.

..

అవి మోదీ కాలనీలు.. జగనన్న కాలనీలు కావు

‘రాష్ట్రంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి డబ్బులు పంచుతున్నారు. కేంద్రం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వేస్తోంది. రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అతికిస్తున్నారు. ప్రధాని ఆవాస్‌ యోజన కింద కేంద్రం ఇళ్లు నిర్మిస్తోంది. సీఎం వాటికి జగనన్న కాలనీలుగా పేరు పెట్టారు. విద్యార్థులకు యూనిఫాంలు కేంద్రం ఇస్తుంటే జగనన్న కానుకగా ప్రచారం చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కోసం కేంద్రం డబ్బులు ఇస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధులుగా ప్రచారం చేస్తోంది. వైకాపా దౌర్భాగ్య పాలన గురించి గంటలకొద్దీ మాట్లాడగలను’ అని జావడేకర్‌ పేర్కొన్నారు.

భాజపా మద్దతుతోనే అధికారంలోకి తెదేపా

‘నేను 2014 ఎన్నికల్లో భాజపా ఎన్నికల ఇంఛార్జిగా ఉన్నా. భాజపా సాయంతోనే తెదేపా అధికారంలోకి వచ్చింది. తొలి రెండేళ్లు భాజపాతో తెదేపా సఖ్యతగా వ్యవహరించలేదు. తర్వాత భాజపాను విమర్శించారు. తర్వాతి ఎన్నికల్లో తెదేపా అధికారానికి దూరమైంది. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారు. నాకు ఏపీ అంటే అమితమైన ప్రేమ. నేను అన్ని ప్రాంతాల్లో పర్యటించాను. ఏపీ భోజనం అంటే మరింత ఇష్టం’ అని పేర్కొన్నారు. జావడేకర్‌ ఆంగ్ల ప్రసంగాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు.

ఇదీ చదవండి..

BJP Leaders ON CM Jagan: భాజపా అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి: సోము వీర్రాజు

Last Updated : Dec 29, 2021, 4:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.